ఆంధ్ర ప్రదేశ్ లో మద్యపాన నిషేధంపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ సర్వీస్ టాక్స్  పేరిట ఓ కొత్త బాదుడు మొదలయ్యిందన్నారు. జీఎస్టీ మాదిరిగానే ఈ ట్యాక్స్ కూడా ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోందని తులసిరెడ్డి ఆరోపించారు. 

గురువారం పాణ్యం నియోజకవర్గంలోని నన్నూరు గ్రామంలో తులసిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మద్యపాన నిషేధంపై వైసిపి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. కేవలం ఎక్సెస్ ఎక్సైజ్ ఆదాయాన్ని మరింత పెంచుకోవడం మీదనే ఈ ప్రభుత్వం, పాలకులు దృష్టి సారించారని విమర్శించారు. 

పచ్చటి కాపురాల్లో మద్య మహమ్మారి చిచ్చు పెడుతోందన్నారు. దీని వల్ల మానవ సంబంధాలు పూర్తిగా నాశనం అయిపోతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యానికి బానిసగా మారి ఎన్నో కుటుంబాలు ధ్వంసమైపోతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్నికల సమయంలో కేవలం అధికారం కోసమే మద్యనిషేధంపై హామీ ఇచ్చిన వైసిపి ఇప్పుడు మాట మార్చిందన్నారు. మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని   ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. కానీ ఆ దిశగా చర్చలేమీ లేవన్నారు. 

2019-20  రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం గత సంవత్సరం కంటే రూ.2297 కోట్లు అదనంగా చూపిందని తెలిపారు. 2018 -19 బడ్జెట్లో టిడిపి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 6220 కోట్లు చూపగా 2019 -20 రాష్ట్ర బడ్జెట్లో వైసిపి రూ. 8517 కోట్లుగా చూపించిందన్నారు. దశలవారీ మద్య నిషేధం మీద చిత్తశుద్ధి ఉంటే దశల వారీ ఎక్సైజ్ ఆదాయం తగ్గాలి కానీ ఇక్కడ పెరగడం విడ్దూరంగా వుందన్నారు. 

కేంద్రంలో మోడీ ప్రభుత్వం వస్తు, సేవల మీద అధిక జీఎస్టీ వేసి ప్రజల నడ్డి విరగొట్టగా...  వైసిపి ప్రభుత్వం మద్యం సీసాల మీద పన్న వేస్తోందన్నారు. ఒక్కొక్క మద్యం సీసాపై ఇరవై నుంచి ఎనభై రూపాయలు దాకా అదనంగా ధర పెంచి మందుబాబుల మీద వారి కుటుంబాల మీద  ఆర్థిక భారం మోపి వారి నడ్డి విరగ్గొట్టడం దుర్మార్గమన్నారు.

జీఎస్టీ మాదిరిగానే జెఎస్టీ అంటే జగన్ సర్వీస్ టాక్స్ గా ప్రజలను ఇబ్బంది  పెడుతోందని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో మద్యపాన నిషేధం అనే నవరత్నం నడ్డి విరగొట్టె గుండ్రాయిగా మారిందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.