ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మందగమనాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వేగిరానికి విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన నిర్ణయాలను అమెరికా వ్యాపార వర్గాలు స్వాగతించాయి. నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన పలు ఉద్దీపన కార్యక్రమాలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అవకాశం మెండుగా ఉన్నదన్నారు. 

ఈ చర్యలతో భారత్‌ అంతర్జాతీయంగా పెట్టుబడుల కేంద్రంగా కొనసాగనుందని విదేశీ వ్యాపార వేత్తలు తెలిపారు. ‘నిర్మలా సీతారామన్‌, కేంద్రం తీసుకున్న పలు ఉద్దీపన చర్యలను మేం స్వాగతిస్తున్నాం.

దీని ద్వారా వృద్ధి రేటు గాడిన పడి ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది’ అని యూఎస్‌-ఇండియా వాణిజ్య మండలి అధ్యక్షురాలు నిశా దేశాయ్‌ బిశ్వాల్‌ పేర్కొన్నారు. 

ఈ చర్యలతో విదేశీ మదుపర్లకు సానుకూల సంకేతాలు పంపారని తెలిపారు. దీంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందన్నారు. 

భారత ప్రభుత్వ నిర్మాణాత్మక చర్యలు సులభతర వాణిజ్యానికి దోహదం చేస్తాయని భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో భారత్‌లో విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ మెరుగైన అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మందగమనం కనిపిస్తుండటంతో వృద్ధి వేగం పెంచడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసిన విషయం తెలిసిందే. 

విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ)పై విధించిన అధిక పన్నులు వెనక్కి తీసుకోవడం నుంచి.. స్టార్టప్ సంస్థలకు ఏంజెల్‌ పన్నును ఉపసంహరించడం దాకా పలు తాయిలాలిచ్చారు. ప్రభుత్వ ఉద్దీపన చర్యలను కార్పొరేట్‌, పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి.

సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ ఈ సందర్భంగా స్పందిస్తూ ‘గొప్ప ప్యాకేజీని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ తదుపరి స్థాయికి వెళ్లడానికి ఇది దోహదపడుతుంది’ అని తెలిపారు. 

‘వాహన తరుగుదలను 15 శాతం నుంచి 30 శాతానికి పెంచడం, పెంచిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను వాయిదా వేయడం సానుకూల పరిణామం. వాహనాలపై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. ఇది న్యాయమైనది’ అని జేఎల్‌ఆర్‌ ఇండియా అధ్యక్షుడు రోహిత్‌ సూరి తెలిపారు. 

అసోచామ్‌ అధ్యక్షుడు బీకే గోయెంకా ఈ సందర్భంగా స్పందిస్తూ ‘ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టి ఉంచుకుని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. పరిశ్రమ దీనికి చాలా సానుకూలంగా స్పందించనుంది. ఇవి చాలా విలువైన నిర్ణయాలు’ అని పేర్కొన్నారు. 

సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా స్పందిస్తూ.. ‘పరిశ్రమ వర్గాలతో చర్చలు చేపట్టిన రెండు వారాల్లోనే ప్యాకేజీ ప్రకటించడం హర్షణీయం. వాహన పరిశ్రమకు రుణాల లభ్యత ప్రధాన సమస్యగా మారింది. తాజా నిర్ణయాలు ఉపశమనం అందిస్తాయి’ అని తెలిపారు. 

బీఎస్‌ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌ కుమార్‌ ప్రతిస్పందిస్తూ.. ‘ ప్రభుత్వం ప్రకటించిన చర్యలు స్వల్ప, దీర్ఘకాలంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి. దీర్ఘకాల ప్రభావాన్ని దృష్టి పెట్టుకుని ఎఫ్‌పీఐ పన్ను ప్రతిపాదన ఉపసంహరించుకోవడం మార్కెట్లకు సానుకూల పరిణామం’ అని పేర్కొన్నారు.

మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. ‘ఎఫ్‌పీఐలు, డీఐఐల లాభాలపై సర్‌ఛార్జీ విధింపు ప్రతిపాదన వెనక్కి తీసుకోవడం చాలా కీలకమైనది. ప్రభుత్వం సమస్యలను గమనిస్తోంది అనడానికి ఇది నిదర్శనం. ఇది మార్కెట్లకు మళ్లీ జవసత్వాలను అందిస్తుంది’ అని చెప్పారు. 

మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ ప్రతిస్పందిస్తూ.. ‘ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే, వాహన పరిశ్రమకు సైతం లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం ముందుండి నిర్ణయాలు ప్రకటించింది. రాష్ట్రాలు దీన్ని అనుసరించాలి.

కొన్ని రాష్ట్రాలు ఇటీవల పెంచిన పన్నులు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను తగ్గించాలి. ప్రభుత్వ నిర్ణయాలు వాహన రంగం పుంజుకోవడానికి దోహదపడతాయని భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.