Asianet News TeluguAsianet News Telugu

అనూహ్యం.. బట్ విత్త మంత్రిగా నిర్మల’మ్మ ముందు ఇవీ సవాళ్లు


1970-71 తర్వాత దేశ విత్త మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా.. అందుగా తెలుగింటి కోడలుగా నిర్మలా సీతారామన్ చరిత్ర నెలకొల్పారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వాధినేత అంచనాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల అమలులోనూ, విపక్షాలను ఢీ కొట్టడంలోనూ మన్ననలు పొందారు. అయితే విత్త మంత్రిగా అవే సరిపోవు. అన్ని వర్గాలను సంత్రుప్తి పరుచాల్సిన బాధ్యత ఆమెదే. ప్రత్యేకించి ఉద్యోగాల కల్పన, నిధుల కేటాయింపు, ద్రవ్యలోటు నియంత్రణ, మౌలిక వసతుల అభివ్రుద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Seven challenges before Nirmala Sitharaman, India's new finance minister
Author
New Delhi, First Published Jun 1, 2019, 11:14 AM IST

న్యూఢిల్లీ: భారతదేశంలో 50 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక మహిళ విత్త మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1970 -71 మధ్యఆర్థిక మంత్రి బాధ్యతలనూ నిర్వర్తించారు. ఆ తర్వాత ఒక మహిళ అటువంటి అతి ప్రాధాన్య స్థానంలోకి రావడం ఇదే తొలిసారి. 

బీజేపీకి ప్రత్యేకించి ప్రధాని మోదీతోపాటు వ్యూహ రచన, అమలులో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా వంటి ఉద్దండుడు విత్త మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని తొలుత వార్తలొచ్చాయి. 

కానీ ఆశ్చర్యకరరీతిలో మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేశారు. మోదీ తొలి విడుత క్యాబినెట్ లో కొంత కాలం పాటు ఆర్థిక శాఖలో పనిచేయడం ఆమెకు కలిసివచ్చినట్లుంది.

జీడీపీ మందగించినట్లు గణాంకాలు వెల్లడైన రోజే విత్త మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్‌కు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇక వచ్చే ఐదేళ్లే బడ్జెట్ రూపకల్పనకు ముందు హల్వా తయారీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేదెవరో తెలిసిపోయింది. 

ఆవకాయను ఇష్టంగా తయారుచేసే నిర్మలా సీతారామనే హల్వానూ తన సిబ్బందికి పంచనున్నారు. ఆవకాయను తయారు చేయడానికి కావల్సిన పదార్థాలను సమపాళ్లలో కలిపినట్లే సీతారామన్  ఆమెకు ఇపుడు దేశంలో ఏ రంగానికి ఎంత కేటాయించాలో.. దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో.. వంటి వాటిపై కసరత్తులు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 

ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక మంత్రిగా ఆమె ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపైనే ఆర్థిక స్థూల అంశాలన్నీ ఆధారపడి ఉంటాయి. కొన్ని వర్గాలు మాత్రం ఈమెను ఆర్థిక శాఖామాత్యులుగా నియమించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అసలు ఊహించని పరిణామమని పేర్కొన్నాయి. 

సీతారామన్ నియామకానికి తగ్గట్లే స్టాక్‌ మార్కెట్లు కూడా స్పందించినట్లు ఉన్నాయి. గురువారం రాత్రి అంచనాల ప్రకారం అమిత్‌ షాను ఆర్థిక మంత్రిగా ప్రకటిస్తారన్న భావనలతో సెన్సెక్స్‌ మొదట్లో లాభాలందుకుంది. 

కొత్త ఆర్థిక మంత్రి ప్రకటన రాగానే క్రమంగా సెన్సెక్స్‌ నష్టాల్లోకి వెళ్లింది. జైట్లీ ఆరోగ్యం బాగాలేనపుడు ఆ స్థానంలో రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించిన పీయూశ్‌ గోయెల్‌ను ఎంచుకొని ఉండి ఉంటే బాగుండేదని కొన్ని మార్కెట్‌ వర్గాలు సైతం అభిప్రాయపడ్డాయి. 

గోయెల్‌కు రైల్వేలు, వాణిజ్య మంత్రిత్వ శాఖను అప్పగించారు. అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం మోదీ ఉద్దేశం కావొచ్చు. పలు ఆర్థిక సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న సమయంలో నిర్మలా సీతారామన్‌ రాక చోటు చేసుకోవడం విశేషం. 

ముఖ్యంగా పరిశ్రమ నుంచి ఉద్దీపనల విషయంలో ప్రభుత్వం తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది.ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా చైనాకు తన స్థానాన్ని భారత్‌ కోల్పోయే ప్రమాదంలో ఇపుడుంది.

 దేశీయ, అంతర్జాతీయ వినియోగ గిరాకీ మందగమనం పాలు కావడంతో తయారీ కంపెనీలు ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆర్థికవేత్తను నియమించి ఉంటే బాగుండేదని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ ఎండీ చొక్కలింగం పేర్కొన్నారు. 

అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ పరిస్థితులను, దేశీయంగా ఐటీ, ఫార్మా, ఎగుమతి రంగాల పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వీలయ్యేదని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ ఎండీ చొక్కలింగం అన్నారు.

నియోగదారుల రంగంలోనూ క్లిష్టసమయం నడుస్తున్న వేళ గిరాకీ బాగా తగ్గి ఉన్న తరుణంలో ఒక వృత్తినిపుణుడిని గానీ, ఆర్థికవేత్తను నియమించాల్సిందని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ ఎండీ చొక్కలింగం వ్యాఖ్యానించారు. 

ప్రభుదాస్‌ లీలాధర్‌ సీఈఓ అజయ్‌ బోడ్కె స్పందిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సమర్థత సీతారామన్‌కు ఉందని,  పన్ను, జీడీపీ నిష్పత్తిని పెంచడంపై ఆమె దృష్టి సారించాలన్నారు. బలమైన ద్రవ్య ఉద్దీపనలూ ప్రవేశపెట్టాలని, వచ్చే అయిదేళ్లలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు..ఉద్యోగ సృష్టికి ఊతమివ్వాల్సి ఉందని స్పష్టం చేశారు. 

ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టా పొందడంతోపాటు ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖల్లో స్వత్రంత మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమె సొంతం అని ఎస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ వ్యాఖ్యానించారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా మూడేళ్ల అనుభవం సీతారామన్‌ను విత్త మంత్రిగా ముందు వరుసలో నిలబెట్టినట్లుందని అన్నారు. 

ఇప్పటిదాకా ఆమె చేపట్టిన శాఖలకు న్యాయం చేశారని, కొత్త బాధ్యతలనూ సమర్థంగానే నిర్వర్తించగలరని అమర్ అంబానీ పేర్కొన్నారు.అయితే అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈసారి మంత్రిత్వ పదవిని సున్నితంగా తిరస్కరించడంతో విత్తశాఖ పగ్గాలు నిర్మలా సీతారామన్‌ చేపడుతున్నారు. 

అయితే ఆమె ముందు పలు సవాళ్లు ఉన్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిద్దాం..

పీఎం కిసాన్‌ వంటి సంక్షేమ పథకాల ప్రకటన నేపథ్యంలో సాధారణంగానే ప్రభుత్వ పెట్టుబడులు పెరుగుతాయి. ప్రభుత్వ బ్యాంకులకు ఇవ్వాల్సిన మూలధన నిధులు సరేసరి. 

ఈ నేపథ్యంలో ద్రవ్యలోటుపై ఒత్తిడి పెరగకుండా.. ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించాల్సి ఉంది. ఆర్బీఐ నుంచి అదనపు నిధులు వచ్చినా.. మౌలిక రంగంపై పెట్టే పెట్టుబడుల్లో అవి 10 శాతంలోపే ఉండడం గమనార్హం.    

 భారత జీడీపీ వృద్ధి రేటు జనవరి-మార్చిలో 5.8 శాతం అని శుక్రవారం విడుదలైన గణాంకాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్‌ ఒకటిన్నరేళ్లలో తొలిసారిగా తన స్థానాన్ని చైనాకు కోల్పోయింది. 

పూర్తి ఏడాది(2018-19)కి కూడా అయిదేళ్ల కనిష్ఠ స్థాయి అయిన 6.8 శాతంగా వృద్ధి రేటు నమోదైంది. ఈ సమయంలో తిరిగి ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేయాల్సిన మహత్తర బాధ్యత సీతారామన్‌పై ఉంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం  మూలధన పునర్నిర్మాణం చేస్తే మొండి బకాయిల సమస్య వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కుంభకోణం తర్వాత ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి ఏర్పడ్డ ద్రవ్యలభ్యత సమస్యలను దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం స్పెషల్ విండో ఏర్పాటు చేస్తారన్న అంచనాలు ఉన్నాయి.    

ఇపుడు ప్రపంచమంతా వినిపిస్తున్న పదం ఉద్యోగాలతో కూడిన వృద్ధి. ఉద్యోగాల్లేకుండా వృద్ధి సాధించినా అది వాస్తవ వృద్ధి కాదనే భావన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఏటా 81 లక్షల కొత్త ఉద్యోగాల అవసరం ఉన్న భారత్‌కు ఏ చర్యలు తీసుకుని కొత్త ప్రభుత్వం వాటిని సృష్టిస్తుందో చూడాలి.

 ముఖ్యంగా 2017-18లో దేశంలో నిరుద్యోగ రేటు 45 ఏళ్లలోనే గరిష్ఠ  స్థాయి అయిన 6.1 శాతానికి చేరిన తరుణంలో.. ఉద్యోగ సృష్టి దిశగా ఏ అడుగులు పడతాయో చూడాలి.

కొంత కాలంగా ప్రైవేటు పెట్టుబడుల వాటా తగ్గుతోంది. 2014-15లో జీడీపీలో ప్రైవేటు పెట్టుబడుల వాటా 30.1 శాతంగా ఉండగా.. 2018-19 నాటికి అది 28.9 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులకు ఊతమిచ్చే చర్యలనూ ప్రకటించాల్సిన బాధ్యత సీతారామన్‌దే.    

దిగుమతులను ఎక్కువగా చేసుకునే భారత్‌.. ఎగుమతుల్లో మాత్రం వెనకడుగు వేస్తోంది. 2013-14లో జీడీపీలో ఎగుమతుల వాటా 25.4 శాతం కాగా.. 2018-19 నాటికి అది 19.7 శాతానికి తగ్గింది. 

 ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతుల విలువ పెరిగి అది అధిక ద్రవ్యలోటుకు దారితీస్తోంది. కరెన్సీ బలహీనతలూ దీని పుణ్యమే. వీటన్నిటికీ ముకుతాడు వేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

గత కొంత కాలంగా గ్రామీణ గిరాకీ మందగమనం పాలవుతోంది. దీంతో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు తమ ధరలను కూడా పెంచలేని పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ ఆదాయాలు తగ్గడం ఇందుకు నేపథ్యం.  

జీఎస్‌టీని తక్కువ రేట్లకు పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. మినహాయింపునిచ్చిన వాటిని కూడా జీఎస్‌టీ పరిధిలోకి తువాలి. కార్పొరేట్‌ పన్నుల్లో కోత విధించి.. మినహాయింపులను ఎత్తివేయాల్సి ఉంది. 

భారత్‌ నికర చమురు దిగుమతి దేశం. మన అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడ్డాం. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వనరులను సృష్టించుకోవాలి. అప్‌స్ట్రీమ్‌ రంగానికి చమురు దిగ్గజాలను ఆకర్షించేలా విధాన సంస్కరణలను తీసుకోవాలి. బొగ్గు బ్లాకులను వేలం వేసి ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉన్నది.

కొన్ని విధానాల వల్ల ప్రైవేటు టెలికం ఆపరేటర్లతో పోలిస్తే వెనకబడ్డ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌లను గాడిలో పెట్టాలి. ఈ రంగంలోని పన్నులు, ఫీజులను పునః సమీక్షించాలి. తక్కువ రేట్లకు రుణాలు లభ్యమయ్యేలా ఈ రంగానికి మౌలిక హోదా కల్పించాలి. 

ఏంజెల్‌ పన్ను సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. స్టార్టప్‌ల నమోదుకు నిబంధనలను సరళీకరించాలి. ఇ-కామర్స్‌ విధానాన్ని అందరూ పోటీపడేవిధంగా మార్చాలి. 

దేశీ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రోడ్లు, జాతీయ రహదారులు, నౌకాయాన రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెంచాలి. పీపీపీ మోడల్‌ను బలోపేతం చేయాలి. పోర్టుల ప్రైవేటీకరణ, నధుల అనుసంధాన ప్రాజెక్టులపై దృష్టి సారించాలి.

ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తూ విస్తృత వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాల్సిన బృహత్తర బాధ్యత నిర్మలా సీతారామన్‌పై ఉంది. మోదీ ఆధ్వర్యంలో బడ్జెట్‌కు రూపు కల్పించడం నుంచి ఆర్థిక అంశాలన్నిటిపై ఈమె తనదైన ముద్రను వేస్తుందా లేదా అన్నది కూడా వేచిచూడాల్సి ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios