సాంకేతికంగా సమస్యలు ఎదుర్కొంటున్న మోటార్ బైక్స్ 2,38,300 యూనిట్లు ప్రపంచ వ్యాప్తంగా రీ కాల్ చేస్తున్నట్లు హార్లీ- డేవిడ్సన్ ప్రకటించింది. గత ఐదేళ్లలో క్లచ్ సమస్యతో హార్లీ - డేవిడ్సన్ మోటార్ బైక్ లు వినియోగదారులకు సమస్యలు కల్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఉపసంహరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నదని హార్లీ - డేవిడ్సన్ పేర్కొంది. ఇందుకు 35 మిలియన్ల డాలర్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. 

థర్డ్ పార్టీ సంస్థ సరఫరా చేసిన క్లచ్ వాడటం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు హార్లీ- డేవిడ్సన్ గుర్తించింది. స్వచ్ఛంద భద్రత ద్రుష్ట్యా 2017, 2018 సంవత్సరాల్లో తయారుచేసిన మోటార్ బైక్‌లు టూరింగ్, ట్రైక్, సీవోఓ టూరింగ్, 2017 సాఫ్టైల్ మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. సదరు మోటార్ బైక్ ల రీకాల్ నిర్ణయాన్ని హార్లీ- డేవిడ్సన్ గతవారం జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో ప్రకటించింది. అంతర్జాతీయంగా మోటార్ బైక్‌ల విక్రయాలు పడిపోవడంతో రీకాల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

తాజాగా నూతన విద్యుత్ ఆధారిత మోటార్ బైక్‌లతోపాటు పలు రకాల మోడల్ మోటార్ సైకిళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు హార్లీ- డేవిడ్సన్ తెలిపింది. 2022 నాటికి ఆసియాతోపాటు అన్ని ఎమర్జింగ్ మార్కెట్లలో నూతన చిన్న డిస్ ప్లేస్మెంట్ మోడల్ బైక్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. 

హార్లీ-డేవిడ్సన్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జాన్ ఓలిన్ మాట్లాడుతూ వాహనాల రీకాల్ విషయమై తమ డీలర్లతో కలిసి సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. తమ బైక్ వినియోగదారుల భద్రతే ముఖ్యమని సెలవిచ్చారు. కొన్నేళ్లుగా హార్లీ- డేవిడ్సన్ మోటార్ బైక్ లను రీకాల్ చేయడం సర్వ సాధారణంగా మారింది. అదీ కూడా క్లచ్ సమస్య వల్లే. 2016లో 14 విభిన్న మోడళ్ల బైక్ లు 27,232 రీకాల్ చేసింది. అంతకుముందు 2013లో 29,046 బైక్ లు, 2015లో 45,901 బైక్ లు రీకాల్ చేసింది. యూరోపియన్ యూనియన్ తోపాటు తమ మార్కెట్ ను విస్తరించాలని హార్లీ - డేవిడ్సన్ భావిస్తున్నది. అయితే భారతదేశంలో ఎన్ని మోటార్ బైక్ లను విక్రయించారన్న విషయం ఇంకా తేలలేదు. టూరింగ్, సీవీవో టూరింగ్ మోడల్ బైక్‌ల విక్రయాలు చాలా తక్కువ. సాఫ్టైల్ మోడల్ బైక్ లు ఎక్కువగా అమ్ముడు పోయాయి.