పసిడి ధర గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠస్థాయికి చేరుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత) ధర రూ.43వేల పైకి, ఆభరణాల పసిడి (22 క్యారెట్లు) గ్రాము ధర రూ.3,980కి పలికింది. 

దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు వాణిజ్య రాజధాని ముంబైలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రొద్దుటూరు సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాస్త తక్కువ ధరలే నమోదయ్యాయి. బంగారం ధరల్లో వ్యత్యాసం ఎలా ఉందనే ప్రశ్నకు, అక్కడ పాత బంగారం విక్రయానికి రావడం, కొత్త అమ్మకాలు లేక, ధర తగ్గించి అమ్ముతున్నారనే జవాబు విక్రేతల నుంచి వస్తోంది.

పసిడి, వెండి ధరలు మళ్లీ పైపైకి వెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు ఉన్నప్పుడు పెట్టుబడులు అధికంగా తరలి రావడం వల్ల బంగారం ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) వల్ల చైనా నుంచి విడిభాగాలు, ఉత్పత్తుల సరఫరాలు స్తంభించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాహన, మొబైల్‌, ఔషధ.. రంగాల కంపెనీలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. 

చైనాలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ వాణిజ్యం, వృద్ధిరేటుపైనా ప్రభావం చూపుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారంపైకి పెట్టుబడులు అధికమయ్యాయి. ఫలితంగా ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 1618 డాలర్లకు చేరింది. ఇటీవలి వరకు 1550 డాలర్ల వద్దే ఈ ధర కదలాడటం గమనార్హం. ఇదేవిధంగా డాలర్‌కు కూడా గిరాకీ అధికమై, గురువారం రూ.71.64కు చేరింది. దీంతో దేశీయంగా బంగారం ధర భగ్గుమంది. వెండి కూడా ఇదే బాటలో నడిచి కిలో రూ.49,000పైకి చేరింది.

అంతర్జాతీయ విపణి ప్రకారమే మేలిమి బంగారాన్ని బ్యాంకుల్లో కొనుగోలు చేయాల్సి ఉంది. అంటే ఔన్సు మేలిమి బంగారం ధర మన రూపాయల్లో (1618x71.64)+15.5 శాతం పన్ను కలిపి రూ.1,33,879 అవుతుంది. ఈ లెక్కన గ్రాము రూ.4304 పడుతుంది. ఇతర వ్యయాలు కూడా కలుపుకుని హైదరాబాద్‌ బంగారం షాపులు, బులియన్‌ విపణిలో రూ.4,350లకు విక్రయించారు.  ఆభరణాల బంగారం గ్రాము రూ.3,980 చొప్పున విక్రయిస్తున్నారు.

వెండి కిలో ధర రూ.49,270 చొప్పున చెబుతున్నారు. రిటైల్‌గా మాత్రం వెండి గ్రాము రూ.51 చొప్పున విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబైల్లో మాత్రం హైదరాబాద్‌ కంటే కాస్త తక్కువ ధరలే ఉన్నాయి. అక్కడ పాత బంగారం విక్రయించేందుకు ప్రజలు ముందుకు రావడమే ఇందుకు కారణమని బులియన్‌ ట్రేడర్లు తెలిపారు. చెన్నైలో మాత్రం హైదరాబాద్‌ ధరలే అమలవుతున్నాయి.

ఓ పక్క వివాహాది శుభకార్యాలు ఉన్నా, పసిడి-వెండి అమ్మకాలు బాగా తగ్గాయని విక్రేతలు తెలిపారు. వేడుకలకు అవసరమైన వారు ముందస్తు కొనుగోళ్లు చేయడంతో ఇప్పుడు కాస్త ఊరట చెందుతున్నారు. గిఫ్ట్‌లుగా వెండి, బంగారం ఆభరణాలు ఇద్దామని భావించిన వారు కూడా, ప్రస్తుత ధరలతో బెంబేలెత్తి, నగదు రూపంలో ఇచ్చేస్తున్నారని, అందువల్లే విక్రయాలు బాగా తక్కువగా ఉన్నాయని వివరించారు. 

పాత బంగారం తీసుకొచ్చి, అవసరమైతే మరికొంత జతచేసుకుని, కొత్త ఆభరణాలు తీసుకుంటున్న వారే ఉంటున్నారని తెలిపారు. పాత బంగారం విక్రయించాలనుకున్న వారికి గ్రాముకు రూ.20 తక్కువగా, 3% జీఎస్‌టీ మినహాయించుకుని కొందరు వ్యాపారులు నగదు చెల్లిస్తున్నారు. అంటే ఆభరణాల బంగారం గ్రాముకు కనీసం రూ.140 ధర తగ్గించి మాత్రమే తీసుకుంటున్నారు.

కొత్త ఆభరణాలకు గిరాకీ లేదనే భావనతో, అవసరాన్ని బట్టి బాగా తగ్గించి అడుగుతున్న వ్యాపారులూ ఉన్నారు. అందువల్ల పాత బంగారాన్ని విక్రయించాలనుకునే వారికీ ప్రయోజనం కనిపించే పరిస్థితి లేదు. చైనాలో కరోనా కొత్త కేసుల తీవ్రత తగ్గుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, మళ్లీ స్టాక్‌మార్కెట్లు పుంజుకుంటే మినహా బంగారం ధరలు దిగివచ్చే పరిస్థితి లేదని బులియన్‌ ట్రేడింగ్‌ సంస్థ క్యాప్స్‌గోల్డ్‌ డైరెక్టర్‌ చందా శ్రీనివాసరావు తెలిపారు. 

కొనుగోలుదారులు లేక వాస్తవ ధర కంటే తగ్గించి మేలిమి బంగారం గ్రాము రూ.4,180 ఆభరణాల బంగారం గ్రాము రూ.3,866 చొప్పున కొందరు వ్యాపారులు విక్రయిస్తున్నారని ఏపీ గోల్డ్‌డైమండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు బుశెట్టి రామ్మోహనరావు పేర్కొన్నారు. వ్యాపారాలు తగ్గడంతో ఉద్యోగులనూ సంస్థలు తొలగిస్తున్నాయని, ధర మరింత పెరిగితే, వ్యాపారాల స్థితి దుర్భరమవుతుందని వివరించారు.