న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘హ్యుండాయ్’ వచ్చే దీపావళి పండుగకల్లా మార్కెట్‌లోకి కొత్త మోడల్ కారును విడుదల చేయనున్నది. తొలుత డిజైన్ విడుదల చేసిన హ్యుండాయ్.. కంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. తద్వారా శాంత్రో మానికర్ స్థానాన్ని పొందాలని ఉవ్విళ్లూరుతోంది. తదనుగుణంగా హ్యుండాయ్ శాంత్రో (ఏహెచ్2) కంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు మార్కెట్‌లోకి విడుదల చేసే తేదీ ఖరారైంది. 

వచ్చే నెల తొమ్మిదో తేదీన హ్యుండాయ్ శాంత్రో (ఏహెచ్2) మోడల్ కారు పేరు ఖరారవుతుంది. ఈ కారుకు పేరు పెట్టేందుకు నిర్వహిస్తున్న కంటెస్ట్ గడువు ఈ నెల 25తో ముగుస్తుంది. అధికారికంగా భారత మార్కెట్ లోకి వచ్చేనెల 23న హ్యుండాయ్ శాంత్రో (ఏహెచ్2) మోడల్ కారు ప్రవేశించనున్నది. కాకపోతే హ్యుండాయ్ శాంత్రో హ్యాచ్ బ్యాక్ కారును సంస్థ వచ్చేనెల 4న మీడియా ముందు ఆవిష్కరించనున్నది. 

ఫ్యామిలీ మొత్తం హాయిగా ప్రయాణించేందుకు వీలుగా తొలుత డిజైన్ ఖరారు చేసింది హ్యుండాయ్. ఈ కారు డిజైన్ చూడటానికి ‘టాల్ బాయ్’ మాదిరిగా ఉంటుంది. కారు రూమీ క్యాబిన్‌ను తలపిస్తుంది. నూతన మోడల్ హ్యుండాయ్ కారు హ్యుండాయ్ ఏవోన్, గ్రాండ్ ఐ10 మధ్య నుంచి మారుతి సుజుకికి చెందిన సెలిరియో, వాగన్ ఆర్, టాటా టియాగో మోడల్ కార్లతో పోటీ పడనున్నది. 

ఈ కారులో 1.1 నుంచి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంటుంది. తొలుత 1997లో మార్కెట్ లో అడుగు పెట్టిన హ్యుండాయ్ శాంత్రో హ్యాచ్ బ్యాక్ కారు గతంలో మారుతి 800, టాటా ఇండికా కార్లతో ఢీ కొట్టింది. ఇప్పటికే హ్యుండాయ్ ఐ10, హ్యుండాన్ ఐయోన్ సేల్స్ తోపాటు కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి. దీంతో మార్కెట్ లో నుంచి ఈ కారును బయటకు తీసుకొచ్చింది. 

దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ కారు 2020 నాటికి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్‌లో ఎనిమిది నూతన కార్లు మార్కెట్‌లోకి విడుదల చేయనున్నది. శాంత్రో మోడల్ కారు హ్యుండాయ్ సంస్థ భారతదేశంలో అడుగు పెట్టేందుకు దారి చూపింది.