రాయలసీమ వేదనని ప్రాంతీయ రాజకీయమని కొట్టి పడేయవద్దు

dont refute Rayalaseema water problem as  parochial politics of a region

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనలో రెండు రాష్ట్రాల మధ్య సాగు నీటి పంపకం అత్యంత కీలకమైన అంశంగా అప్పటి కేంధ్ర ప్రభుత్వం గుర్తించింది. సాగు నీటితో పాటుగా, రాష్ట్ర రాజధాని, అనేక జాతీయ స్థాయి విధ్య, ఆరోగ్య, వ్యవసాయ, పరిశ్రమ రంగాల ఏర్పాటు, ఉమ్మడి రాష్ట్ర  ఆస్తుల, ఉద్యోగస్తుల పంపకాలు తదితర విషయాలపై  మార్గ దర్శకాలను రూపొందించటానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GOM) తో కమిటిని అప్పటి కేంధ్ర  ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటి తమకు అందిన  ప్రతిపాధనలు , సలహాలు, సూచనలుతో పాటుగా   అనేక సమావేశాలు నిర్వహించిన అనంతరం తమ సిఫార్సులను కేంధ్ర ప్రభుత్వానికి అందచేసింది . ఈ సిఫార్సుల ఆధారంగా కేంధ్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లును రూపొందించింది. ఈ విభజన బిల్లును  లోకసభ, రాజ్యసభలొ  ఆమోదించి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని రూపొందించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనతో  తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్ర విభజన కంటే ముందే కృష్ణా నది వివాధాల  పరిష్కార  ట్రిబ్యునల్  తమ తుది తీర్పును  ప్రకటించి  ఉండటం మరియు రాష్ట్ర విభజన బిల్లులో సాగు నీటి అంశాలపై  చేసిన అసమగ్ర  చట్టాలుతో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం అత్యంత  వివాదాస్పద అంశంగా మారింది. రెండు రాష్ట్రాల మద్య సాగునీటి  పంపకం అత్యంత కీలకమైన అంశంగా అప్పటి కేంధ్ర ప్రభుత్వం గుర్తించినప్పటికీ,  మూడు ప్రాంతాల  (తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ) మద్య నీటి పంపకం వివాధాస్పదం కాకుండ విధానాలు రూపొందించటంలొ  లోటుపాట్లు జరిగాయి. దీని ఫలితంగా రాయలసీమకు సాగునీటి విషయం లో తీవ్రమైన నష్టం వాటిల్లుతున్నది.

రాష్ట్ర విభజన బిల్లులో  ఈలోటు పాట్లను సరిదిద్ది, రాయలసీమకు అన్యాయం  జరగకుండ చట్టం చేయడంలో  రాజకీయ పార్టీల ఘోరంగ విపులమయ్యాయి.  రాష్ట్ర విభజన జరిగి మూడు సంవత్సరాలు జరిగిన రాష్ట్రవిభజన బిల్లులోని అసమగ్ర విధానాలు, లోపాలను సరిద్దాల్సిన అంశాలు రాజకీయ పార్టీలకు పట్టలేదంటే రాయలసీమ పట్ల రాజకీయ పార్టీల వైఖరి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలాపై ఏర్పడిన బ్రిజేష్ కుమార్ కమిటి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కంటే ముందే తమ తుది తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును నోటిఫై చేసి చట్టబద్దత కల్పించడానికి ముందుగానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంగ అవతరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా బ్రిజేష్ కుమార్ కమిటి కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం మరో రెండు సంవత్సరాలు  పెంచింది. దీనితో కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంతో సహా నాలుగు రాష్ట్రాల మధ్య సరికొత్తగా నీటి పంపకం చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ కమిటిని కోరాయి. కాని దీనికి బ్రిజేష్ కుమార్ కమిటి ఒప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటిని రెండుగా విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మద్య పంచే అంశాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మద్య కృష్ణా జలాల పంపకానికి సంబందించి పత్రాలను, తమ తమ వాదనలను వినిపించ వలసిందిగా బ్రిజేష్ కుమార్ కమిటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కోరింది.

రాష్ట్ర విభజన బిల్లులొని సెక్షన్ 89(a) లొ అంతరాష్ట్ర నదీ జలాల వివాదం చట్టం 1956 కింద ఏర్పాటైన ట్రిబ్యునల్, ప్రాజక్టులవారిగా నది జలాలను  కేటాయించక పోతే, ప్రాజక్టుల వారిగా నీటి కేటాయింపులు జరపడం, 89(b) లొ   తక్కువ నీటి ప్రవాహం సందర్బాలలో ప్రాజక్టుల వారిగా నీటి విడుదల చేయడానికి ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయించడం, షెడ్యుల్ 11  లొ కృష్ణా నీటి యాజమాన్య బోర్డు విధివిధానాలు మరియు మిగులు జలలా మీద నిర్మిస్తున్న ప్రాజక్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించిన పథకం ప్రకారం పూర్తి చెయ్యడం, ఈ ప్రాజక్టులకు  నీటికేటాయింపులు అదేవిదంగా  కొనసాగించాలన్నఅంశాలను  పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై, 7, 2017 న బ్రిజేష్ కుమార్ కమిటి ముందు తమ వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజక్టులకు నీటి కేటాయింపులు చెయ్యాలని కోరింది.  కృష్ణా నదిలోని నీటినంత పంచేసామని ఈ ప్రాజక్టులకు కేటాయించడానికి నీరు లేదని స్పష్టం చేసింది. ఇదె సందర్భంలో రాష్ట్ర విభజన చట్టంలోని   సెక్షన్ 89, షెడ్యుల్ 11 లొ పొందపర్చిన అంశాలను బ్రిజేష్ కమిటి లేవనెత్తింది .  మిగులు జలాలపై నిర్మిస్తున్న ప్రాజక్టులను నీటి కేటాయింపులకు సంబందించిన రాష్ట్ర  విభజన బిల్లులోని సెక్షన్ 89 క్రింద పేర్కొన లేదని, కృష్ణా నీటి యాజమాన్య బోర్డు విధివిధానాలను స్పష్టంచేసే సెక్షన్ 11 లో మాత్రమే దీన్ని పొందపర్చిన విషయాన్ని  బ్రిజేష్ కుమార్ కమిటి  ఎత్తిచూపింది‌.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో నీటి పంపకాలు కీలకమైన అంశంగా రాజకీయ పార్టీలు గుర్తించినప్పటికీ నీటి పంపకంలొ రాయలసీమ అవసరాల పట్ల అవి తీవ్ర నిర్లక్ష్యం వహించాయన్నది రాష్ట్ర విభజన చట్టంలోని పై అంశాలను నిశితంగా పరిశీలిస్తే తేటతెల్లం అవుతుంది.  రాష్ట్ర విభజన చట్టం లోని సెక్షన్ 89 (a) కింద పేర్కొన్న ప్రాజక్టులవారిగా నీటి పంపకాలు చెయ్యాలన్నది రాయలసేమ పట్ల ఒక దుర్మార్గమైన చర్యగా రాయలసీమ సాగునీటి సాధన సమితి భావిస్తున్నది. కృష్ణా నది నీటి పంపకాలు చేసిన కృష్ణా నది వివాదాల పరిష్కార మొదటి ట్రిబ్యునలైన బచావత్ కమిటి ప్రాజక్టుల వారిగా నీటి అవసరాలను నిర్ణయిస్తూనే, ఆయా రాష్ట్రాలలోని ప్రాజక్టుల మొత్తం నీటి అవసరాలకు అంచనావేసి,  దాని ప్రకారమే  ఆయా రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసింది.  ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నీటిని,  రాష్ట్రంలోని నీటి అవసరాలను బట్టి ఒక ప్రాజక్టు నుండి ఇంకొక ప్రాజక్టుకు లేదా ప్రాంతానికి సర్దుబాటు చేసుకొనే హక్కును రాష్ట్ర ప్రభుత్వాలకు బచావత్ కమిటి ఇచ్చింది. కృష్ణా జలాలో ఎక్కువ నీటిని వినియోగించుకొనే భారి ప్రాజక్టులన్నీ కృష్ణా, గుంటూరు  జిల్లాలో వున్నాయి. కృష్ణా జలాలపై తక్కువ నీటివినియోగంతో చిన్న చిన్న ప్రాజక్టులు, కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలొ ఉన్న  ప్రాజక్టులన్ని, రాయలసీమ మరియు కరువుపీడిత పాత రాయలసీమలోని  మార్కాపురం ప్రాంతంలో వున్నాయి. పంటల మార్పు ద్వారా లేదా సరి కొత్త శాస్త్రీయ నీటి వినియోగ విధానాల ద్వారా   పొడుపు చేసిన  నీటిని మిగులు జలాల ఆధారితంగా నిర్మిస్తున్న ప్రాజక్టులకు కేటాయించ వచ్చును. ఈ విధంగా నీటి వినియోగంలో పొడుపు చేసి కరుపీడిత ప్రాంతాలకు నీటిని అందించే హక్కును రాష్ట్ర ప్రభుత్వాలకు, చట్టాలకు లేకుండా చేసే దుర్మార్గమైన చర్యను రాష్ట్ర విభజన చట్టంలో చేపట్టారు. ఇది ముగిసిపోయిన అంశం కాదు, కావున రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి, సెక్షన్ 89(a) లొ పొంద పరిచిన ప్రాజక్టుల వారి నీటి కేటాయింపులు చెయ్యాలన్న అంశాన్ని తొలగించాలి. మిగులు జలాలతో ఆంధ్రప్రదేశ్ లొ  నిర్మిస్తున్న ప్రాజక్టులకు  నీరు లభించేలగా ఈ ప్రాజక్టులను  సెక్షన్  89  లో  చేర్చేలాగ చట్టంలో సవరణలు చేపట్టాలి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనలో  సాగు నీటి పంపకం అత్యంత కీలకమైన అంశంగా పేర్కొంటు, ఈ సమస్య పరిష్కారానికి పోలవరం ప్రాజక్టు మరియు దుమ్మగూడెం – నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజక్టుల నిర్మాణ ఆవశ్యకతను అప్పటి కేంధ్ర మంత్రి జయరాం రమేష్ గారు, కేంధ్ర హోం శాఖ మంత్రికి ఉత్తరం రాసారు. ఈ ప్రాజక్టుల నిర్మాణంతో గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్ళిస్తారు. దీనితో కృష్ణా నది మిగులు జలాలపైన ఆంధ్రప్రదేశ్ లొ నిర్మాణంలో వున్నా  ప్రాజక్టులకు నికర జలాలు లభిస్తాయి. కాని రాష్ట్ర విభజన చట్టంలో దుమ్మగూడెం – నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు ను చేర్చలేదు. బ్రిజేష్ కుమార్ కమిటి తమ తుది తీర్పులో కృష్ణా నదిలోని నిఖర జలాలతో పాటు మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాలకు పంచివేసింది‌. ఇదే సందర్భంలో దెబ్బమీద దెబ్బలాగ, దుమ్మగూడెం – నాగార్జున సాగర్ టైల్ పాండ్  ప్రాజక్టు నిర్మాణ అంశాన్ని కూడ రాష్ట్ర విభజన చట్టంలొ పొందపర్చలేదు‌. దీనితో మిగులు జలాలపైన ఆంధ్రప్రదేశ్ లొ నిర్మాణం లొ వున్నా హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజక్టుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.  రాయలసీమ భవిష్యత్తు పట్ల స్పృహ వున్న రాజకీయ పార్టీలైనా, ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర విభజన చట్టాన్ని పునః సమీక్షించి దుమ్మగూడెం – నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజక్టును రాష్ట్ర విభజన చట్టంలో చేర్చడానికి అన్ని ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలు కృషి చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాష్ట్ర విభజన బిల్లులో పోలవరం ప్రాజక్టును  జాతీయ ప్రాజక్టుగా ప్రకటించారు. కేంధ్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజక్టు నిర్మాణంపై ప్రత్యేశ్రద్ధతో పనిచేస్తున్నాయి. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలను రాయలసీమ సాగునీటి సాధన సమితి అభినందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకువేసి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజక్టుల నిర్మాణమే తమ ప్రాధాన్యతలని ప్రకటించడమే కాకుండ, పోలవరంకు తాత్కాలిక ప్రాజక్టు అయిన పట్టిసీమను ఒక సంవత్సర కాలంలో నిర్మాణం చేసింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుసీమ ద్వారా అదా అయిన 45 టి ఎం సి ల నీటిని రాయలసీమకు కేటాయిస్తామని ప్రకటించింది. కాని చట్టబద్దంగా ఈ నీటిని రాయలసీమకు కేటాయించే కార్యాచరణలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాశీనత స్పష్టంగా కనపడుతుంది.

 

తెలంగాణా ప్రభుత్వం పోలవరం/ పట్టిసీమ ద్వారా ఆదా అయిన నీటిని తెలంగాణకు కేటాయించాలిని బ్రిజేష్ కుమార్ కమిటి ముందు బలమైన వాధనలను ఉంచింది. అంతేకాకుండా పట్టిసీమ ద్వారా అదా అయిన నీటిని ఎస్ ఎల్ బి సి కి కేటాయించాలని  కృష్ణా నది యాజమాన్య బోర్డ్ ముందు పదే పదే ప్రస్తావిస్తున్నది. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నిర్మాణం , కృష్ణా డెల్టాలే  అత్యంత ప్రాదాన్యత ఉన్న అంశాలుగా పనిచేస్తున్నది.  సాగునీటి మౌలిక వసతుల కల్పనలొ నిర్లక్ష్యంతో వెనకబడిన రాయలసీమ ప్రాజక్టులకు చట్టబద్దనీటి కేటాయింపుల సాధనపై కార్యాచరణను చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్షంగా వ్యవహరిస్తున్నది. ఈ నిర్లక్ష్యంతో చట్టబద్ద నీటి కేటాయింపులు లేక రాయలసీమ దీర్ఘకాలిక  ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ఆంధ్ర, రాయలసీమ నాయకులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో, ఈ వ్యతిరేకత లేకుండా ఉండటానికి పోలవరం నిర్మాణం చేపట్టాలని అప్పటి కాంగ్రేస్ పార్టీ ఎం పి శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్,  శ్రీమతి సోనియా గాంధీకి సూచించినట్లు  తమ “విభజన కథ”  పుస్తకంలో రాసారు. ఇటు ఆంధ్ర , అటు రాయలసీమ నాయకులు తమ ప్రాంత అభివృద్దికి అవసరమైన పోలవరం ప్రాజక్టు నిర్మాణం చేపడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించరని ఇచ్చిన వివరణకు స్పందించి పోలవరంను జాతీయ ప్రాజక్టుగా  రాష్ట్ర విభజన బిల్లులో చేర్చడానికి అవసరమైన కార్యాచరణ చేపట్టినట్లు తమ “విభజన కథ” పుస్తకములో శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.  పోలవరం ద్వారా అదా అయ్యే నీరు 45 టి ఎం సి లు లభించినప్పుడే రాయలసీమకు లాభం చేకూరుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆనందగా వున్న తెలంగాణాతో పాటు, విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ లోని వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కూడా న్యాయం చెయ్యడానికి పోలవరం ప్రాజక్టును జాతీయ ప్రాజక్టుగా రాష్ట్ర విభజన చట్టంలో ప్రకటించారు. కావున పోలవరం/ పట్టుసీమ ప్రాజక్టు నిర్మాణం ద్వారా అదా అయిన 45 టి ఎం సి ల నీటిని చట్టబద్ధంగా రాయలసీమకు లభించడానికి అన్ని రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం వుంది.

రాయసీమ ప్రాంతంలో అన్ని వనరులున్నప్పటికి,  రాజకీయ పార్టీల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం అత్యంత వెనకబడిన ప్రాంతంగా మారింది. ఈ ప్రాంతం అభివృద్ధి  పట్ల రాష్ట్ర విభజన చట్టంలోని  లోటుపాట్లను సరిదిద్దాల్సిన ఆవశ్యకతను గుర్తించి రాజకీయ పార్టీలు తక్షణమే స్పందించి,  కార్యాచరణ ప్రకటించాలని రాయలసీమ వాసులు కోరుకుంటున్నారు.  తమతమ రాజకీయ లబ్దికోసం ఇది ఒక ప్రాంతీయ సమస్యగా చిత్రీకరించి రాయలసీమకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడంలో రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇది ప్రాంతీయ సమస్య కాదు, మానవత్వ సమస్యగా రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని గ్రహించి ఈదిశలో రాజకీయ పార్టీలు కార్యాచరణ చేపట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. 

 

* రచయిత రాయలసీమ సాగునీటి సాధన సమితి, అధ్యక్షులు. ఫోన్ నెంబర్ -9848040991