ముంబై: జార్జియా ఆటోమొబైల్ సంస్థ లెక్సస్ ఎల్సీ భారత్‌ విపణిలోకి 2020లో అడుగుపెట్టనున్నట్లు తెలిపింది. ఎల్‌సీ500 మోడల్ కారును  భారత్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. 4.7 సెకన్ల వేగంతో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కారును వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో మార్కెట్లోకి తీసుకొస్తామని పేర్కొంది. గరిష్ఠంగా దీని వేగం 250 కిలోమీటర్ల వరకు పరిమితం చేశారు. 

ఈ కాన్సెప్ట్‌ కారును తొలిసారి 2012లో డెట్రాయిట్‌ మోటార్‌ షోలో ఎల్‌ఎఫ్‌-ఎల్‌సీ పేరుతో ప్రదర్శించారు. దీనిని 2017లో ఎల్‌సీ500ను విడుదల చేశారు. మొత్తం 68 దేశాల్లో దీనిని విక్రయిస్తున్నారు. భారత్‌ 69వ దేశంగా నిలవనుంది. ఇప్పటికే 12,000 ఎల్‌సీ కార్లను విక్రయించారు. 

భారత్‌లో మాత్రం ఎల్‌సీ హైబ్రీడ్‌ వెర్షన్‌ కార్లను విక్రయించనున్నారు. వీ8 ఇంజిన్‌ అమర్చిన కారును మాత్రం తేవడంలేదు. ఈ కారులో 295 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేసే 3.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. 

దీనిలో లిథియం అయాన్‌ బ్యాటరీలు అమర్చిన రెండు మోటార్లను అమర్చారు. ఒక్కో బ్యాటరీ 177 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ రెండు కలిపి 354 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తాయి. ఈ కారు ధర రూ.1.5కోట్లు ఉండవచ్చని అంచనా. కానీ కారు ధరపై లెక్సెస్‌ ఏమీ సమాచారం ఇవ్వలేదు.  

లెక్సస్ ఎల్సీ 500 హెచ్ మోడల్ కారు భవిష్యత్ డిజైన్లలో ఆ సంస్థ ఐకానికస్ వీ-01 పవర్డ్ ఎల్ఎఫ్ఏను పోలి ఉంటుంది. హైబ్రీడ్ గ్రాండ్ టూరర్ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహించే ‘2020 ఆటో ఎక్స్ పో’లో ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. ఈ కారు ఎల్సీ 500, ఎల్సీ 500 హెచ్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. 

10.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలెక్సా ఇంటెగ్రేషన్, వై-ఫై, డైనమిక్ వాయిస్ కంట్రోల్, 20 అంగుళాల వీల్స్, 12- స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆప్షనల్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ (ఎల్ఎస్డీ), ప్రీకొల్లిషియన్ సిస్టమ్ విత్ పెడిస్ట్రియన్ డిటెక్షన్, ఆల్-స్పీడ్ డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, ఇంటెలిజెన్స్ హై బీం (ఐహెచ్బీ) తదితర ఫీచర్లు అమర్చారు. 

అంతర్జాతీయంగా ఎల్సీ 500 కారు ఇతర ఆస్టోన్ మార్టిన్ డీబీ 11, బెంట్లీ కాంటినెంటల్ జీటీ కార్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. భారతదేశంలో త్వరలో ఆవిష్కరించనున్న బీఎండబ్ల్యూ 8 సిరీస్ కార్లతో ఎల్సీ 500 మోడల్ కార్లు గట్టి పోటీనిస్తాయని అంచనా వేస్తున్నారు.