Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా జి. సాయి ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11.33 గంటలకు అమరావతిలోని సచివాలయంలో ఆయన అధికారికంగా సీఎస్ పదవిని చేపట్టనున్నారు. 

జి. సాయి ప్రసాద్ శనివారం ఏపీ కొత్త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న విజయానంద్ పదవీకాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 29న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం విజయానంద్ పదవీకాలాన్ని మూడు నెలలు పొడిగించారు. అదే ఉత్తర్వులో తదుపరి ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్‌ను నియమించారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలు

సాయి ప్రసాద్ ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎక్స్-అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలందిస్తున్నారు. పాలనా అనుభవం ఎక్కువగా ఉండటంతో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ పదవికి ఎంపిక చేసింది.

ఐఏఎస్ సేవల్లో ప్రవేశం

సాయి ప్రసాద్ 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందినవారు. ఎంటెక్ పట్టభద్రుడైన ఆయన 1991 సెప్టెంబర్ 15న ఐఏఎస్ సేవలకు ఎంపికయ్యారు. 1992 నుంచి 1993 వరకు వరంగల్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా సేవలు అందించారు. అనంతరం 1993 నుంచి 1995 వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు.

జిల్లా స్థాయి కీలక పదవులు

సాయి ప్రసాద్ పలు జిల్లాల్లో ముఖ్యమైన పదవులు నిర్వహించారు. 1995 నుంచి 1997 వరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్, 1997 నుంచి 1998 వరకు కడప జాయింట్ కలెక్టర్, 2000 నుంచి 2003 వరకు కర్నూలు జిల్లా కలెక్టర్, 2003లో కొంతకాలం చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సేవ‌లందించారు. జిల్లా స్థాయిలో పరిపాలన అనుభవం ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో సేవలు

సాయి ప్రసాద్ విద్యుత్ రంగం, గృహనిర్మాణ రంగాల్లో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, ఈపిడీసీఎల్ సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ, ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా సేవ‌లందించారు. 2011 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.

సీఎం కార్యాలయం నుంచి సీఎస్ వరకు

సాయి ప్రసాద్ 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. తరువాత సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీగా, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2022 నుంచి 2024 వరకు సీఎస్ఎల్‌ఏ (CCLA)గా బాధ్యతలు నిర్వహించారు. 2024 నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో రాష్ట్ర పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న అధికారిగా సాయి ప్రసాద్ సీఎస్ బాధ్యతలు చేపడుతున్నారు.