అమరావతి:వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధీమాను వ్యక్తం చేశారు. వైసీపీ ఉన్న కూటమిలో జనసేన ఉండదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించకొన్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ-బీజేపీల మధ్య ఎలాంటి పొత్తు లేదని, అలాంటి ప్రకటనలన్నీ అభూతకల్పనలు, బూటకమేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

also read:నా లెక్క నాకుంది: వైఎస్ జగన్ తో బిజెపి దోస్తీపై పవన్ కల్యాణ్

రాజధాని గ్రామాల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు పర్యటించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లిఖితపూర్వకంగా ఉంది. ఆ నిర్ణయానికే బీజేపీ కట్టుబడి ఉంది. జనసేన- బీజేపీలు మాత్రం అమరావతిపై లిఖితపూర్వకంగా ఒప్పందానికి వచ్చాయన్నారు. 

బీజేపీ-జనసేన పార్టీలు అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాయి. అమరావతి ఎక్కడికీ తరలిపోదు. ఒక వేళ వెళ్లినా తిరిగి ఇక్కడికే తిరిగి వస్తుందని పవన్ కళ్యాణ్ రాజధాని వాసులకు భరోసా ఇచ్చారు. 

వైసీపీ-బీజేపీ పొత్తు అనే అంశం అసలు జరిగే పని కాదని చెప్పారు. వైసీపీ ఎన్డీఏలో భాగస్వామి అవుతుందన్న అంశం తన దృష్టికి రాలేదన్నారు. వైసీపీ నేతలు చెప్పే మాయమాటలు నమ్మి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి  అమిత్ షాలను అపార్థం చేసుకోవద్దని చెప్పారు.

రాజధాని అమరావతి గ్రామాల పర్యటనలో భాగంగా  పవన్ కళ్యాణ్ అనంతవరం, తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లోని నిరసన దీక్ష శిబిరాలను సందర్శించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా 60 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు పడుతున్న వెతలను ఆలకించారు. 

రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఒక రకంగా మాట్లాడుతుంటే ఢిల్లీలో అధికార ప్రతినిధులు మరో రకంగా మాట్లాడుతున్నారు అని ఇక్కడి రైతులు అడుగుతున్నారు. ఆ అంశం మీద నేను ఢిల్లీ వెళ్లినప్పుడు మాట్లాడాను. వారు గత ప్రభుత్వ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం అన్న స్పష్టత ఇచ్చారు.  మోదీ,అమిత్ షాలు మూడు రాజధానులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెప్పారు.

గత ప్రభుత్వాలు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను తరవాత వచ్చే ప్రభుత్వాలు తప్పొప్పులు ఉంటే సరిదిద్ది అమలుపరచాలి మినహా మార్పులు చేయరాదు. ఢిల్లీ పెద్దల వద్ద మూడు రాజధానుల అంశం ప్రస్తావించినప్పుడు అక్కడ పెద్దలు యూపీఏ హయాంలో ఆధార్ కార్డుని తాము వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ప్రతిపక్షంలో వ్యతిరేకించినా, అధికారంలోకి వచ్చాక తప్పొప్పులను సరిదిద్ది కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలోనూ అదే జరుగుతుందని మాటిచ్చారు. 

రాజధాని అమరావతి అనేది 2014లో నిర్ణయమైంది. 33 వేల ఎకరాల్లో రాజధాని అంటే తేడా వస్తే రైతుల పరిస్థితి ఏంటి అని నేను అయినా అనుమానించానుగానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి మాత్రం ఎలాంటి అడ్డు చెప్పలేదని పవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 అమరావతిలో రాజధానిని కొనసాగిస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు అని ముందే చెప్పి ఉంటే ప్రజలు ఓట్లు వేసే వారు కాదు. రాజధాని ప్రాంతవాసులను నమ్మించి గొంతు కోసింది. 

అధికారం చేతిలో ఉంది కదా అని రాజధానిని ఇష్టారాజ్యంగా మార్చడం తగదన్నారు.. 151 మంది ఎమ్యెల్యేలు వుండటం అంటే రాష్ట్రానికి ఎంత స్థిరత్వంతో కూడిన పాలన ఇవ్వాలి. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెయ్యాలి. 151 సీట్లు భవిష్యత్తులో మరో పార్టీకి రాకపోవచ్చు. అంతటి బలమైన మెజారిటీని వైసీపీ ప్రభుత్వానికి ఇస్తే వారు అందరి జీవితాల్లో అస్థిరత నింపారు. ఇళ్ల నుంచి ఆడబిడ్డలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తెచ్చారని వైసీపీపై పవన్ మండిపడ్డారు.