Asianet News TeluguAsianet News Telugu

సంకల్ప సిద్ధి కేసు : ఐదుగురు ప్రధాన నిందితుల అరెస్టు..

సంకల్ప సిద్ది మార్ట్ పేరుతో జనాలకు వందలకోట్లు టోకరా వేసిన కేసులో ఐదుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుతో ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. 

five main accused Arrest in Sankalpa Siddhi case, vijayawada
Author
First Published Nov 29, 2022, 12:16 PM IST

విజయవాడ : సంకల్ప సిద్ధి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. దీంతోపాటు, సంకల్ప సిద్ధి సంస్థకు చెందిన విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేశారు. వీరికి సంబంధించి పద్నాలుగు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అకౌంట్లను క్లోజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టికె రాణా ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం తెలిపారు. 

గుత్తా వేణుగోపాల్, అతని సోదరుడు గుత్తా కిషోర్ లు కలిసి సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను పెట్టారు. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి దీనికి ట్రేడింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే పేరుతో పర్మిషన్ తీసుకున్నారు. నిరుడు అక్టోబర్ లో ఈ సంస్థకు సంబంధించి ఆన్లైన్ వెబ్ పోర్టల్, ఒక యాప్ ను తయారు చేయించారు. ఆ తరువాత ఈ కంపెనీలో కొందరు డైరెక్టర్లను చేర్చుకున్నారు. అలా మనీ సర్క్యులేషన్ స్కీమ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ లనే చట్టవిరుద్ధమైన పనులకు పూనుకున్నారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ విస్తరించాలనుకున్నారు. దీనికోసం ప్రతీ జిల్లాకు తమ తరఫునుంచి ఒక కోఆర్డినేటర్ ను నియమించుకున్నారు. వీరి ద్వారా ఐదు ఆకర్షణీయమైన పథకాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లారు. అలా వారి నుంచి దాదాపు రూ.170 కోట్ల వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో తమమీద అనుమానం రాకుండా ఉండాలని కొంత నగదును తిరిగి డిపాజిట్ దారులకు ఇచ్చారు. 

అయితే, గత 15 రోజులుగా విత్ డ్రాలు నిలిచిపోయాయి. దీంతో వీరిమీద, ఈ కంపెనీ కార్యక్రమాల మీద ఐదుగురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టాం. ఐదు ప్రత్యేక బృందాలను దీనికోసం ఏర్పాటు చేశాం. మా దర్యాప్తులో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా మోసాలు జరిగాయని తేలింది ’ అని సీపీ వెల్లడించారు.

వస్తువులు కొంటే.. డబ్బు రిటర్న్ : బెజవాడలో ‘‘సంకల్ప్ సిద్ధి మార్ట్’’ పేరిట రూ.1500 కోట్లు టోకరా

ఈ కేసులో ప్రాథమిక విచారణ ముగిసింది. ఈ విచారణ మేరకు  కంపెనీ సీఎండీలు విజయవాడకు చెందిన గుత్తా వేణుగోపాలకృష్ణ, కర్ణాటకలోని బళ్లారికి చెందిన గుత్తా కిశోర్ లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కంపెనీ  డైరెక్టర్లైన గంజాల లక్ష్మి, విజయవాడకు చెందిన మావూరి వెంకట నాగలక్ష్మి, గుంటూరులోని సయ్యద్ జకీర్ హుస్సేన్ లను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 

ఈ కేసులో అరెస్టు చేసిన వీరిమీద విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఐదు కేసుల్లో వీరి మీద కేసులు పెట్టాం. అరెస్ట్ సమయంలో వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్ లు, 2 కార్లు, పదిన్నర కిలోల వెండి, 728 గ్రాముల బంగారం, రూ.51 లక్షల నగదు, కంప్యూటర్లు 4, లాప్ టాప్ ఒకటి, మరికొన్నిరికార్డులను తాము స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.  

ఇంతకీ వీరు ప్రజలనుంచి ఎంత మేరకు వసూళ్లు చేశారు? ఎంతమందిని మోసం చేశారు? అనే విషయాలు పూర్తిస్థాయి దర్యాప్తులో తేలతాయని వారు తెలిపారు. ఇక సీజ్ చేసిన సంకల్ప సిధ్ది సంస్థకు చెందిన బ్యాంకు అకౌంట్లు, వాటిలోని నగదు వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖకు, కోర్టుకు తెలుపుతామని అన్నారు. ఆ తరువాత కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు వీరివల్ల మోసపోయిన డిపాజిట్ దారులకు వారికి రావాల్సిన నగదు చెల్లిస్తాం. 

అంతేకాదు, ఈ ఫ్రాడ్ తో గానీ, సంకల్ప సిద్ధి సంస్థ నిర్వాహకులతో గాని.. ఏపీ రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రజాప్రతినిధికీ.. ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గుత్తా వేణు గోపాల కృష్ణ ఐదో తరగతి వరకే చదువుకున్నాడని.. ఆ తరువాత చదువు మానేశాడని తెలిపారు. ఆ తరువాత 1998లో క్వాంటం మనీ సర్క్యులేషన్ స్కీం లో చేరాడు. అక్కడినుంచి మొదలుపెట్టి అనతి కాలంలోనే మరికొన్ని సంస్థలలో పనిచేశాడు. అలా మల్టీ లెవెల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ లపై అవగాహన పెంచుకున్నాడు. ఆ తరువాత హైదరాబాదులో తానే స్వయంగా, సొంతంగా ప్లాంట్ ఎన్ రిచ్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ను ఏర్పాటు చేశాడు. ఆ తరువాతి కాలంలో విజయవాడ వచ్చాడు. అక్కడే సంకల్పసిద్ధి ఈ-కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నెలకొల్పాడు’ అని సీపీ రాణా మీడియాకు వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios