National Sports Policy 2025: జాతీయ క్రీడా విధానం 2025ను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఇది భారత్‌ను గ్లోబల్ క్రీడా శక్తిగా మార్చే దిశగా కీలక అడుగుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

National Sports Policy 2025: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్రమంత్రి మండలి సమావేశంలో జాతీయ క్రీడా విధానం (National Sports Policy - NSP) 2025కు ఆమోదం లభించింది. ఇది 2001లో అమలులోకి వచ్చిన జాతీయ క్రీడా విధానానికి స్థానంలోకి వస్తోంది. NSP 2025 భారతదేశ క్రీడా రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిలబెట్టేందుకు, ప్రజల శారీరక, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి క్రీడలను ప్రధాన ఆధారంగా తీసుకుని రూపొందించిన దిశాపథంగా ప్రభుత్వం పేర్కొంది. 

ఈ విధానాన్ని రూపొందించడంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ క్రీడా సమాఖ్యలు, క్రీడాకారులు, నిపుణులు, ప్రజా ప్రతినిధుల సహకారం తో సమగ్ర సలహాలు తీసుకున్నారు.

విధానంలోని అయిదు ప్రధాన విషయాలను ప్రభుత్వం పేర్కొంది.

1. అంతర్జాతీయ విజయాల కోసం

• ప్రాథమిక స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను గుర్తించి పెంపొందించేందుకు గట్టి మెకానిజంలు ఏర్పాటుచేయడం.

• గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం.

• అథ్లెట్లకు ప్రపంచ స్థాయి శిక్షణ, కోచింగ్, వైద్య సేవలు అందించడం.

• జాతీయ క్రీడా సమాఖ్యల పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడం.

• క్రీడా శాస్త్రం, ఔషధం, సాంకేతికతను వినియోగించడం.

• కోచ్‌లు, సాంకేతిక అధికారులు, మద్దతు సిబ్బంది శిక్షణ కల్పించడం.

2. ఆర్థిక అభివృద్ధికి క్రీడలు

• క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించి, అంతర్జాతీయ ఈవెంట్లను భారత్‌కు ఆకర్షించడం.

• క్రీడా ఉత్పత్తుల తయారీ, స్టార్టప్‌లకు ప్రోత్సాహం.

• పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్స్ (PPPs), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR), కొత్త నిధుల యాజమాన్యాన్ని ఉత్సాహపరచడం.

3. సామాజిక పురోగతికి క్రీడలు

• మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలు, గిరిజనులు, వికలాంగులకు ప్రత్యేక కార్యక్రమాలు.

• సంప్రదాయ, స్వదేశీ క్రీడలను పునరుద్ధరించడం.

• విద్యలో క్రీడలను ప్రవేశపెట్టి, వాలంటీరింగ్ ద్వారా కెరీర్ మార్గాలను అభివృద్ధి చేయడం.

• విదేశాల్లో ఉన్న భారతీయులను క్రీడల ద్వారా అనుసంధానించడం.

4. ప్రజా ఉద్యమంగా క్రీడలు

• దేశవ్యాప్తంగా సామూహిక క్రీడా కార్యక్రమాలు, ఫిట్‌నెస్ ప్రచారాలు నిర్వహించడం.

• పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు ఫిట్‌నెస్ సూచికలు ప్రవేశపెట్టడం.

• అందరికీ క్రీడా సదుపాయాల వినియోగాన్ని కల్పించడం.

5. విద్యతో క్రీడల సమన్వయం

• పాఠశాలా పాఠ్యప్రణాళికలో క్రీడలను భాగం చేయడం.

• ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ అందించడం.

కొత్త స్పోర్ట్స్ పాలసీ అమలుకు వ్యూహాత్మక పద్ధతి

విధాన లక్ష్యాలను చేరుకోవడంలో NSP 2025 వివిధ రంగాల భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు.

• పరిపాలన: క్రీడల పరిపాలన కోసం నిబంధనలు, చట్ట పరంగా వ్యవస్థ ఏర్పాటు కానుంది.

• ప్రైవేట్ భాగస్వామ్యం: కొత్త పెట్టుబడుల ప్రోత్సాహం, CSR, PPPs ద్వారా నిధుల సమీకరణ.

• సాంకేతికత: AI, డేటా అనాలిటిక్స్ ద్వారా ప్రదర్శన విశ్లేషణ, పరిశోధన.

• నేషనల్ మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్: స్పష్టమైన లక్ష్యాలు, ప్రధాన పనితీరు సూచికలు (KPIs) అమలు చేయడం.

• రాష్ట్రాల కోసం నమూనా విధానం: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు NSPతో అనుసంధానంగా తమ విధానాలు రూపొందించుకోవచ్చు.

• సర్వమంత్రిత్వ శాఖల భాగస్వామ్యం: అన్ని ప్రభుత్వ శాఖల్లో క్రీడల ప్రోత్సాహానికి సమన్వయం.

ప్రధాని మోడీ ఏమన్నారంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ X వేదికగా స్పందిస్తూ.. “ఈ రోజు భారత క్రీడా సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి చారిత్రాత్మకమైన రోజు. కేబినెట్ కొత్త స్పోర్ట్స్ పాలసీని భారత్ ఆమోదించింది. ఈ విధానం 5 ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ క్రీడల కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది” అని తెలిపారు.