అంబెడ్కర్ విగ్రహాలూ, స్మృతివనాలు సరిపోవు...

former ias officer EAS Sarma writes to Naidu on ambedkar statue

మాజీ ఐఎఎస్ అధికారి,  ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ

 

 

former ias officer EAS Sarma writes to Naidu on ambedkar statue

అయ్యా

మీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు, శ్రీ నక్కా ఆనందబాబు గారు, ఒక విశ్రాన్త అఖిల భారత సర్వీస్ అధికారిగా నాకు, మీద సూచించిన విషయం, అంటే  డా. అంబెడ్కర్ గారి పేరున 125 అడుగుల విగ్రహం స్థాపించడం, డా. అంబెడ్కర్ స్మృతి వనాన్ని నిర్మించడం గురించి సలహాలిమ్మని విజయవాడలో ఒక ఐదు నక్షత్రాల హోటలులో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆహ్వానించారు. ధన్యవాదాలు. నేను వ్యక్తిగతంగా రాలేకపోయినా, కొన్ని సలహాలు ఈ క్రింద సూచించినట్లు ఇస్తున్నాను. 

 

డా. అంబెడ్కర్ గారు దేశంలో వెనుకపడిన వర్గాల హృదయాలలో ఎప్పుడూ నివసించే మహానుభావుడు. ఆయన, వారందరికీ ఆత్మ ధైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని కలుగచేసిన మహాశయుడు. ఆయన భావాలను, ఆశయాలను, కేవలం అమరావతిలో స్థాపించే విగ్రహహానికి మాత్రమే, అక్కడ నిర్మించే స్మ్రుతి వనానికి మాత్రమే పరిమితించకుండా, రాష్త్ర వ్యాప్తంగా ప్రోత్సహించాలని నా సలహా. 

 

స్వాతంత్య్రం వచ్చి సుమారు ఏడు దశాబ్దాలు అయినా, సమాజంలో షెడ్యూల్డ్ కులాలవారి, గిరిజనుల, ఇతర వెనుకపడ్డ వర్గాల పరిస్థితి ఇంకా మెరుగు పడలేదు. Dr అంబెడ్కర్ వంటి మహనీయులచే రచించ బడిన రాజ్యాంగం ఆయా వర్గాలకు ఇచ్చిన హక్కులను, అధికారాలను ప్రభుత్వాలు వారికి పూర్తిగా కలిగించలేదు. రిజర్వేషన్లు ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని ఖాళీలను భర్తీ చేయలేదు.  

 

ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, అంటే, కొవ్వాడ అణుశక్తి కేంద్రం, భోగాపురం విమానాశ్రయం, కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి, గోదావరి, కృష్ణా జిల్లాలలో ఆక్వా పరిశ్రమలు, మచిలీపట్టణం పోర్టు , అమరావతి రాజధాని ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు , అలాగ ఎన్నో ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వారు ఎవరు? ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలవారు , గిరిజనులు, సాంప్రదాయక మత్స్యకారులు, ఇతర వెనుకపడ్డ వర్గాలవారు, చిన్నకారు వ్యవసాయదారులు. భూములు త్రీసుకొన్నందుకు వారికి ఇచ్చే నష్ట పరిహారం చాలామట్టుకు పట్టా దారులుగా చెలామణి అయి, నగరాలలో నివసించే కామందులకు లభించింది. చిన్నవారికి, అంటే కౌలు రైతులకు, ప్రభుత్వ భూములలో వ్యవసాయం చేసుకొనే భూ పట్టాలు లేని వ్యవసాయదారులకు లభించిన నష్ట పరిహారం నామ మాత్రమే. అటువంటి నిరాధార కుటుంబాలకు, చిత్త శుద్ధితో  ప్రభుత్వం చేయూత ఇచ్చినప్పుడే, డా. అంబెడ్కర్ గారి కలలు నిజమవుతాయి. 

 

ఇదే కాదు. "పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం" ముసుగులో ప్రభుత్వం చాలా  విలువ ఉన్న  ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు  ప్రైవేటు కంపెనీలకు ముట్టపెట్టి, ప్రభుత్వం షేరు అటువంటి తక్కువ ధరల ఆధారంగా 10%-15% కు మాత్రమే  త్రప్పుగా చూపించి, ఆ  సంస్థలను ప్రైవేటు సంస్థలుగా పరిగణించి, షెడ్యూల్డ్ కులాలవారు, గిరిజనులు, ఇతర వెనుకపడ్డ వర్గాలకు చట్టపరంగా రావలిసింది రిజెర్వేషన్లను రాకుండా చేయడం ఎంతవరకు సమంజసం? Dr అంబెడ్కర్ గారికి మనః శాంతి కలగాలంటే, అటువంటి "పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం" ఉన్న వ్యవస్థలను ప్రభుత్వ వ్యవస్థలుగా పరిగణించి షెడ్యూల్డ్ కులాలవారు, గిరిజనులు, ఇతర వెనుకపడ్డ వర్గాలకు రిజెర్వేషన్లను కలిగించాలి. ఆ రిజెర్వేషన్లను తత్క్షణం భర్తీ చేస్తే, వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 

 

చాలా గిరిజన ప్రాంతాలు రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ లో నోటిఫై అయిన  ప్రాంతాలు. అక్కడ గిరిజనులకు భూములమీద, ఖనిజాలమీద, ఇతర ప్రక్రుతి వనరుల మీద  ప్రత్యేక హక్కులు ఉన్నాయి. పెసా (PESA)  చట్టం ప్రకారం గిరిజన గ్రామ సభలకు పథకాలమీద ప్రోజెక్టులమీద నిర్ణయాలను తీసుకొనే అధికారాలు ఉన్నాయి . ఆయా హక్కులను, అధికారాలను కించపరచడం జరుగుతున్నది. రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం అక్కడి శాసన సభ్యులతో కూడిన గిరిజన సలహా మండలిని నియమించవలసి ఉంది, కాని, మీ ప్రభుత్వం మూడేళ్లకు పైగా ఐదవ షెడ్యూల్ ను ధిక్కరించింది. అంటే, Dr  అంబెడ్కర్ గారి వంటి మహనీయులు గిరిజనులకు ఇచ్చిన రాజ్యాంగ హక్కులను పక్కన పెట్టినట్లు కాదా? ఇప్పుడైనా, గిరిజన ప్రాంతాలలో, ఎటువంటి ప్రాజెక్టులను తలపెట్టినా, గిరిజనులతో  ముందస్తు సంప్రదించి, నిర్ణయాలను తీసుకోవాలని నా విజ్ఞప్తి. 

 

గిరిజన ప్రాంతాలలో, ఐదవ షెడ్యూలు గ్రామాలలో, అటవీ హక్కుల చట్టాన్ని మీ ప్రభుత్వం అమలు చేయకపోవడం వలన గిరిజనులకు అపారమైన నష్టం వాటిల్లుతున్నది. పోలవరం ముంపుడు గ్రామాలలో ఆ చట్ట ప్రకారం గిరిజనులకు లభించవలసిన పట్టాలు ఇవ్వకపోవడం వలన వారికి నష్ట పరిహారం పూర్తిగా లభించడం లేదని, స్వయం జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమీషన్ వారే చెప్పారు. ఇది గిరిజనులకు అన్యాయం చేసినట్లు కదా?

 

డా.అంబెడ్కర్ గారి ఆశయాలు నెరవేరాలంటే...

 

షెడ్యూల్డ్ కులాలవారు, గిరిజనులు, ఇతర వెనుకపడ్డ వర్గాలమీద ప్రభుత్వ వైఖరి మారాలి. ప్రభుత్వ విధానాలలో  వారికి అనుగుణంగా మార్పులు తేవాలి. ఇది సాధ్యం అవ్వాలంటే మొట్టమొదట మీ క్యాబినెట్లో షెడ్యూల్డ్ కులాలవారికి, గిరిజనులకు, ఇతర వెనుకపడ్డ వర్గాలకు, వారి వారి జనాభాలకు అనుగుణంగా ప్రాతినిధ్యం ఇవ్వాలి. 

 

ఏయే ప్రాజెక్టులు ఆ వర్గాలకు హానికలిగిస్తున్నాయో అటువంటి ప్రోజెక్టులను  ప్రభుత్వం తత్క్షణం  ఆపి ఆయా వర్గాలకు ఎటువంటి పథకాలు లాభాలను చేకూరుస్తాయో ఆ ప్రోజెక్టులనే చేపట్టాలి. 

 

రిజర్వేషన్ల వలన షెడ్యూల్డ్ కులాలవారికి, గిరిజనులకు, ఇతర వెనుకపడ్డ వర్గాలకు రావలసిన ఉద్యోగ అవకాశాలను తత్క్షణమే కలిగించాలి. 

 

వారి సంక్షేమానికి, హక్కులకు సంబంధించిన చట్టాలను అమలు పరిచి వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మధైర్యాన్ని కలిగించాలి . 

 

షెడ్యూల్డ్ కులాలలో, ఇతర వెనుకబడిన వర్గాలలో కూడా, ఇంకా వెనుకబడిన వర్గాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, ఉత్తరాంధ్రలో లక్షలాది రెల్లి కుటుంబాలు ఉన్నాయి. వారికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల లాభాలు పూర్తిగా లభించడం లేదు. అటువంటి వర్గాల అభివృద్ధికోసం ప్రత్యేకమైన ఆర్ధిక, ఉపాధి వ్యవస్థలను స్థాపించ వలసి ఉంది. 

 

మీద సూచించిన విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, మంచి ఉద్దేశంతో చేపట్టిన డా. అంబెడ్కర్ గారి విగ్రహం, డా. అంబెడ్కర్ స్మృతి వనం కార్యక్రమాలు కంటితుడుపుగానే మిగిలిపోతాయని  అనుకుంటున్నాను.ప్రభుత్వంలో అత్యధిక స్థాయిలో  షెడ్యూల్డ్ కులాలవారు, గిరిజనులు, ఇతర వెనుకపడ్డ వర్గాలవారు ఎప్పుడు నిజమైన భాగ స్వాములు అవుతారో అప్పుడే  డా. అంబెడ్కర్ గారికి మనః శాంతి కలుగుతుంది. 

 

సమాజ సంక్షేమం కోసం, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలవారు, గిరిజనులు, ఇతర వెనుకపడ్డ వర్గాలవారికోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలకు సరిపోయే నిధులను మీరు బడ్జెట్లో ఏటేటా కేటాయించి, ఆ పథకాలను, కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తారని ఆశిస్తున్నాను. 

 

గిరిజనులు, ఇతర వెనుకపడ్డ వర్గాలవారికోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలకు సరిపోయే నిధులను మీరు బడ్జెట్లో ఏటేటా కేటాయించి, ఆ పథకాలను, కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తారని ఆశిస్తున్నాను. 

ఇట్లు

ఇఎ ఎస్ శర్మ

విశాఖపట్నం

 

(రచయిత ఇఎఎస్ శర్మ రిటైర్డు ఐఎఎస్ అధికారి. పర్యావరణ, మానవ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఉంటారు)