హైదరాబాద్: దేశ రాజకీయాల్లో  కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది..బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నుండి దేశం విముక్తి కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్  అభిప్రాయపడ్డారు.

దేశ రాజకీయాల్లో అనుసరించనున్న  వ్యూహంపై సోమవారం నాడు కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో  నెల రోజుల్లో గుణాత్మక మార్పు కోసం  ప్రయత్నం చేస్తామని  కేసీఆర్ ప్రకటించారు. దేశ రాజకీయాల్లో  మార్పు రావాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ చీఫ్ చెప్పారు. విద్య, వైద్యం, పట్టణాభివృద్దిపై కేంద్రం పెత్తనం పోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్  చెప్పారు.

పార్టీలు ఏకం కావాల్సిన అవసరం లేదన్నారు. దేశ ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రజలంతా ఏకమైన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఇదే తరహలో దేశంలో ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

తెలంగాణ మోడల్‌ను  దేశానికి చూపుతామని  కేసీఆర్ ప్రకటించారు. దేశంలో రైతుల గురించి ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. రైతాంగం సంక్షేమం కోసం టీఆర్ఎస్ కట్టుబడి ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ తరహలో దేశంలో రైతాంగానికి పథకాలు అవసరమని చెప్పారు.

ఎన్నికల ఫలితాల సందర్భంగా బెంగాల్ సీఎం మమత బెనర్జీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  తనతో మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో పాలనను గాడిలో పెట్టి దేశ రాజకీయాల్లో  కూడ క్రియాశీలకంగా వ్యవహరిస్తానని కేసీఆర్ చెప్పారు. 

దేశంలో మైనార్టీల సంక్షేమం గురించి ఏం చేయాలనే విషయమై తాను నిన్న మూడు గంటల పాటు అసదుద్దీన్ తో చర్చించినట్టు చెప్పారు. అసద్ తో కలిసి తాను దేశ వ్యాప్తంగా పర్యటిస్తానని కేసీఆర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక
శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్