అభ్యుదయ నారి.. కార్పొరేట్‌ భేరి.. ఇప్పుడో వ్యాపార శిఖరం


హెచ్సీఎల్ టెక్నాలజీస్ దేశీయంగా ఒక ఐటీ సంస్థ. ఈ సంస్థ అధినేత శివ్ నాడార్.. ఒకవైపు కార్పొరేట్ ఇండియా ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగా.. ఆయన గారాల పట్టి.. రోష్ని నాడార్ తొలుత సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి తర్వాత సంస్థ సీఈఓ స్థాయికి ఎదిగారు. 

Successfully Juggling Roles, Roshni Nadar Malhotra Is A True Woman

న్యూఢిల్లీ: భారత కార్పొరేట్‌ రంగానికి ఎంతోమంది బిజినెస్‌ మాగ్నెట్లు  వన్నె తెచ్చారు. ప్రస్తుతం తరం మారుతోంది. వారి వారసులు నెమ్మదిగా కార్పొరేట్‌ పగ్గాలు చేపట్టి తమను తాము ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. తమ పేరెంట్స్ నీడ నుంచి బయటపడి స్వతంత్రంగా విశ్వ విఖ్యాతి పొందుతున్నారు.

ఇప్పటికే కార్పొరేట్ ఇండియా రంగంలో ముకేశ్ అంబానీ దంపతుల ముద్దు బిడ్డ ఈషా అంబానీతోపాటు నిశా గోద్రెజ్‌, అనన్య బిర్లా వంటి వారి పేర్లు తరచూ వినిపిస్తుంటాయి. ఈ కోవలోకి మరో కార్పొరేట్‌ అధినేత శివ్ నాడార్ ముద్దుబిడ్డ రోష్ని నాడార్‌ మల్హోత్రా వస్తారు. 

మిగిలిన కార్పొరేట్ ఇండియా వారసులకు భిన్నంగా సామాజిక సేవ, కార్పొరేట్‌ బాధ్యతలను బ్యాలెన్స్‌ చేసుకొంటూ ఈ ఏడాది ఏకంగా ఫోర్బ్స్‌ అత్యంత శక్తివంతమైన తొలి 100 మంది మహిళల జాబితాలో చోటు సంపాదించుకొన్నారు రోష్ని నాడార్. 

ఈ జాబితాలో ఏంజెలా మెర్కల్, క్రిస్టియానా లగార్డో, ఇవాంక ట్రంప్‌ వంటి హేమాహేమీలు ఉన్నారు. భారత్‌ తరఫున ఈ జాబితాలో ముందున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(34) తర్వాత ఉన్నది 37 ఏళ్ల రోష్ని(54) అంటే అతిశయోక్తి కాదు. 

రోష్ని నాడార్ తర్వాతి స్థానంలో బయోకాన్‌ అధినేత కిరణ్‌ మజూందార్‌ షా(65) నిలిచారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే.. ఏడు బిలియన్‌ డాలర్ల కంపెనీని ఒంటి చేత్తో రోష్నినాడార్‌ నిర్వహిస్తున్నారు.

శివ్‌నాడార్‌, కిరణ్‌ దంపతులకు 1982లోలో రోష్ని జన్మించారు. ఆమె బాల్యం ఎక్కువగా దేశ రాజధాని హస్తినలోనే సాగింది. వసంత్‌ వ్యాలీ స్కూల్లో ప్రాథమిక విధ్యాభాస్యం చేశారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్‌ కోసం షికాగోలోని నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీకి వెళ్లారు. 

అక్కడ తొలుత ఆర్థశాస్త్రంలో డిగ్రీ చేద్దామనుకుని తర్వాత మనుసు మార్చుకొని రేడియో, టీవీ, ఫిల్మ్‌ సబ్జెక్టులు ప్రధానంగా కమ్యూనికేషన్స్‌ డిగ్రీ అందుకొన్నారు. రెండేళ్లు లండన్‌లోని స్కైన్యూస్‌లో న్యూస్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. సీఎన్‌ఎన్‌లో కూడా పనిచేసిన అనుభవం అమెకు ఉంది. ఆ తర్వాత మళ్లీ షికాగోకు వెళ్లి కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో సోషల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజీలో పట్టా పుచ్చుకొన్నారు.

 

భారత్‌ వచ్చాక ఒక సాధారణ ఉద్యోగిలా ఆమె హెచ్‌సీఎల్‌లో చేరారు. 2009లో ఆమె హెచ్‌సీఎల్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. వాస్తవంగా హెచ్‌సీఎల్‌ పూర్తిగా టెక్నాలజీ పై పనిచేసే పెద్ద సంస్థ. రోష్నికి టెక్‌ నేపథ్యం లేదు. అయినా ఆమె ఆ లోటును ఎక్కడా కనిపించనివ్వరు. 

‘ఏ సంస్థనైనా నడపడానికి దాని ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలి.. వివిధ విభాగాలను నడిపే వారి సామర్థ్యాన్ని అంచనా వేయగలిగితే.. అది ఏ కంపెనీ అయినా నడపొచ్చు’  అని అంటారు రోష్ని.  ఆమె ఆలోచనలతోనే హెచ్‌సీఎల్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించింది. హెచ్‌సీఎల్‌ టాలెంట్‌ కేర్‌ను బలోపేతం చేసింది. 
‘ఐడియాప్రెన్యూర్‌షిప్‌’ పేరిట ఉద్యోగుల నుంచి సేకరించిన ఉత్తమ వ్యాపార ఆలోచనలను ఇంక్యూబేట్‌ చేసే కార్యక్రమాన్ని రోష్ని నాడార్ ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమం కింద 2014నాటికే హెచ్‌సీఎల్‌ ఉద్యోగులు చేసిన ఆలోచనల విలువ 500 మిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. 

దాదాపు 32వేల సృజనాత్మక ఆలోచనలు హెచ్‌సీఎల్‌ అమ్ములపొదిలోకి చేరాయి. వీటిల్లో కొన్ని ఆలోచనలను అభివృద్ధి చేసింది కూడా. ఇలాంటి ఆలోచనల నుంచి వచ్చిందే ‘హెచ్‌సీఎల్‌ కమ్‌నెట్‌’ సంస్థ. 

‘‘భారత ఐటీ పరిశ్రమలో 27 శాతం మంది మహిళా ఉద్యోగులే ఉన్నారు. వీరంతా ఒక స్థాయి కంటే కిందే ఉండిపోయారు. కంపెనీలను నడిపించే  నాయకత్వం స్థాయికి చేరలేదు. అంతెందుకు.. మా హెచ్‌సీఎల్‌లో 1.50 లక్షల మంది ఉద్యోగుల్లో టాప్‌ మేనేజ్‌మెంట్ గ్రూప్‌లో 200 మంది ఉన్నారు. వీరిలో ఒక్క మహిళ కూడా లేదు. బోర్డులో నేను, నాతోపాటు మరో ఇద్దరు ఉన్నారు ’’ అని రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో రోష్ని నాడార్‌ తెలిపారు. 

దీంతో తమ సంస్థలో మహిళల్లో నాయకత్వ లక్షణాలు  పెంపొందించడానికి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల నుంచి నిపుణులను తెప్పించి వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. హెచ్‌సీఎల్‌ బోర్డులోని ఇద్దరు డైరెక్టర్ల చొప్పున ఒక బృందంగా ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకోసారి ప్రతిభావంతులైన 100 మంది మహిళా ఉద్యోగులకు లంచ్‌ ఏర్పాటు చేస్తున్నారు. 

బోర్డులోని ప్రతి సభ్యుడు కొందరు ప్రతిభావంతులైన మహిళా ఉద్యోగులకు దగ్గరుండి మార్గదర్శకత్వం వహించేలా ఏర్పాట్లు చేశారు. 2016లోనే బిజినెస్‌ టుడే రోష్నిని ఆ ఏడాదిలో అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తించింది. మరోవైపు దేశంలో సామాజిక అసమానతలను తొలగించడానికి ఏర్పాటు చేసిన శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌కు రోష్ని ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో రోష్ని నాడార్ విద్యాజ్ఞాన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని కింద అత్యంత ప్రతిభావంతులైన పేద విద్యార్థులను గుర్తించి చదివిస్తున్నారు. వీరంతా నూటికి నూరుశాతం మంది సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను పూర్తి చేశారు. వీరందరి మార్కుల సగటు 80శాతంపైగా ఉండటం విశేషం.

రోష్ని నాడార్ ఒకవైపు హెచ్‌సీఎల్‌ బాధ్యతలను నిర్వహిస్తూనే శివ్‌నాడార్‌ యూనివర్సిటీని, విద్యాజ్ఞాన్‌ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. దీంతోపాటు శివ్‌నాడార్‌ స్కూల్‌కు, తన తల్లి పేరిట ఉన కిరణ్‌ నాడార్‌ ఆర్ట్‌ ఆఫ్‌ మ్యూజియానికి ట్రస్టీ బాధ్యతలను కూడా చూసుకొంటున్నారు. రోష్నికి 2014లో యువ దాతగా ఎన్‌డీటీవీ అవార్డు కూడా  దక్కింది. రోష్ని 2010లో శిఖర్‌ మల్హోత్రాను వివాహం చేసుకొన్నారు. ఆయన ప్రస్తుతం హెచ్‌సీఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. రోష్నికి అర్మాన్‌, జహాన్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios