Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు..2018-19లో ఆదాయం ఎంతంటే..?

రిలయన్స్ ఆదాయం 2018-19లో రూ.5.81 లక్షల కోట్లుగా నమోదైంది. వరుస పదేళ్లలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఆధిపత్యానికి గండి కొడుతూ ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో చోటు చేసుకున్నది. 
 

Reliance Industries topples IOC to become India's largest company
Author
Hyderabad, First Published Dec 17, 2019, 10:44 AM IST

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ప్రభంజనం సృష్టించింది. దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన సంస్థగా ఆర్‌ఐఎల్ రికార్డు పుటల్లోకి ఎక్కింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.5.81 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత సంవత్సరానికి ఫార్చ్యూన్ ఇండియా 500 విడుదల చేసిన జాబితాలో ఈ విషయం వెల్లడైంది. 

గత పదేళ్లుగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి తొలిస్థానంలో నిలిచిన ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ)ని వెనక్కినెట్టి ఈ స్థానాన్ని దక్కించుకున్నది ఆర్‌ఐఎల్. ఐవోసీ గతేడాది రూ.5.36 లక్షల కోట్ల ఆదాయంతో రెండో స్థానానికి పడిపోయింది. 

స్టాక్ మార్కెట్లో లిస్టయిన 2010 నుంచి అంతక్రితం ఏడాది వరకు ఐవోసీ తొలిస్థానంలోనే కొనసాగింది. రిలయన్స్ తొలి స్థానం రావడానికి రిటైల్, టెలికం, కన్జ్యూమర్ వ్యాపారాలు దన్నుగా నిలిచాయని ఫార్చ్యూన్ ఇండియా-500 నివేదిక వెల్లడించింది.

also read కేంద్ర, రాష్ట్రాల మధ్య జీఎస్టీ ‘బకాయి’ల చిచ్చు.. మాట తప్పుతున్న మోదీ సర్కార్

ముకేశ్ అంబానీ నేతృత్వంలో నడుస్తున్న ఆర్‌ఐఎల్.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.39,588 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో ఐవోసీ రూ.17,337 కోట్లు మాత్రమే. దేశీయ కార్పొరేట్ ప్రపంచంలో ఇంతటి స్థాయి ఆదాయాన్ని ఆర్జించిన సంస్థగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. 

రిలయన్స్ ఆదాయంలో 41.5 శాతం వృద్ధిని కనబరుచగా, అదే ఐవోసీ ఆదాయంలో 33.1 శాతం పెరుగుదల కనిపించింది. అంటే ఐవోసీ కంటే ఆర్‌ఐఎల్ ఆదాయం 8.4 శాతం అధిక వృద్ధిని నమోదు చేసుకున్నది. ఇదివరకు ప్రభుత్వరంగ సంస్థయైన ఐవోసీ పేరిట ఈ రికార్డు ఉన్నది. గడిచిన పదేళ్లలో ఆర్‌ఐఎల్ నికర లాభం ఐవోసీ కంటే మూడు రెట్లు అధికమైంది.

ఈ జాబితాలో 2018లో మూడోస్థానంలో నిలిచిన మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) ఈసారి కూడా ఇదే స్థానంలో కొనసాగింది. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉండగా, టాటా మోటర్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ఉన్నాయి. 

2018తో పోలిస్తే 2019లో ఈ సంస్థల ర్యాంకుల్లో ఎలాంటి మార్పులు నమోదు కాకపోవడం విశేషం. ఓఎన్‌జీసీ ఇటీవల కొనుగోలు చేసిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌లను కలుపుకోకుండానే ఈ జాబితాను రూపొందించింది ఫార్చ్యూన్. 

Reliance Industries topples IOC to become India's largest company

మరోవైపు, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఒక్కస్థానం ఎగబాకి ఈసారి 7వ స్థానానికి చేరుకున్నది. ఆ తర్వాతీ స్థానాల్లో టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సెన్ అండ్ టుబ్రో నిలిచాయి. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ రెండు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది. 

ఆ తర్వాత జాబితాలో హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చోటు దక్కించుకున్నాయి. ఇక మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత సంవత్సరానికి ఫార్చ్యూన్ జాబితాలో వేదాంతా తన ర్యాంక్‌ను మూడు స్థానాలు కోల్పోయి 18కి జారుకున్నది. 

ఫార్చ్యూన్ ఇండియా -500 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్న సంస్థల ఆదాయం సరాసరిగా 9.53 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఇదే సమయంలో లాభంలో 11.8 శాతం పెరుగుదల నమోదైంది. ఈ జాబితా నుంచి 57 సంస్థలు వైదొలిగాయి. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న సంస్థలు, ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా ఉన్నాయి. 

also read అభ్యుదయ నారి.. కార్పొరేట్‌ భేరి.. ఇప్పుడో వ్యాపార శిఖరం

ఈ ఫార్చ్యూన్ 500 సంస్థల్లో 65 కంపెనీలు నష్టాన్ని ప్రకటించాయి. మొత్తంగా నష్టపోయింది రూ.1.67 లక్షల కోట్లు. 2017-18లో 79 సంస్థలు రూ.2 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. వీటిలో అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టపోయాయి. 22 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 14 బ్యాంకులకు రూ.74,253 కోట్ల నష్టం సంభవించింది. కానీ, రెండంటే రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో ఫస్ట్ బ్యాంక్ రూ.1907.90 కోట్లు, లక్ష్మీ విలాస్ బ్యాంక్ రూ.894.10 కోట్లు) నష్టపోయాయి.

మొత్తం ప్రైవేట్ బ్యాంకుల్లో 24 సంస్థలు (విదేశీ, సహకార బ్యాంకులు కలుపుకొని) రూ. 60,747 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 6.16 శాతం అధికం. ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 22.3 శాతం చమురు, గ్యాస్ రంగాలకు చెందినవి కాగా, 15.88 శాతం బ్యాంకింగ్ రంగానికి చెందినవి. 

ఫార్చ్యూన్ ఇండియా -500 జాబితాలో సంఖ్యపరంగా చూస్తే బ్యాంకింగ్ రంగానికి చెందినవి 48 సంస్థలు ఉండగా, లాభాల్లో 23.44 శాతం వాటాతో చమురు, గ్యాస్ సంస్థలు ఉన్నాయి. రోడ్లు, విద్యుత్, స్టీల్ రంగానికి చెందిన సంస్థలు సకాలంలో రుణాలను తిరిగి చెల్లింపులు జరుపడంలో విఫలంకావడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios