ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన భువనేశ్వర్ నుంచి ప్రత్యేక వైమానిక దళ విమానంలో బయలుదేరి, రాత్రి 6.45కి ఐఎన్‌ఎస్ డేగా నేవల్ ఎయిర్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ చేరుకున్న మోదీని గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్ తదితరులు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. శనివారం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు మోదీ విశాఖ వచ్చారు.
ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విశాఖలో ప్రధాన కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. జూన్ 21న శనివారం ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకూ ఆర్కే బీచ్ రోడ్డులో ఈ ఉత్సవం జరుగుతుంది. వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్‌తో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
5 లక్షల మందికి పైగా పాల్గొనే అంచనా
ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ కార్యక్రమంలో మొత్తం 5 లక్షల మందికి పైగా పాల్గొననున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న 30.16 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని 326 కంపార్టుమెంట్లుగా విభజించారు. ఒక్కో విభాగంలో 1,000 మందికి అవకాశముంటుంది. యోగా అభ్యాసకుల కోసం పచ్చటి కార్పెట్లు పరచడం, నీటి సదుపాయాలు, టెంట్లు వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అనేక జిల్లాల నుంచి పాల్గొననున్న ప్రజలు
విశాఖ నగరంతోపాటు అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల నుంచి వేలాది మంది కార్యక్రమానికి తరలివస్తున్నారు. వీరికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఏ జిల్లా వారిని ఏ కంపార్టుమెంటుకు పంపించాలో ముందుగానే అధికారులు నియమించి సమాచారం పంపారు. ప్రతి విభాగానికి వేర్వేరు అధికారులను, వలంటీర్లను నియమించారు.
ప్రధాని, సీఎంలకు ప్రత్యేక వేదిక
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖుల కోసం కాళీమాత ఆలయం సమీపంలో ప్రధాన వేదిక ఏర్పాటైంది. ఈ వేదిక నుంచి పార్క్ హోటల్ వరకు 18 వేల మంది పాల్గొంటారు. నేవీ సిబ్బంది, ఉద్యోగుల కోసం ముందుగా చోటు కేటాయించారు. వర్షం వచ్చే అవకాశం ఉండటంతో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసి 15 వేల మందికి అవకాశం కల్పించారు.
ప్రధాని షెడ్యూల్ వివరాలు
- జూన్ 21 శనివారం ఉదయం 6.25కు ప్రధాని మోదీ తూర్పు నౌకాదళాధికారుల నివాసం నుంచి రోడ్డుమార్గంగా బయలుదేరి ఆర్కే బీచ్‌కి చేరుకుంటారు.
- 6.30 నుంచి 7.50 వరకు యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.
- అనంతరం తిరిగి ఆఫీసర్స్ మెస్‌కి, అక్కడినుంచి ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్‌స్టేషన్‌కి వెళ్లి విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.