హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోవడం ఖాయమని తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు పదే పదే చెబుతున్నారు. అందుకు తగిన ప్రణాళికను కూడా ఆయన సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ వైపు ఉంటారా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైపు ఉంటారా అనే చర్చ సాగుతోంది.

జగన్ కోసమే కేసీఆర్ పనిచేస్తారనే ప్రచారానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. జగన్, పవన్ లను ఇద్దరినీ కలిపే ప్లాన్ కేసీఆర్ వద్ద ఉందా, లేదా అనేది ఇప్పుడు చెప్పడం కష్టమే. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టే విధంగా ఉంటుందనేది మాత్రం ఖాయం. అయితే, అందుకు ఆయన వేసిన ప్రణాళిక ఏమిటనేది తెలియాల్సి ఉంది. 

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కేసీఆర్ దోస్తీ కట్టడంలోని ఆంతర్యం ఎపి రాజకీయాలను ప్రధానంగా దృష్టి పెట్టుకుందేనని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలోనూ, గుంటూరు వంటి కొద్ది కోస్తాంధ్ర జిల్లాల్లోనూ ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందు రాయల తెలంగాణ ప్రతిపాదనకు అసదుద్దీన్ మద్దతు తెలపడం వెనక కారణం అదే. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనేది ఆ ప్రతిపాదన.

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ముస్లీం మైనారిటీల జనాభా లెక్కలోకి తీసుకునే స్థాయిలో ఉండడమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు అసదుద్దీన్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనే కేసీఆర్ ఆలోచన వెనక బహుశా ఆ లెక్కలు ఉండి ఉంటాయని చెప్పవచ్చు. తెలంగాణలో కాంగ్రెసు టీఆర్ఎస్ తర్వాత అతి పెద్ద పార్టీగా ఉండడంతో కేసీఆర్ కాంగ్రెసును జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకున్నారని చెప్పవచ్చు. 

కాంగ్రెసుకు, బిజెపికి వ్యతిరేకంగా తాను జాతీయ రాజకీయాల్లో కొత్త పార్టీకి పురుడు పోస్తానని కూడా అంటున్నారు. ఈ కోత్త పార్టీ రూపం ఎలా ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పాత్ర వహిస్తుందనేది చెప్పడం అంత సులభం కాదు. కానీ, దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీలను కూడగట్టి కాంగ్రెసుకు వ్యతిరేకంగా బలమైన శక్తిగా రూపొందించడమే ఆయన వ్యూహంగా చెప్పవచ్చు. అసదుద్దీన్ కూడా కాంగ్రెసుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అందువల్ల ఇరువురి ఎజెండా ఒక్కటైందని అనుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లీస్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా, జగన్ తో జత కడుతుందా అనేది తేలాల్సి ఉంది. అయితే, చంద్రబాబుకు వ్యతిరేకంగా వివిధ వర్గాలను కూడగట్టడానికి మాత్రం కేసీఆర్ తో పాటు అసదుద్దీన్ పని చేస్తారనేది అర్థమవుతోంది. మజ్లీస్ ఇప్పటికే రాయలసీమలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. వచ్చే శాసనసభ, లోకసభ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని అర్థమవుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీలో కాలు పెట్టడం ఖాయం: కేసీఆర్

కేసీఆర్‌తో ఎంఐఎం చీఫ్ అసద్ భేటీ

చంద్రబాబుకు ఓవైసీ కౌంటర్: త్వరలో ఏపీలో పర్యటిస్తా

అసద్‌తో కలిసి దేశ రాజకీయాలను మలుపు తిప్పుతా: కేసీఆర్

నెల ఆగండి, దేశ రాజకీయాల్లో సత్తా చాటుతా: కేసీఆర్

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక