Asianet News TeluguAsianet News Telugu

ఏటీఎంలో డబ్బులు రాకుంటే బ్యాంకులకు ఫైన్: ఆర్బీఐ రూల్ కఠినం ఇలా

ఏటీఎంల్లో నుంచి నగదు రాకపోయినా, ఖాతాదారుడి అక్కౌంట్ నుంచి విత్ డ్రాయల్ అయితే ఆ మొత్తాన్ని తిరిగి సదరు ఖాతాదారుడి ఖాతాలో జమ చేయడం బ్యాంకు బాధ్యత. ఐదు రోజుల్లో జమ చేయకుంటే రోజుకు రూ.100 చొప్పున పెనాల్టీ చెల్లించాల్సిన బాధ్యత ఆ బ్యాంకుదేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

Failed ATM services: RBI tightens norms for banks, up penalties
Author
New Delhi, First Published Sep 22, 2019, 12:43 PM IST

అన్ని రకాల ఆన్​లైన్​లైన్​ లావాదేవీలకు భరోసానిస్తూ ఆర్బీఐ దృఢమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రకమైన లావాదేవీల్లో సాంకేతిక సమస్యలతో డబ్బు స్తంభిస్తే.. వినియోగదారుడికి నష్టం కలగకుండా కఠిన నిబంధనలు తెచ్చింది.

రీఫండ్​ల విషయంలో బ్యాంకులు జాప్యం చేస్తే.. ఖాతాదారుడికి నష్టపరిహారం కింద రోజుకు రూ.100 చెల్లించాలని ఆర్బీఐ తేల్చి చెప్పింది.

ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాల దగ్గర కార్డుతో చెల్లింపులు, ఆన్‌లైన్‌లో నగదు బదిలీ సందర్భాల్లో నగదు లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం ఖాతాదారులు ఇబ్బందుల పాలవుతున్నారు.

ఖాతాలో నగదు డెబిట్‌ అయినా ఏటీఎం నుంచి రాకపోవడం, ఆన్‌లైలో బదిలీ చేసినప్పుడు మన ఖాతాలో డబ్బు కట్‌ అయి అవతలి వ్యక్తికి జమ కాక పోవడం వంటి సమస్యలు ఇటీవలి ఎక్కువయ్యాయి.

ఈ సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటి పరిష్కారానికి ఆర్బీఐ కచ్చితమైన మార్గదర్శకాలు జారీచేసింది. 

ఏటీఎం, కార్డ్‌ స్వైప్‌, కార్డు ద్వారా నగదు బదిలీ, ఐఎంపీఎస్‌, యూపీఐ, ఆధార్‌, నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌, వాలెట్స్‌ ద్వారా చెల్లింపులు జరిపితే  మన ఖాతా నుంచి డబ్బు కట్‌ అయి అవతలి వ్యక్తి, సంస్థకు చేరకపోతే నిర్దిష్ట గడువులోగా మళ్లీ నగదు మన ఖాతాకు చేరాలి.

గడువు దాటితే.. వినియోగదారునికి రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.ఏ లావాదేవీ అయినా ఫెయిలయినప్పుడు తొలి ఐదు రోజుల్లోపు ఆ మొత్తం తిరిగి ఖాతాదారునికి చేరాల్సిందేనని తేల్చిచెప్పింది.

కమ్యూనికేషన్‌ ఫెయిల్యూర్‌, నగదు లభ్యత లేకపోవడం, టైం అవుట్‌ సెషన్స్‌ లాంటి వైఫల్యాలను వినియోగదారులపై రుద్దకుండా ఆ బాధ్యతను బ్యాంకులే మోయాలని పేర్కొంది. దేశీయంగా జరిగే లావాదేవీలకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. 

ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గరిష్ఠ గడువు తర్వాత కూడా సమస్య తీరకపోతే, వినియోగదారులు రిజర్వ్‌బ్యాంక్‌ ఆధ్వర్యంలోని బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మెన్‌కి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది.

ఖాతాదారుడి ఖాతా నుంచి డబ్బు కట్‌ అయినా ఏటీఎం నుంచి నగదు రాకపోతే లావాదేవీ జరిపిన నాటి నుంచి 5 రోజుల్లోపు ఆ నగదు ఖాతాదారుడి ఖాతాలోకి చేరాలి. లేకపోతే ఆరో రోజు నుంచి రోజుకు రూ.100 చొప్పున ఖాతాదారునికి నష్టపరిహారం కింద బ్యాంకు జమ చేయాలి. 

కార్డ్‌ నుంచి నగదు డెబిట్‌ అయి అటువైపు లబ్ధిదారుని ఖాతాలో జమకాకపోతే ఆ నగదు ఒక రోజులోపు వాపస్‌రావాలి. లేకపోతే ఆ మరు నాటి నుంచి రోజుకు రూ.100 జరిమానా కట్టాలి.

కార్డు స్వైప్‌ చేసినప్పుడు డబ్బు డెబిట్‌ అయి మర్చెంట్‌ లొకేషన్‌ నుంచి కన్ఫర్మేషన్‌ రాకపోతే (ఛార్జిస్లిప్‌ జనరేట్‌ కాకపోతే) అయిదురోజుల్లోపు ఆ డబ్బు ఖాతాదారునికి ఆటోమేటిక్‌గా జమ కావాలి లేకపోతే ఆరో రోజు నుంచి ఖాతాదారుకు రోజుకు రూ.100 జరిమానా చెల్లించాలి.

ఈ- కామర్స్‌ ద్వారా చేసిన లావాదేవీలకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. డబ్బు డెబిట్‌ అయి అటువైపు వ్యక్తి ఖాతాలో జమకాకపోతే ఆ డబ్బు ఒకరోజులోపు ఆటోమేటిక్‌గా వాపస్‌ రావాలి లేదంటే మరుసటిరోజు నుంచి రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులకూ అదే వర్తిస్తుంది. ఖాతా నుంచి నగదు డెబిట్‌ అయి మర్చెంట్‌ లొకేషన్‌ నుంచి ధ్రువీకరణ రాకపోతే అయిదురోజుల్లోపు నగదు ఆటోమేటిక్‌గా వాపసురావాలి. లేదంటే ఆరో రోజు నుంచి రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. 

ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయి మర్చెంట్‌ లొకేషన్‌ నుంచి కన్ఫర్మేషన్‌ రాకపోతే 5 రోజుల్లోపు ‘క్రెడిట్‌ అడ్జెస్ట్‌మెంట్‌’ చేయాలి. లేదంటే అయిదురోజుల తర్వాత రోజుకు రూ.100 చెల్లించాలి. ఖాతా నుంచి డెబిట్‌ అయిన సొమ్ము అవతలి వైపున్న లబ్ధిదారు ఖాతాలోకి జమకాకపోయినా ఇదే వర్తిస్తుంది. 

ఆధార్‌ చెల్లింపులు జరిపినప్పుడు లబ్ధిదారుని ఖాతాలో డబ్బు జమకావడం ఆలస్యమైతే బెనిఫిషియరీ బ్యాంకు ఒక రోజులోపు ఆ మొత్తాన్ని వాపస్‌ చేయాలి. లేదంటే ఒకరోజు తర్వాతి నుంచి రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios