India vs England: లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో ఓడిపోయిన భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్ లో జరిగే రెండో టెస్టులో విజయం సాధించాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తుది జట్టు ఎంపిక పిచ్‌పై ఆధారపడి ఉంటుందన్నారు.
India vs England Test: ఇంగ్లాండ్‌తో రెండవ టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు కూర్పుపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది. అయితే, భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటారని ఇప్పటికే బీసీసీఐ అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఏ మ్యాచ్ లు ఆడతారనే ఉత్కంఠ మధ్య బుమ్రా తొలి టెస్టును ఆడారు.
లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలని భారత వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే జస్ప్రీత్ బుమ్రా ఆడటం పై గిల్ అప్డేట్ ఇచ్చారు. ఇంగ్లాండ్ తో జరిగే రెండో టెస్టులో బుమ్రా జట్టులో భాగంగా ఉంటారని తెలిపారు.
అయితే, పిచ్ పరిస్థితిని పరిశీలించిన అనంతరం తుది జట్టులో అతని స్థానం గురించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బుధవారం ప్రారంభమయ్యే రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ బుమ్రా వర్క్ లోడ్ నిర్వహణపై జట్టులో చర్చ జరుగుతోందన్నారు.

బుమ్రా ఆడడానికి సిద్ధంగా ఉన్నారు: గిల్
“బుమ్రా ఖచ్చితంగా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అతని వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుంటూ, సరైన బౌలింగ్-బ్యాటింగ్ కాంబినేషన్ కోసం చూస్తున్నాం. మైదానానికి వచ్చిన తర్వాత పిచ్‌ను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం” అని కెప్టెన్ గిల్ చెప్పారు.
ఈ సిరీస్‌లో బుమ్రా మొత్తం మూడు టెస్టులకే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్‌లో అతను మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసినప్పటికీ, రెండవ ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. మొత్తం 44 ఓవర్లు వేసిన అతని ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని వర్క్ లోడ్ పరిమితిపై బీసీసీఐ, జట్టు యాజమాన్యం దృష్టిసారించింది.
బుమ్రా లేని జట్టును ముందే సిద్ధం చేసుకున్నామన్న గిల్
గిల్ మాట్లాడుతూ.. "ఒక గొప్ప బౌలర్ జట్టులో లేకపోతే అది తేడా కలిగిస్తుంది. కానీ మేము సిరీస్‌కు ముందే అతను మిస్ అయితే ఎవరు ఆడతారనే ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం" అని వెల్లడించారు.
బౌలింగ్, బ్యాటింగ్ కాంబినేషన్‌పై గిల్ మాట్లాడుతూ.. “నంబర్ ఏడు లేదా ఎనిమిది వరకు బ్యాటింగ్ డెప్త్ ఉండాలని చూస్తున్నాం. కానీ అది తొమ్మిదివరకు తీసుకెళ్తే, 20 వికెట్లు తీయగల సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి, ఆ మైదాన పరిస్థితులకు అనుగుణంగా సరైన కాంబినేషన్ ఎంపిక చేయడం ముఖ్యం” అని తెలిపారు.
అలాగే, “నాలుగు ప్రధాన బౌలర్లు, ఒక ఆప్షనల్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో పాటు ఏడు లేదా ఎనిమిదివరకు బ్యాటింగ్ డెప్త్ ఉంటే, అది మాకు సరైన కాంబినేషన్ అవుతుంది” అని కూడా గిల్ చెప్పారు.

లీడ్స్ పరాజయం తర్వాత నిర్ణయాల్లో మార్పులు
మొదటి టెస్ట్‌లో లీడ్స్‌లో 371 పరుగుల ఆధిక్యాన్ని కాపాడలేకపోయిన భారత జట్టు, మళ్లీ మునుపటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడుతోంది. “లీడ్స్‌లో మేము అదనపు స్పిన్నర్‌ను తీసుకుని ఉంటే, మూడు, నాల్గవ ఇన్నింగ్స్‌లలో పరుగులు రాకుండా నియంత్రించగలిగేవాళ్లం. ఇప్పుడు పాఠాలు నేర్చుకున్నాం” అని గిల్ తెలిపారు.
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ ఎలా ఉండనుంది?
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ ప్రస్తుతం పచ్చగా కనిపిస్తున్నప్పటికీ, లోపల పొడిగా ఉండటంతో మూడో రోజుకు స్పిన్నర్ల పాత్ర కీలకమవుతుందని అంచనా. అందుకే భారత జట్టు ఈసారి ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లే అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటోంది.
మార్పులేకుండా సిద్ధంగా ఇంగ్లాండ్ జట్టు
ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్ తమ రెండవ టెస్ట్ జట్టును సోమవారం ప్రకటించింది. వారు లీడ్స్ విజయం తర్వాత అదే జట్టుతో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ నాయకత్వంలో జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓల్లి పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ లాంటి ఆటగాళ్లు జట్టులో కొనసాగుతున్నారు. బౌలింగ్ యూనిట్ క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్‌లతో ఉంది.

అందరి చూపు బుమ్రాపైనే
బుమ్రా జట్టులో ఉంటాడా అన్న ఉత్కంఠ పెరిగింది. అతని పేస్ దాడి, వికెట్లు తీయగల సామర్థ్యం భారత్ విజయంలో కీలకమవుతుంది. గిల్ వ్యాఖ్యల ప్రకారం, బుమ్రా సిద్ధంగా ఉన్నా, తుది జట్టు ఎంపిక పిచ్‌పై ఆధారపడి ఉంటుంది.
ఇది సిరీస్‌ను సమం చేసుకోవడానికి భారత్‌కు కీలక మ్యాచ్. ఆ జట్టులో బుమ్రా పాత్ర ఉండబోతోందా అన్నది బుధవారం ఉదయం స్పష్టమవుతుంది.
