కర్నూల్: మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో  చేరే అవకాశం ఉంది.సోమవారం రాత్రి  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి విందు ఇవ్వనున్నారు.

గతంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరాలని భావించారు. కానీ, కొన్ని కారణాలతో ఆయన టీడీపీలో చేరలేదు.  ఏపీ ఎన్నికల్లో  టీడీపీతో పొత్తు ఉండాలని సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, పార్టీ నాయకత్వం మాత్రం పొత్తును వ్యతిరేకించింది. దరిమిలా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. 

టీడీపీతో పొత్తును కొందరు పార్టీ నేతలు వ్యతిరేకించడంతో   పాటు నంద్యాలలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని కూడ కొంత కాలం పాటు వాయిదా వేయాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరాను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోరారు. కానీ రఘువీరారెడ్డి మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో కోట్ల మరింత అసంతృప్తికి గురయ్యారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న యూత్‌ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి సోమవారం నాడు రాజీనామా చేశారు. ఖాసీం, కె. వంశీధర్ రెడ్డి, పి.రవీంద్ర, ఆదిత్యరెడ్డిలు యూత్‌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు సమర్పించారు.

కర్నూల్ ఎంపీ స్థానం నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో  పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీగా బుట్టా రేణుక ఉన్నారు. ఆమె వైసీపీ నుండి టీడీపీలో చేరారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  టీడీపీలో చేరితే కర్నూల్‌ ఎంపీ స్థానం నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికే దక్కనుంది. రేణుకను అసెంబ్లీకి పంపే అవకాశం ఉందని చెబుతున్నారు. 

మరోవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి సుజాతమ్మ కూడ అసెంబ్లీకి  పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే పాణ్యం, డోన్ అసెంబ్లీ సెగ్మెంట్లను కూడ కోట్ల కుటుంబం అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు.  అయితే కోట్ల ఫ్యామిలీకి ఎన్ని సీట్లను టీడీపీ కేటాయించనుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

ఫిబ్రవరి 6వ తేదీన లేదా ఆ తర్వాత కానీ కర్నూల్ జిల్లాకు చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాటు చేసి  ఆ సమయంలో కోట్ల కుటుంబం టీడీపీలో చేరే అవకాశం ఉంది. కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరిక విషయాన్ని గతంలోనే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో చంద్రబాబునాయుడు చర్చించారు. కోట్ల ఫ్యామిలీ చేరికకు కేఈ కృష్ణమూర్తి అభ్యంతరం లేదని చెప్పినట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

ఇదిలా ఉంటే కర్నూల్ జిల్లాలో టీడీపీ ఎక్కువ స్థానాలను వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకోవాలంటే బలమైన నేతలు అవసరమని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఈ కారణంగానే కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కోట్ల ఫ్యామిలీకి ఒక్క ఎంపీ, ఓ అసెంబ్లీ స్థానాన్ని కూడ ఇస్తామని వైసీపీ నాయకత్వం ఆఫర్ ఇచ్చింది. కానీ, వైసీపీలో చేరేందుకు మాత్రం కోట్ల ఫ్యామిలీ  సుముఖతను వ్యక్తం చేయలేదు. చంద్రబాబును కలిసేందుకు కోట్ల ఫ్యామిలీ సోమవారం మధ్యాహ్నం విజయవాడకు బయలుదేరి వెళ్లారు.