India vs Pakistan: సింధు జల ఒప్పందం రద్దు తర్వాత భారత్ టుల్బుల్ ప్రాజెక్ట్‌ను పునఃప్రారంభించింది. పాకిస్తాన్ మళ్లీ ఆగ్రహంగా స్పందించింది. అయితే, భారత్ వెనక్కి తగ్గేదే లే అంటూ చర్యలను వేగవంతం చేసింది. అసలు ఏంటి ఈ టుల్బుల్ ప్రాజెక్ట్?

India vs Pakistan: సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన కొద్ది నెలల తర్వాత, పాకిస్తాన్‌కు మరో నీటి బాంబ్ దెబ్బ రూచి చూపించడాని ఇండియా సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని టుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. 

ఈ నిర్ణయం పాకిస్తాన్‌ను తీవ్రంగా అసహనానికి గురి చేసే అవకాశముంది. అయినా, భారత్ తన నీటి వనరులను మరింతగా ఉపయోగించుకోవాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. తమతో పెట్టుకుంటే పాక్ కు ఏం జరుగుతుందో గుణపాఠం చెప్పడానికి భారత్ సిద్ధమైంది.

టుల్బుల్ ప్రాజెక్ట్ కథేంటో తెలుసా?

ఏప్రిల్‌లో పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఏడాది చివరినాటికి టుల్బుల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి ప్రణాళిక (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ - DPR)ను సమర్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ 1984లో ప్రారంభమై, పాకిస్తాన్ వ్యతిరేకతల వల్ల 1987లో నిలిచిపోయింది. ఆపై 2010లో ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పుడు భారత్ ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది.

టుల్బుల్ ప్రాజెక్ట్ అందించే ప్రయోజనాలు ఏమిటి?

టుల్బుల్ ప్రాజెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో జీలం నది ఒడ్డున నిర్మించాల్సిన ఓ నీటి నిల్వ కేంద్రం. ఇది ఉలర్ సరస్సు వద్ద 439 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ సరస్సు ఆసియా ఖండంలోని అతిపెద్ద తేలికపాటి నీటి సరస్సులలో ఒకటి. ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం వేసవి కాలంలో జీలం నదిలో నీటి ప్రవాహాన్ని నియంత్రించి, శ్రీనగర్ నుంచి బారాముల్లా వరకు నీటి సరఫరా సజావుగా కొనసాగించడం.

ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 లక్షల ఎకరాల అడుగుల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇది విద్యుత్ ఉత్పత్తికి, పర్యావరణ నిర్వహణకు, అంతర్గత రవాణాకు ఉపయోగపడుతుంది. 4.5 అడుగుల లోతుతో నదిలో పడవలు నడిపే వీలూ కలుగుతుంది.

పాకిస్తాన్‌ అభ్యంతరాలు.. భారత్‌ సమాధానమేంటి?

1985లో పాకిస్తాన్ దీని పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో భారత్ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా ఆపేసింది. 1986లో పాకిస్తాన్ సింధు జల కమిషన్‌ను ఆశ్రయించి 1987లో పూర్తిగా ప్రాజెక్ట్ నిలిపివేయించింది. కానీ, భారత్ అభిప్రాయం ప్రకారం, సింధు జల ఒప్పందంలోని నిబంధనల ప్రకారం (ఆర్టికల్ 9) భారత్‌కు ఈ నీటిని వినియోగించే హక్కు ఉంది. తారునీరు, నావిగేషన్, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించనున్నారు.

2010లో తిరిగి ప్రాజెక్ట్‌ను ప్రారంభించినప్పుడు ఉగ్రవాదుల దాడులు కూడా జరిగాయి. 2016 నాటికి అప్పటి ఎన్సీ-కాంగ్రెసు ప్రభుత్వం సుమారు 80 శాతం పనులు పూర్తి చేసినట్లు సమాచారం ఉంది. కానీ తర్వాత పీడీపీ పాలనలో ప్రాజెక్ట్ ఆగిపోయిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దానిని ప్రారంభించే చర్యలు చేపట్టింది.

ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయి?

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌పై దృష్టి సారించి, పూర్తి స్థాయి ప్రణాళికను రూపొందిస్తోంది. పీటీఐ నివేదిక ప్రకారం, ఈ డీపీఆర్ సిద్ధమవ్వడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. ఆ తర్వాత అధికారిక అనుమతుల కోసం సమర్పించనున్నారు.

ఈ చర్య భారతదేశం ఇప్పుడు జలవనరులపై తన అధిపత్యాన్ని మరింత బలంగా ప్రదర్శించాలన్న కొత్త విధానాన్ని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నిరంతరం టుల్బుల్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించినా, భారత్ మాత్రం ఈ ప్రాజెక్ట్ తన భూభాగంలో ఉన్న నదులపై సంపూర్ణ హక్కుతో చేపడుతోందని స్పష్టం చేస్తోంది.

భారత - పాక్ జలవివాదంలో కొత్త అధ్యాయం

ఇండియా - పాకిస్తాన్ మధ్య జలవనరులపై వివాదాలు కొత్తవి కావు. 1960లో రెండు దేశాలు సంతకం చేసిన సింధు జల ఒప్పందం ప్రకారం, తూర్పు నదులైన సట్లేజ్, బియాస్, రవి నదులపై భారత్‌కు హక్కు ఉంటుంది. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్ వినియోగించే హక్కు కలిగి ఉంటుంది. కానీ ఈ ఒప్పందం భారతదేశాన్ని కొన్ని పరిమితులలో బంధించిందని భావిస్తూ, తాజాగా భారత్ వాటిపై తన ప్రాజెక్టులను చేపడుతోంది.

మొత్తంగా భారత్ టుల్బుల్ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించడం పాకిస్తాన్‌తో ఉన్న జలవనరుల ఆధిపత్య పోరులో కీలక మైలురాయిగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. అదే సమయంలో పాకిస్తాన్‌ను రాజకీయంగా కూడా ఒత్తిడిలో పడేసే అవకాశం ఉంది.