హైదరాబాద్‌: ఇటాలియన్ పెడిగ్రీ సూపర్‌బైక్‌ బ్రాండ్‌ బెనెల్లి.. మన దేశీయ మార్కెట్లోకి మూడు మోటార్‌ సైకిళ్లను సరికొత్తగా విడుదల చేసింది. బెనెల్లి టీఎన్‌టీ 300, బెనెల్లి 302ఆర్‌, బెనెల్లి టీఎన్‌టీ 600ఐ ఇందులో ఉన్నాయి. హైదరాబాద్నగర శివారుల్లో కొలువు దీరిన అసెంబ్లింగ్ యూనిట్‌ నుంచి ఈ మోటార్ సైకిళ్లు రోడ్లపైకి రానున్నాయి. షోరూమ్‌లో ఈ బైక్‌ల ధర రూ.3.5 లక్షల నుంచి రూ.6.2 లక్షల వరకూ పలుకుతోంది. వీటిని కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ నెల రెండో వారం నుంచి డెలివరీ చేయగలమని బెనెల్లి ఇండియా ఎండీ వికాస్‌ జబక్‌ వెల్లడించారు. ఈ వాహనాలపై అయిదేళ్ల వారెంటీ ఇస్తున్నట్లు తెలిపారు. 


ఇంత అధిక వారెంటీ ఇస్తున్న సూపర్‌బైక్‌ బ్యాండ్‌ బెనెల్లి ఒక్కటేనని బెనెల్లి ఇండియా ఎండీ వికాస్‌ జబక్‌ పేర్కొన్నారు. ఈ మోటార్‌సైకిళ్లకు మనదేశంలో మహావీర్‌ గ్రూపునకు చెందిన ఆదీశ్వర్‌ ఆటోరైడ్‌ ఇండియా ప్రత్యేక పంపిణీదారుగా ఉంది. దీనికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 25 డీలర్‌షిప్‌లను ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు బెనెల్లి ఇండియా సీఈఓ కృష్ణ మాల్గే  తెలిపారు. ఇంతకుముందు మహారాష్ట్రలోని పుణెలో ఈ సంస్థ అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. మహావీర్ గ్రూప్ సంస్థ ఏటా 7,000 మోటారు బైక్‌లను నిర్మించగల సామర్థ్యం కలిగి ఉంది. 

2020 నాటికి మరో 12 మోడల్ మోటార్ బైక్ లను ఆవిష్కరిస్తామని బెనెల్లి ఇండియా ఎండీ వికాస్ జబక్ తెలిపారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అత్యధికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీఆర్ కే 502 (టూరర్), టీఆర్‌కే 502 ఎక్స్ (అడ్వెంచర్) మోడల్ బైక్ లను ఆవిష్కరిస్తామన్నారు. ఏటా 20 శాతం పురోగతి సాధించాలని లక్ష్యంగా తమ సంస్థ ముందుకు సాగుతోందన్నారు. జాయింట్ వెంచర్ ద్వారా భారతదేశంలో ఉత్పత్తులు తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన స్థల సేకరణపైన ద్రుష్టి సారించామన్నారు. మిడ్ కెపాసిటీ అడ్వెంచర్ సెగ్మెంట్‌లో తమ మార్కెట్ విస్తరించడమే లక్ష్యమని చెప్పారు. 

ప్రత్యేకించి 135 సీసీ సామర్థ్యం గల మోటార్ బైక్‌లను మార్కెట్లోకి ఆవిష్కరించడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని బెనెల్లి ఎండీ వికాస్ జబక్ వివరించారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్ పైనే కేంద్రీకరించామని తెలిపారు. ఏటా లక్ష యూనిట్లు విక్రయ సామర్థ్యం సంపాదించడమే లక్ష్యమని చెప్పారు. ఇందులోదేశీయ విక్రయాలు, విదేశాలకు ఎగుమతులకు కలగలిసి ఉన్నాయని వికాస్ జబక్ పేర్కొన్నారు.