Asianet News TeluguAsianet News Telugu

ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్: ‘మారుతి’ బుల్లి కార్లన్నీ సీఎన్జీ మోడళ్లలోకే..

పడిపోతున్న కార్ల సేల్స్ పెంచుకునేందుకు మారుతి సుజుకి ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలులోకి తెస్తున్నది. తన బుల్లి కార్లను పూర్తిగా సీఎన్జీ మోడల్ లోకి మార్చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 10 వేల సీఎన్జీ ఔట్ లెట్లు ఏర్పాటు చేయడంతోపాటు క్లీన్ ఎనర్జీగా కేంద్రం గుర్తించిందని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై దిగుమతి సుంకం భారం తగ్గుముఖం పడుతుందని అంచనా వేశారు.

Maruti to expand range of CNG cars amid declining sales
Author
New Delhi, First Published Sep 4, 2019, 11:21 AM IST

న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన సేల్స్ పెంచుకునే దిశగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. మారుతి కార్ల పోర్ట్ ఫోలియోలో డీజిల్ కార్లపై వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఆంక్షలు పెరిగిపోనున్న నేపథ్యంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నది. డీజిల్ వినియోగ కార్లన్నీ చిన్న కార్లే కావడం గమనార్హం. 

కనుక చిన్న కార్లలో సీఎన్జీ మోడల్ కార్లను పెంచాలని తాజాగా లక్ష్యాన్ని మారుతి నిర్దేశించుకున్నది. ఇప్పటికే మారుతి సుజుకి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి డీజిల్ వినియోగ కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ స్పందిస్తూ.. ‘మా చిన్న కార్ల పోర్ట్ ఫోలియోలోని వాహనాలన్నీ సీఎన్జీలోకి మారనున్నాయి. సీఎన్జీని ఇప్పటికే సర్కార్ పర్యావరణ అనుకూల ఇంధనంగా గుర్తించింది. అందుకు అనుగుణంగా సీఎన్జీ వినియోగాన్ని విస్తరించడానికి వీలుగా దేశవ్యాప్తంగా 10 వేల సీఎన్జీ సేల్స్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నది’ అని చెప్పారు. 

కొత్త వాహనాలకు సీఎన్‌జీ ఇంధన సమస్య తీరనుందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ప్రస్తుతం మారుతి సుజుకి కార్ల విక్రయాల్లోనూ భారీగా క్షీణత కనిపిస్తున్నది. ఆగస్టు నెలలో వీటి విక్రయాలు 35.9 శాతానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో తన వాహనాల విక్రయాలను పెంచుకోవాలని మారుతి సుజుకి భావిస్తున్నది. 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కంపెనీకి చెందిన ఆల్టో, ఆల్టో కే 10, వ్యాగన్ ఆర్, సెలిరీయో, డిజైర్ టూర్ ఎస్, ఈకో, సూపర్ క్యారీ మినీ ట్రక్ మోడల్ వాహనాల్లో మాత్రమే సీఎన్జీ వినియోగం జరుగుతున్నది. ప్రస్తుతం మారుతి సుజుకి విక్రయించే వాహనాల్లో ఏడు శాతం వరకు సీఎన్జీ మోడల్ వాహనాలు ఉన్నాయి. దీనిని 90 శాతానికి చేరువ చేయాలని సంస్థ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో మారుతి సుజుకి 31 వేల సీఎన్జీ వెహికల్స్ విక్రయించింది. వీటిల్లో అత్యధికంగా ముంబై, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో విక్రయించింది. వాహనాల సేల్స్ తగ్గుముఖం పట్టడంతో మారుతి సుజుకి వరుసగా ఏడో నెలలోనూ వాహనాల ఉత్పత్తి తగ్గించుకున్నది. 

గత నెలలో ఉత్పత్తిలో 33.99 శాతం కోత విధించింది. ఆగస్టులో 1,11,370 వాహనాలను ఉత్పత్తి చేసిన మారుతి సుజుకి.. సరిగ్గా గతేడాది ఆగస్టులో 1,68,725 వాహనాలను తయారుచేయడం గమనార్హం. 

బుల్లి కార్లకు సీఎన్జీ మోడల్ చాలా మంచి ఆప్షన్ అని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) సీవీ రామన్ తెలిపారు. ఆయిల్ ఆదా చేయడానికి ఇది ఆల్టర్నేటివ్ అని, తమకు విస్త్రుత స్థాయిలో సీఎన్జీ కార్ల వినియోగదారులు ఉన్నారని ఇటీవల చెప్పారు 

మారుతి సుజుకి ఐదు లక్షలకు పైగా సీఎన్జీ కార్లను విక్రయించింది. దేశవ్యాప్తంగా 30 లక్షల సీఎన్జీ వినియోగ కార్లు తిరుగుతుండగా, అందులో మారుతి సుజుకి వాటా సుమారు 17 శాతం అని అంచనా. సీఎన్జీ మోడల్ లోకి కార్లు మారడం వల్ల ముడి చమురు దిగుమతిపై సుమారు రూ.2 లక్షల కోట్ల మేరకు ఆదా అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది 40 శాతం వాహనాలను సీఎన్జీలోకి బదిలీ చేసిన మారుతి సుజుకి ఈ ఏడాది 50 శాతానికి పెంచివేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios