హైదరాబాద్:  ముఖ్యమంత్రిగా రేపు తాను ప్రమాణం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.  తనతో పాటు  ఒకరిద్దరూ మంత్రులు ప్రమాణం చేస్తారని చెప్పారు.  జాతీయస్థాయి రాజకీయాల్లో కొత్త ప్రయోగాలు చేస్తామన్నారు. ఏపీలో కాలు పెడతానని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

బుధవారం నాడు టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.తనను టీఆర్ఎస్‌ఎల్పీ నేతగా  ఎన్నుకొన్నందుకు ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వీలైతే రేపే తన ప్రమాణ స్వీకారం చేస్తానని.. వీలు కాకపోతే  తర్వాత  సీఎంగా ప్రమాణం చేస్తానని చెప్పారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టుకు అన్ని రకాలుగా ఇళ్లస్థలాలను ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని ఆయన ప్రకటించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సైకాలజీ బాగా లేదని కేసీఆర్ చెప్పారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం అవసరమని చెప్పారు.  మూస వ్యవసాయ విధానం దేశానికి పనికిరాదని కేసీఆర్ తెలిపారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందు దొందూ అని కేసీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ ఒక చిన్న రాష్ట్రంలో మద్దతు ధర రూ.2500 ఇస్తానని ప్రకటించడం సరైందా అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ  జాతీయ పాలసీగా దీన్ని ప్రకటిస్తారా  ఆని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్  గుర్తు చేశారు. జాతీయ పార్టీలంటూ  రాష్ట్రాలకు ఓ విధానాన్ని అనుసరిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
సీపీఎస్ విధానాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేశారని చెప్పారు.

దేశంలో  ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత టీఆర్ఎస్‌ పార్టీ అని ఆయన చెప్పారు. ఈ విషయమై ఏ చాలెంజ్ కైనా సిద్దమేనని  ఆయన ప్రకటించారు. మేనిఫెస్టోలో లేని అంశాలను కూడ అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నాలుగేళ్లలో తమ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ ఫలితాలతో తేలిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడ  ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదన్నారు. సంక్షేమ పథకాల వల్ల ప్రజలు తమకు 88 సీట్లలో గెలిపించారని చెప్పారు.మేం ఏపీ రాష్ట్రానికి వెళ్తామని కేసీఆర్ చెప్పారు. ఏపీకి రావాలని  తనను కోరుతున్నారని ఆయన చెప్పారు.

జాతీయ రాజకీయాల్లో రైతు బంధు పథకాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తానని కేసీఆర్ చెప్పారు. ఈ పథకాన్ని దేశంలోని రైతలకు అమలు చేస్తే  ఎంత బడ్జెట్ అవసరమో తన వద్ద లెక్కలున్నాయని ఆయన చెప్పారు..మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ చెప్పారు.

ఏడాదిన్నర తర్వాత కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు పూర్తికానున్నాయని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సుమారు 80 శాతం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.

తమ కంటే 60 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదో చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను ఆశలను కల్పించి నిస్పృహకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ రంగంలోని ఖాళీ ఉద్యోగాలను వీలైనంత త్వరలో పూర్తిచేస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారు.

ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కావాలని  కోరుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబునాయుడుకే అవగాహన లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

పెద్ద నగదు నోట్ల రద్దు చేయడం సరైందేనని కేసీఆర్ చెప్పారు. ఈ దఫా రాష్ట్రంపై తప్పుడు విమర్శలు చేస్తే  చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వసొమ్మును తిన్నవాడిని కక్కిస్తామని కేసీఆర్ హెచ్చరించారు.సమాచార శాఖ తన వద్దే ఉంటుందని  కేసీఆర్ ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

ఇతర పార్టీల కీలకనేతలు మా వైపు వస్తారు: కేసీఆర్

టీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక

కేసీఆర్ ప్రమాణానికి ముహుర్తం ఇదే: ఒక్కరితోనే కొలువు