Asianet News TeluguAsianet News Telugu

రంజుగా కర్నూలు రాజకీయం: వర్గ పోరు తప్పదా..?

అటు కేఈ అనుచరులు మాత్రం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బద్దశత్రువు అయిన కోట్లను ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తారంటూ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులైన కోట్ల కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు కేఈ కుటుంబాన్ని అనుచరులను ఇబ్బందులు పాల్జేసిందని ఆరోపిస్తున్నారు. 

new changes in kurnool politics
Author
Amaravathi, First Published Jan 29, 2019, 12:25 AM IST

కర్నూలు: రాజకీయ చైతన్యవంతమైన జిల్లాగా పేరున్న కర్నూలు జిల్లాలో రాజకీయం రంజుగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎన్నికల పోరుకు సై అంటే సై అంటున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమరానికి కాళ్లు దువ్వితే ఓకే. 

కానీ ఒకే పార్టీలో ఆధిపత్య పోరు రాజ్యమేలితే ఇంకేముంది ఆ ఆటలో మాంచి మజా ఉంటుంది. ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరంటారు. మరి అధికార తెలుగుదేశం పార్టీలో ఇకపై చెలరేగబోయే ఇంటిపోరును ఆపగలరా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇంతకీ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందనుకుంటున్నారా...ఇంకెందుకు కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతుంది కదా అందుకే ఈ ఆధిపత్య పోరు, వర్గపోరు తెరపైకి వచ్చాయి.  

తెలుగుదేశం పార్టీలో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం చేరిక ఇక లాంఛనమే కానుంది. మంచి రోజు చూసుకుని సైకిలెక్కేందుకు కోట్ల కుటుంబం రెడీ అయ్యింది. ఇదే అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి స్పష్టం చేసింది. 

తెలుగుదేశం పార్టీలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం చేరికతో కర్నూలు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. కోట్ల కుటుంబ రాకను టీడీపీలోని ఒక వర్గం స్వాగతిస్తుంటే మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఇక తటస్థులు మౌనం దాల్చారు. 

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరికపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్ల రాకను స్వాగతించారు. కోట్ల కుటుంబం టీడీపీలో చేరడం వల్ల తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రభావం పార్టీపై చూపుతోందని స్పష్టం చేశారు. 

ఇకపోతే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం మాత్రం నోరు మెదపడం లేదు. గత కొంతకాలంగా కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరబోతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

దశాబ్ధాల కాలంగా కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబానికి రాజకీయ పోరు ఉంది. జిల్లాలో ఆధిపత్య పోరుతోపాటు పోలీసుల కేసుల వరకు వీరి రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీలో చేరే అంశంపై ఆచితూచి అడుగులు వేస్తోంది. 

అటు కేఈ అనుచరులు మాత్రం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బద్దశత్రువు అయిన కోట్లను ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తారంటూ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులైన కోట్ల కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు కేఈ కుటుంబాన్ని అనుచరులను ఇబ్బందులు పాల్జేసిందని ఆరోపిస్తున్నారు. 

అదే సందర్భంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి  పెద్ద దిక్కుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి నుంచి అధికారం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోటకు మారిపోతుందని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం కర్నూలు  జిల్లాను కనుసైగలతో శాసించింది. 

కర్నూలు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, పాణ్యం, ఆలూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ప్రత్యేక వర్గం ఉంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్వగ్రామం కోడుమూరు నియోజకవర్గంలోని లద్దగిరి. ఈ నియోజకవర్గం నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గీయులే అత్యధికసార్లు పోటీ చేసి గెలుపొందారు. 

సూర్యప్రకాశ్ రెడ్డి భార్య కోట్ల సుజాతమ్మ డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో గెలుపొందారు. అయితే ఆమె అదే నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చెయ్యాలని భావిస్తున్నారు.  

డోన్ అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ కూడా ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం ఇంచార్జ్ గా కేఈ ప్రతాప్ వ్యవహరిస్తున్నారు. ఇదే టికెట్ పై ఇరు కుటుంబాలు పోటీపడటంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 
 
రాజకీయ ప్రాబల్యాలున్న ఇరుకుటుంబాలు ఒకే సీటును ఆశించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే సమాచారం తనకు లేదని ప్రకటించారు. తనకు తెలుసునని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. 

కేఈ కృష్ణమూర్తి వ్యవహార శైలి చూస్తుంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఇరువురు తెలుగుదేశం పార్టీలో ఇముడుతారా అన్న సందేహం వ్యక్తమవుతుంది.  

డోన్ అసెంబ్లీ స్థానంపై కానీ, పత్తికొండ అసెంబ్లీ స్థానాలపై ఏదైనా చర్చ జరిగితే ఘాటుగా స్పందించాలని కేఈ కృష్ణమూర్తి కుటుంబం నిర్ణయం తీసుకుంది. డోన్ సీటును కేఈ సోదరుడు ప్రభాకర్ ఆశిస్తుండగా పత్తికొండ నియోజకవర్గం నుంచి కేఈ తన కుమారుడిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. 

అయితే కోట్ల సుజాతమ్మ డోన్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఆమె డోన్ టికెట్ ఇస్తారా లేక ఆలూరు ప్రత్యామ్నాం చూపుతారా అన్నది తేలాల్సి ఉంది. లేనిపక్షంలో ప్రతాప్ న డోన్ అసెంబ్లీ నుంచి తప్పించి ప్రత్యామ్నాయం చూపిస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

ఇప్పటి వరకు కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన ప్రస్తుత ఎంపీ బుట్టా రేణుక ఎలా స్పందిస్తారో అన్నది కర్నూలు జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుట్టా రేణుక కోట్ల కుటుంబం టీడీపీలో చేరే అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదు. 

కోట్ల కుటుంబం టీడీపీలో చేరడంతో ఆమెకు సీటు లేదనేది క్లారిటీ వచ్చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను అసెంబ్లీ నుంచి  పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. 

పాణ్యం లేదా ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి  పోటీ చేయించి అసెంబ్లీకి పంపాలని వ్యూహరచన చేస్తున్నారు. లేదా మరేదైనా ప్రత్యామ్నాయం చూపిస్తారా అన్నది సస్పెన్షన్. మరి చంద్రబాబు ఆలోచనలకు బుట్టా రేణుక సానుకూలంగా స్పందిస్తారా లేక తిరుగుబాటుకి దిగుతారా అన్నది వేచి చూడాలి. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పసుపు కోటలోకి కోట్ల కుటుంబం: చంద్రబాబుతో భేటీ

రసవత్తరంగా కర్నూలు రాజకీయం: సొంతగూటికి మాజీ ఎమ్మెల్యే

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రూట్ క్లియర్: మరి సుజాతమ్మకు...?

మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

 

Follow Us:
Download App:
  • android
  • ios