ఎయిర్ ఇండియా అమ్మకానికి... కేంద్రం గ్రీన్‌సిగ్నల్...
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వివిధ రకాల సేవలందించిన కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఎఐ) ప్రైవేట్ వ్యక్తుల పరం కానున్నది. సంస్థకు గల రూ.64 వేల కోట్ల నష్టాల సాకుతో దాన్ని పూర్తిగా అమ్మివేసేందుకు కేంద్రం చేపట్టిన కసరత్తు పూర్తి కావచ్చింది. ఈ నెలలోనే ఎఐ విక్రయానికి బిడ్లను ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైంది.
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ముసాయిదాను సిద్ధం చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని సాధికారిక మంత్రుల బృందం సమావేశమై వాటాల అమ్మకానికి బిడ్లను ఆహ్వానించేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఎయిర్ ఇండియాకు గల రూ.60 వేల కోట్ల విలువైన అప్పులను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవో) కింద బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిలో రూ.29,400 కోట్లను ఇదివరకే బదిలీ చేసింది కూడా. దీర్ఘకాలంగా నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియాను ఆదుకోవడానికి కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు వాటాల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
also read ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ కారుపై రాళ్లదాడి, తీవ్రగాయాలు
ఎయిర్ ఇండియా అమ్మకం ఈవోఐ, షేర్ పర్చేజ్ అగ్రిమెంట్లను ఈ నెలలోనే జారీ చేస్తామని సంస్థ అధికారి తెలిపారు. ఆసక్తి గల బిడ్లర్ల నుంచి ఈ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుందని తామ భావిస్తన్నామని తెలిపారు. ఎయిరిండియాతోపాటు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐసాట్స్‌తో కలిసి 100 శాతం విక్రయించే ప్రతిపాదనకు గత ఏడాది సెప్టెంబరులోనే ఎయిరిండియా స్పెసిఫిక్ అల్టర్‌నెటివ్ మెకా నిజమ్ (ఏసియామ్) సమ్మతి తెలిపింది.
మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి షాతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్, విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తదితరులు హాజరయ్యారు. ఎయిర్ ఇండియాలో పూర్తిస్థాయి వాటాను విక్రయిస్తామని హర్దీప్‌సింగ్ పూరి ఇటీవల చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరం ఎయిర్ ఇండియాకు రూ.8,556.35 కోట్ల నష్టం సంభవించింది. ఎయిర్ ఇండియాను మూసివేస్తున్నట్లు వస్తున్న పుకార్లను ఎయిర్ ఇండియా వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ మీనాక్షి మాలిక్ కొట్టిపారేశారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నా, వాటాల విక్రయం లేదా సంస్థ వద్ద ఉన్న ఆస్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్ ఇండియా వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ మీనాక్షి మాలిక్ తెలిపారు.
also read ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు 2 లక్షలు జరిమానా...ఎందుకంటే ?
ప్రస్తుతం రవాణా మార్కెట్లో ఎయిర్ ఇండియాను మూసివేయనున్నట్లు విపరీతంగా వస్తున్న వదంతుల్లో ఎలాంటి నిజం లేదని సంస్థ వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ మీనాక్షి మాలిక్ స్పష్టంచేశారు. రోజుకు రూ.27 కోట్ల నష్టం వస్తున్నా, ఇప్పటి వరకు ఎలాంటి విమాన సర్వీసును రద్దు చేయలేదని, ప్రయాణికులకు అందిస్తున్న సేవల్లోనూ కోత విధించలేదని చెప్పారు.
ఇదిలా ఉంటే, గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి అమ్మకం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్టు సమాచారం. ఈసారి ఏఐ ఈక్విటీలో నూరు శాతం ప్రభుత్వ వాటాను అమ్మకానికి పెడుతున్నారు. ఉన్న ఉద్యోగులను ఏడాది తర్వాత వీఆర్‌ఎస్ ద్వారా ఇంటికి సాగనంపుతారు.