Asianet News TeluguAsianet News Telugu

రెండోసారీ జెఫ్ బెజోస్: తొలిసారి టాప్ 10లోకి ముకేశ్.. హ్యురన్ ‘రిచ్’ లిస్ట్


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ బిజినెస్ రంగంలో రికార్డుల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే జియోతో భారత టెలికం రంగాన్ని ఒక కుదుపు కుదిపిన ముకేశ్.. త్వరలో రిటైల్ రంగంపై పట్టు సాధించే దిశగా అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో హ్యురన్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సంపన్నుల సర్వేలో తొలిసారి టాప్ 10లో నిలిచారు. ఏడేళ్లలో 30 బిలియన్ల డాలర్లు సొమ్ము కూడబెట్టారు.

Mukesh Ambani breaks into top 10 on Hurun rich list as brother Anil, with $1.9 bn, fights bankruptcy
Author
Mumbai, First Published Feb 27, 2019, 1:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబై: ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల్లో రెండోసారి కూడా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిలిచారు. ఇక టాప్ -10లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తొలిసారిగా చోటు దక్కించుకున్నారు. 54 బిలియన్‌ డాలర్ల (రూ.3.83 లక్షల కోట్లు) నికర సంపదతో అంతర్జాతీయ కుబేరుల జాబితాలో పదో స్థానంలో ముకేశ్‌ నిలిచారని ‘ది హ్యూరన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2019’పేర్కొంది.

స్టాక్ మార్కెట్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లు రాణించడం ముకేశ్‌ అంబానీకి కలిసొచ్చింది. గత నెలలో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ రూ.8 లక్షల కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌లో ముకేశ్‌కు 52 శాతం వాటా ఉంది. 

ఇక ముకేశ్‌ సోదరుడైన అనిల్‌ అంబానీ నికర సంపద విలువ గణనీయంగా తగ్గిపోయింది. స్వీడన్ టెలికం దిగ్గజం ఎరిక్సన్‌కు రూ.540 కోట్ల బకాయి చెల్లించకపోవడంతో సుప్రీం కోర్టు నుంచి అరెస్ట్‌ హెచ్చరికలు కూడా అందుకున్న విషయం తెలిసిందే.ఏడేళ్ల క్రితం 7 బిలియన్ల డాలర్లుగా ఉన్న అనిల్‌ అంబానీ సంపద 5 బిలియన్‌ డాలర్లు తగ్గి 1.9 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.  
ఈ రిలయన్స్ సోదరులిద్దరూ కుటుంబ సంపదను పంచుకున్న సమయంలో, ఒకే దగ్గర ప్రయాణం ప్రారంభించినా.. ముకేశ్‌ గత ఏడేళ్లలో తన సంపదను 30 బిలియన్‌ డాలర్ల మేర పెంచుకోగా.. అనిల్‌ అదే సమయంలో 5 బిలియన్ల డాలర్లు పోగొట్టుకున్నారు.

ఇక అంతర్జాతీయంగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ 147 బిలియన్ల డాలర్ల సంపదతోవరుసగా రెండో ఏడాదీ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగారు. అయితే భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈ స్థానంలో కొనసాగకపోవచ్చునన్న అభిప్రాయం కూడా ఉన్నది.

మరోవైపు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ 96 బిలియన్ డాలర్లు, స్టాక్ మార్కెట్ నిపుణుడు వారెన్‌ బఫెట్‌ 88 బిలియన్ డాలర్లు సంపాదించగా, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 86 బిలియన్ డాలర్లు, ఫేస్ బుక్ సీఈఓ జుకర్‌బర్గ్‌ 80 బిలియన్ల డాలర్లతో రెండు, మూడు, నాలుగు, అయిదో స్థానాల్లో నిలిచారు.

ఇదిలా ఉంటే భారతీయ కుబేరుల్లో ముకేశ్‌ అంబానీ తర్వాతి స్థానాల్లో హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎస్‌.పి. హిందుజా 21 బిలియన్ డాలర్లు, విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ 17 బిలియన్ల డాలర్లతో తర్వాతీ స్థానాల్లో నిలిచారు. పూనావాలా ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా 13 బిలియన్ డాలర్లతో భారత కుబేరుల్లో నాలుగో స్థానం పొందారు. 

ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌, కొటక్ మహేంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్‌ కోటక్‌, ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్‌ అదానీ, దిలీప్‌ సంఘ్వి అయిదో, ఆరో, ఏడో స్థానాల్లో నిలిచారు. కాగా, గోద్రేజ్‌ కుటుంబం మూడో తరం వారసురాలైన స్మిత క్రిష్ణ భారత 6.1 బిలియన్ల డాలర్ల సంపదతో మహిళా కుబేరుల జాబితాలో అగ్రస్థానం పొందారు.

మరోవైపు 3.5 బిలియన్ డాలర్ల పాదించి.. సొంతంగా ఎదిగిన అగ్రగామి మహిళా పారిశ్రామికవేత్త కిరణ్‌ మజుందార్‌ షా నిలిచారు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత సుభాష్ చంద్ర, సన్‌టీవీ కళానిధి మారన్‌ తమ నికర సంపదలో క్షీణతను చవిచూశారు.

2012 తర్వాత హూరన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో భారత్‌ అయిదో స్థానానికి పరిమితం కావడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, రూపాయి బలోపేతం వల్ల బలహీన పడిన రూపాయి, స్టాక్‌ మార్కెట్ల మందగమనం వల్ల జాబితాలో భారత్ మూడో వంతు అవకాశాలను కోల్పోయింది. 

ఈ ఏడాది జాబితాలో మొత్తం కుబేరుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 2,694 నుంచి 2,470కు తగ్గింది. ఈ 2,470 మంది కుబేరుల మొత్తం సంపద 9.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఇది అంతర్జాతీయ జీడీపీలో 12 శాతానికి సమానం అని హ్యురన్  గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2019 పేర్కొన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios