Asianet News TeluguAsianet News Telugu

కుర్రాళ్లకు షేర్డ్ మొబిలిటీపైనే మోజు.. సొంత కారు వేస్ట్: డెల్లాయిట్

తరాలు మారినా కొద్దీ అభిప్రాయాలు మారిపోతాయి. ఇప్పుడు టెక్నాలజీ యుగం. పరిస్థితులకు అనుగుణంగా యువతరం ఆలోచనలు మారిపోతున్నాయి. షేర్డ్ మొబిలిటీ అందుబాటులో ఉండగా, సొంత కార్లు, వాహనాలెందుకని యువత ప్రశ్నిస్తోంది. 51 శాతం మంది ఇండియన్ యూత్‌ది ఇదే ధోరణి అని డెల్లాయిట్ రూపొందించిన అధ్యయనం పేర్కొంటున్నది. దేశీయంగా వాహనాల విక్రయాలు తగ్గిపోవడానికి ఇదొక కారణం కూడా.

What millennials think about owning a vehicle
Author
New Delhi, First Published Jun 26, 2019, 10:43 AM IST

న్యూఢిల్లీ : రోజువారీ ప్రయాణం ఏ వాహనాల్లో చేయాలి? అనే విషయంలోనూ మిల్లీనియల్స్‌‌లో అభిప్రాయం మారిపోతోంది. పాత తరానికి, ఈనాటి మిల్లీనియల్స్‌కు అన్ని విషయాల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 

గతంలో పాత తరం జాబ్‌లో చేరి నాలుగు డబ్బులు సంపాదించడం ప్రారంభించాక, ముందు ఇల్లు, ఆ తర్వాత సొంతంగా బైకు గానీ, కారు గానీ కొనేందుకు ఇష్టపడేవారు. యువతరం అంటే 40 ఏళ్ల లోపు కుర్రాళ్ల ఆలోచనలే డిఫరెంట్‌గా ఉన్నాయని తేలింది. తమ ప్రయాణానికి డిజిటల్ సొల్యూషన్స్ ‘సేఫ్’ అని భావిస్తున్నారు. 

ప్రస్తుతం మిల్లీనియల్స్‌ మాత్రం సొంత కారు ఎందుకు శుద్ద దండగ? ఎవరో ఒకరి వాహనం షేర్‌ చేసుకుని, ఆ ఖర్చులు పంచుకుంటే పోలా? అని భావిస్తున్నారు. భారత మిల్లీనియల్స్‌లోనూ ఈ దోరణి కనిపిస్తోందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ తెలిపింది. 

ఇందుకోసం ఈ సంస్థ భారత్‌, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌, కొన్ని ఆగ్నేయాసియా దేశాల్లోని 10,000 మంది మిల్లీనియల్స్‌ అభిప్రాయాలతో ఒక అధ్యయన నివేదిక రూపొందించింది. సొంత వాహనం అవసరమా? అని ఈ సర్వేలో పాల్గొన్న భారత మిల్లీనియల్స్‌లో 51 శాతం మంది, సొంత వాహనం అవసరమా? అని ప్రశ్నించారు. 

1965-1980 మధ్య జన్మించిన వారిలోనూ 44 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 1946-1964 మధ్య పుట్టిన వారు మాత్రం 34 శాతం మంది మాత్రమే, సొంత వాహనం అవసరమా? అని ప్రశ్నించినట్టు డెలాయిట్‌ 2019 గ్లోబల్‌ ఆటోమోటివ్‌ కన్జుమర్‌ స్టడీ పేర్కొంది. 

ఈ సర్వేలో పాల్గొన్న భారత మిల్లీనియల్స్‌లో 76 శాతం మంది కనెక్ట్‌డ్‌ వెహికల్స్‌పై మొగ్గు చూపారు. ఇలాంటి వాహనాల్లో ప్రయాణించడం భద్రంగా ఉంటుందని 84 శాతం మంది చెప్పడం విశేషం. ఉబెర్‌, ఓలా వంటి కాబ్‌ సర్వీసుల రంగ ప్రవేశం వల్ల కూడా దేశంలో ఇప్పటికే కార్ల అమ్మకాలు తగ్గాయి. 
మారుతున్న మిల్లీనియల్స్‌ ఆలోచనా విధానంతో దేశంలోని కార్ల కంపెనీలు మరిన్ని కష్టాల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. భారతదేశంలో ‘షేర్డ్ మొబిలిటీ’ క్రమంగా ఊపందుకుంటున్నది. ప్రస్తుతం 47 శాతం మంది భారతీయులు మాత్రమే రోజువారీ అవసరాల కోసం వాహనాలను వాడుతున్నారు. వచ్చే మూడేళ్లలో ఇది 50 శాతానికి చేరుతుందని డెల్లాయిట్ నివేదించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios