సంకల్ప సిద్ధి వ్యవహారంలో ‘సెక్స్ స్కామ్’ కూడా.. బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు
విజయవాడలో వెలుగు చూసిన సంకల్ప్ సిద్ధి స్కీమ్‌లో సెక్స్ స్కాం కూడా వుందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు. కాలేజీ విద్యార్ధినులను వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని .. దీని వెనుకా వైసీపీ నేతల హస్తం వుందని ఉమా ఆరోపించారు.

విజయవాడలో వెలుగు చూసిన సంకల్ప్ సిద్ధి స్కాంలో అధికార వైసీపీ నేతల ప్రమేయంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. సంకల్ప సిద్ధి స్కాంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీల హస్తం వుందని ఆరోపించారు. ఈ స్కాం చాలా పెద్దదని.. ఈ కుంభకోణంలో ఎమ్మెల్యే వంశీ, ఆయన అనుచరుడి పాత్రను బయటపెట్టాలని బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో సెక్స్ స్కాం కూడా వుందని.. కాలేజీ విద్యార్ధినులను వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీని వెనుకా వైసీపీ నేతల హస్తం వుందని ఉమా ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలుస్తామంటున్న జగన్.. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని బొండా ఉమా సవాల్ విసిరారు. బీసీ, దళిత వర్గాలను సీఎం నమ్మించి మోసం చేశారని .. నవరత్నాల పేరుతో రాష్ట్రానికి నవ బొక్కలు పెట్టారని విమర్శించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా 2 కోట్ల మంది ప్రజలను రాబోయే రోజుల్లో తెలుగుదేశ పార్టీ కలుస్తుందని బొండా ఉమ తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబును వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బొండా ఉమా ఆరోపించారు.
ALso Read:సంకల్ప సిద్ధి కేసు : ఐదుగురు ప్రధాన నిందితుల అరెస్టు..
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘సంకల్ప సిద్ధి’ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలను, పద్నాలుగు ప్రాంతాల్లోని ఆస్తులను, విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టికె రాణా సోమవారం వెల్లడించారు. సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను గుత్తా వేణుగోపాల్, అతని సోదరుడు గుత్తా కిషోర్ ఏర్పాటు చేశారు. ట్రేడింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పేరుతో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి అనుమతి తీసుకున్నారు. నిరుడు అక్టోబర్ లో ఆన్లైన్ వెబ్ పోర్టల్, యాప్ ను రూపొందించారు. ఈ కంపెనీలో కొందరు డైరెక్టర్లను చేర్చుకుని చట్టవిరుద్ధంగా మనీ సర్క్యులేషన్ స్కీమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కు తెరతీశారు.
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటర్లు నియమించుకుని 5 ఆకర్షణీయమైన పథకాలతో ప్రజల నుంచి రూ.170 కోట్ల వరకు వసూలు చేశారు. ఈ మొత్తంలో కొంత నగదును డిపాజిట్ దారులకు తిరిగి చెల్లించారు. గత 15 రోజులుగా విత్ డ్రాలు నిలిచిపోవడంతో ఐదుగురు ఫిర్యాదు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో విచారణ నిర్వహించాం. ఆర్బీఐ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మోసానికి పాల్పడ్డారని గుర్తించామని’ సీపీ వెల్లడించారు.