గుంటూరు:  ప్రపంచ దృష్టి  దినోత్సవం సందర్భంగా  వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 10 వ తేదిన అనంతపురంలో ప్రారంభించనున్నారు.  మిగతా అన్నినియోజకవర్గాలలో శాసన సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిణి  యాస్మిన్ తెలిపారు.

బుధవారం  వైఎస్సార్ కంటి వెలుగు పధకంపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య  శాఖ కార్యాలయంలోని తన ఛాంబర్ లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిణి మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అంధత్వ నివారణ లక్ష్యంగా కంటి వెలుగు పధకాన్ని దశల వారీగా అమలు చేయనున్నట్లు తెలిపారు.  

మొదటి దశలో ఈ నెల 10 వ తేది నుండి 16 వ తేది వరకు జిల్లాలోని 4,874 ప్రభుత్వ మరియు ప్రైవేటు  పాఠశాలలలోని 1 నుండి 15 సంవత్సరాలలోపు 6,48,171 విద్యార్దులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  స్కూల్ టీచర్లు, ఆశా వర్కర్లు, ఎ.యన్.ఎం లతో కూడిన 3280 టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

కంటి పరీక్షలు నిర్వహించుటకు 4 వేల కిట్లు అన్ని టీములకు అందజేయడం జరిగిందన్నారు.  ఒక్కొక్క టీము రోజుకు 250 మంది పిల్లలకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  పరీక్షల అనంతరం ఫలితాలను ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. 

ప్రాథమిక దశలో గుర్తించిన కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్దులకు ప్రభుత్వ కంటి వైద్య నిపుణులు మరియు ఎన్.జి.ఓ ( ఎల్.వి.ప్రసాద్, శంకర నేత్రాలయ ) వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రెండవ దశలో  నవంబర్ 1 నుండి డిశంబర్ 31 వరకు, శస్త్ర చికిత్సలు, కంటి అద్దాలు, మందులు  మొదలగు వాటిని ఉచితంగా అందివ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. తల్లి తండ్రులు స్కూళ్ళలో ఆటంకం కల్గించకుండా, పిల్లలందరూ ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకునే విధంగా సహకరించి, కంటి వెలుగు బృహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా  డాక్టర్ యాస్మిన్ కోరారు.