న్యూఢిల్లీ: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ దాదాపు తొమ్మిది నెలల ముందే బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్‌ ఆర్‌, స్విఫ్ట్ మోడల్ కార్లను విపణిలోకి విడుదల చేసింది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన వాగన్ ఆర్ కారు రూ.5.10 లక్షల- రూ.5.91 లక్షల మధ్య యూజర్లకు లభించనున్నది. 

దేశవ్యాప్తంగా తాజా బీఎస్ -6 మోడల్ వాగన్ ఆర్ కారు రూ.5.15 లక్షల నుంచి రూ.5.96 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పాతమోడల్‌తో పోలిస్తే ఈ కొత్త వెర్షన్ కారు ధర రూ.16 వేలు పెరిగింది. 

వీటితోపాటు లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన వ్యాగన్‌ఆర్ మోడల్ ధరను ఢిల్లీలో రూ.4.34 లక్షల నుంచి రూ.5.33 లక్షల మధ్యలో, దేశవ్యాప్తంగా రూ.4.39 లక్షల నుంచి రూ.5.39 లక్షల మధ్యలో నిర్ణయించింది. 

కంపెనీకి చెందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌ను కూడా ఏఐఎస్-145 భద్రత ప్రమాణాలకనుగుణంగా రూపొందించింది. కాలుష్యాన్ని నియంత్రించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఆటోమొబైల్ సంస్థలు బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేస్తున్నాయి. 

దీంతో పాతవాటితో పోలిస్తే కొత్త వాహనాల ధరలు స్పల్పంగా పెరుగుతున్నాయి.కొత్తగా పరిచయం చేస్తున్న  సీఎన్‌జీ వేరియంట్లలో ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్‌ ఆల్టో మోడల్ కారు ధర రూ.4.10-4.14 లక్షలుగా  నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది.