ప్రాణాంతక వైరస్‌ కరోనా.. మహమ్మారిగా ముదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే వీలుందని, మాంద్యానికి అవకాశాలు ఉన్నాయని గ్లోబల్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ బుధవారం హెచ్చరించింది. చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌.. క్రమక్రమంగా విదేశాలకూ పాకుతుండటం ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నది. మనుషుల ప్రాణాలను మింగేస్తున్న ఈ వైరస్‌.. ఆర్థిక వ్యవస్థలనూ బలిగొంటుండటంతో దీన్ని అంతమొందించకపోతే అనర్థాలు తప్పవని మూడీస్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ‘చైనా ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఇప్పటికే దెబ్బ తీసింది. ఇప్పుడిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలో పడేస్తున్నది’ అని మూడీస్‌ అనలిటిక్స్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ మార్క్‌ జండి అన్నారు. 

‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనేక మార్గాల్లో కోవిడ్‌-19 దాడి చేస్తున్నది. చైనాకు ప్రయాణాలు తగ్గి పర్యాటక రంగం దెబ్బతిన్నది. విమానాల రాకపోకలు మందగించాయి. జల రవాణా కూడా స్తంభించిపోయింది. దీనివల్ల అమెరికా వంటి ఇతర దేశాలూ ప్రభావితమవుతున్నాయి. ఏటా చైనాకు చెందిన దాదాపు 30 లక్షల పర్యాటకులు అమెరికాకు వెళ్తున్నారు. ఇప్పుడిది ఆగిపోయినైట్లెంది’ అని జండి తెలిపారు.

ఇక ఇటలీ రాజధాని మిలాన్‌లోనూ కరోనా వ్యాపిస్తుండటంతో మొత్తం ఐరోపా సమాజంపైనే ప్రభావం పడుతున్నదని మూడీస్‌ చెప్పింది. ఐరోపా దేశాల్లో ప్రధాన పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న ఇటలీలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. 

దీంతో ఆదాయం పడిపోయి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి మొత్తం వ్యవస్థలే నీరుగారిపోయే ప్రమాదం ఉందని మూడీస్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దక్షిణ కొరియాలోనూ కరోనా ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ప్రపంచ తయారీ రంగంపై మరింత ప్రభావం పడుతున్నదని, జీడీపీ దెబ్బతింటున్నదని మూడీస్ విశ్లేషకులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇంతలా ప్రభావితం చేయడానికి కారణం.. చైనా గ్లోబల్‌ తయారీ కేంద్రంగా ఉండటమే. హెయిర్‌ పిన్ మొదలు ఏరోప్లేన్‌ వరకు చైనాలో తయారవుతున్నాయి. దాదాపు ప్రపంచంలోని వివిధ రంగాల సంస్థలన్నింటికీ చైనాలో ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి. 

కరోనా వైరస్‌ కారణంగా చైనాలోని వివిధ రంగాల ఉత్సాదక సంస్థల యూనిట్లన్నీ మూతబడ్డాయి. ఈ అంటువ్యాధి భయాలతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి ఉండటంతో అన్ని రకాల తయారీ నిలిచి పోయింది. దీంతో చైనా నుంచి వివిధ దేశాల్లోని ఉత్పాదక కేంద్రాలకు చేరాల్సిన ముడి సరుకుకు బ్రేకులు పడ్డాయి. ఫలితంగా ఆయా దేశాల ఉత్పాదక సామర్థ్యం కూడా ఒక్కసారిగా ప్రభావితమవుతున్నది.

ఇప్పటికే భారత్‌లో ఆటో, మొబైల్‌, టెలివిజన్‌ తదితర ఎలక్ట్రానిక్స్‌ రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, వాహన విడిభాగాల తయారీ చైనాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి మరి. ఇప్పటికీ వేల పరిశ్రమలు మూతబడే ఉన్నాయి. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా సర్కార్ తీసుకుంటున్న చర్యలు కూడా ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తున్నాయి. 

స్తంభించిన రవాణా వ్యవస్థ.. కార్మికులను ఇళ్లకే పరిమితం చేస్తున్నది. చైనా పరిస్థితులు యాపిల్‌, నైక్‌, జనరల్‌ మోటార్స్‌, హ్యుందాయ్‌ వంటి దిగ్గజ సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తుండగా, ఇతర దేశాల్లోని వ్యాపార అవకాశాలనూ మింగేస్తున్నాయి. 

భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని దగ్గరగా గమనిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఏయే రంగాలపై ఎంతెంత ప్రభావం ఉందన్నదాన్ని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. 

‘మేము కరోనా పరిస్థితుల్ని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాం. ఆయా రంగాలవారీగా పరిశ్రమలపై వైరస్‌ ప్రభావాన్ని కార్యదర్శుల స్థాయి అధికారులు అంచనా వేస్తున్నారు. చైనాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. ఇతర దేశాల నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకోవడానికి ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తున్నాం’ అని బుధవారం ఇక్కడ నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

ఇదిలావుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతున్నదని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ న్నారు. గతేడాది ఆగస్టులో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను.. నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎస్బీఐలో దాని అనుబంధ బ్యాంకులను, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా, దేనా బ్యాంక్‌లను కలిపేసిన సంగతి విదితమే.

కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మునుపెన్నడూ లేని విపత్తు సంభవించే వీలుందని ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు. చైనా ఉత్పాదక రంగం కుదేలవడంతో ప్రపంచ జీడీపీ ఒక శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు. 

అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాయే. ఈ దేశంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలెన్నో ఉన్నాయి. భారత్‌ కూడా ఫార్మా, కెమికల్‌, ఆటో కంపోనెంట్‌, సోలార్‌, స్టీల్‌, టెలికం, వైట్‌ గూడ్స్‌, ఎలక్ట్రానిక్‌ కంపోనెంట్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, పాదరక్షలు, దుస్తులు తదితర రంగాల్లో దిగుమతులు చేసుకుంటున్నది. 

దీంతో కరోనా దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ కూడా సహజంగా ప్రభావితం అవుతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పెట్రో ఉత్పత్తుల వినియోగంలో చైనాదే అగ్రస్థానం. కానీ ఇప్పుడు తయారీ, రవాణా వ్యవస్థలు స్తంభించిపోవడం, చైనాకు ఇతర దేశాల నుంచి రాకపోకలు కూడా తగ్గడంతో ప్రపంచ ముడి చమురు ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్నది. 
దీంతో చమురు ఉత్పాదక దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులు అవుతున్నాయి. అమెరికాసహా ఇతర దేశాల ఎగుమతులూ చైనాకు పడిపోతుండటంతో మొత్తం ప్రపంచ జీడీపీకి ఎసరు వస్తున్నదని నిపుణులు అంటున్నారు. 

చమురుతోపాటు కాపర్‌, సోయాబీన్స్‌, పంది మాంసం చైనాకు ఎక్కువగా వెళ్తున్నది. మరోవైపు మొబైల్స్‌, టెలివిజన్లు, ఆటో రంగాల విడిభాగాల తయారీ నిలిచిపోవడంతో ఇతర దేశాల్లో వాటి తయారీ మందగించి ధరలు పెరిగే వీలుందని, ఎరువులు, వ్యవసాయోత్పత్తుల దిగుమతులు తగ్గి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని చెబుతున్నారు. 

ఆర్బీఐ సైతం చైనాపై కరోనా ప్రభావాన్ని గమనిస్తున్నామని చెప్పడం.. ద్రవ్యసమీక్షపై దాని ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తున్నది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాలూ చైనా పరిస్థితులకు ప్రభావితమవుతున్నాయని అంటున్నారు. మొత్తానికి చైనా కరోనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే షేక్‌ చేస్తున్నది.