ఎగువ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. ముఖ్యంగా జూరాల నుండి వస్తున్న వరద ఉదృతికి శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో డ్యామ్ క్రస్ట్ గేట్లను మరోసారి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా ఈ సంవత్సరంలో  ఐదోసారి క్రస్ట్ గేట్లను ఎత్తినట్లు అధికారులు తెలిపారు.

శ్రీశైలం జలాశయానికి  ఎగువ పరివాహక ప్రాంతాల నుండి వరద నీరు శ్రీశైలం డ్యాం కు చేరుతుంది.  ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది.  ఆ ప్రాజెక్టుల నుండి వరద  జూరాలకు అక్కడి నుండి శ్రీశైలం డ్యామ్ కు చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకోవడంతో శ్రీశైలం వద్ద ఒక క్రస్ట్ గేట్ ను ఎత్తి  దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు . 

ఈ సంవత్సరంలో ఐదు సార్లు గేట్లు ఎత్తడం ఒక చరిత్రని అధికారులు తెలిపారు. ఈ డ్యామ్ నిర్మించినప్పటి నుండి ఇంతవరకు ఒకే సంవత్సరంలో 5సార్లు గేట్లు ఎత్తడం, మూసివేయడం వంటివి లేవని తెలిపారు. 

నిన్నటి నుండి శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనసాగుతుండడంతో శ్రీశైలం డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది. ఈ డ్యాం సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం కూడా 885 అడుగులకు చేరుకుంది. 

ఎగువ ప్రాంతాలలో, దిగువ ప్రాంతాల్లో ఉన్న ఆనకట్టలు అన్ని పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో ఉండడంతో శ్రీశైలం డ్యాం వద్ద నీటిని విడుదల చేస్తే ఆ నీరు సముద్రం పాలు అవ్వాల్సిందే.  అయితే గరిష్ట నీటి నిల్వ సామర్థ్యానికి నీటిని ఒడిసి పట్టుకుని శ్రీశైలం 2 జల విద్యుత్ కేంద్రాల ద్వారా పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రవాహం ఇంకా కొనసాగుతూ ఉండటంతో ఒక క్రస్ట్ గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని  నీటి పారుదల శాఖ భావించింది. ఈ మేరకు ఒక గేట్ 10 అడుగుల మేర ఎత్తి 27 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయాలని నీటి పారుదల ఎస్సి చంద్రశేఖర్ నిర్ణయించారు.