Chandrababu Naidu: బనకచర్ల రచ్చపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. నీటి సమస్యపై రాజకీయాలు వద్దని అన్నారు. శాంతియుతంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుందాని చెప్పారు.
Chandrababu Naidu: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బనకచర్ల హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త రచ్చకు కేంద్రంగా ఉంది. ఈ క్రమంలోనే నీటి సమస్యపై రాజకీయాలు వద్దని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గొడవలు పడకుండా నీటి సమస్యలు పరిష్కరించుకుందామని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతున్న వేళ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాంతియుతమైన విధానాన్ని ప్రతిపాదించారు. అనవసరంగా నీటిపై రాజకీయాలు చేయొద్దనీ, సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకోవడం తప్పేమీ కాదని అన్నారు.
గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, అందులో భాగస్వామ్యం ఏపీకీ, తెలంగాణకీ ఉందని అన్నారు. ఈ అంశంపై కేంద్రంతో చర్చించి పరిష్కారం కోరాలనే దిశగా చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. రెండు రాష్ట్రాల ప్రజల అభివృద్ధికే శ్రేయస్సుగా ప్రాజెక్టులపై రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
బనకచర్ల: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య తలెత్తిన తాజా జలవివాదం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. గోదావరి జలాల వినియోగం, బనకచర్ల లింక్ ప్రాజెక్టు అనుసంధానంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం వాతావరణాన్ని వేడెక్కించింది.
గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశంపై మాట్లాడారు. "గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకుంటే తప్పేంటి?" అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ తెలంగాణతో గొడవపడలేదనీ, పోటీకి బదులుగా చర్చలతో పరిష్కరించుకుందామని అన్నారు.
"ప్రజల కోసం ప్రాజెక్టులు కావాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. తెలంగాణలోనూ ప్రాజెక్టులు నిర్మించాలి. రెండు రాష్ట్రాల రైతులు ఆనందంగా ఉండాలి" అని చంద్రబాబు అన్నారు. అనవసరంగా నీటి సమస్యపై వివాదాలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టొద్దని పేర్కొన్నారు.
కోర్టును ఆశ్రయిస్తాం: తెలంగాణ హెచ్చరిక
ఇదిలా ఉంటే, జూన్ 18న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష ఎంపీలు, ప్రజా ప్రతినిధులు సమావేశమై బనకచర్ల ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేశారు. "ప్రధానమంత్రి మోడీ మీరు చెప్పినట్లే వినవచ్చు. కానీ మా హక్కులను వదులుకోం. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం" అని రేవంత్ స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ అఖిలపక్ష బృందం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి బనకచర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టు తమ హక్కులకు భంగం కలిగించనుందని, కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బనకచర్ల ప్రాజెక్టు: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వార్నింగ్
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ వివాదం పరిష్కారమయ్యే వరకు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. మోడీ దగ్గర అనుమతులు తెచ్చుకున్నంత మాత్రానా ప్రాజెక్టులు పూర్తి కావని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టు క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిలపై కూడా రేవంత్ విమర్శలు గుప్పించారు. సచివాలయంలో బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుపై తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తుందని, కేంద్రం తమ డిమాండ్‌కు స్పందించకపోతే కోర్టులను ఆశ్రయిస్తుందని చెప్పారు.
గోదావరి నదిలో 1000 టీఎంసీల వరద నీటిని, కృష్ణాలో 500 టీఎంసీల వరద నీటిని తెలంగాణ ఉపయోగించుకునేంత వరకు ఎన్‌ఓసి జారీ చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి కేటాయింపులు లేకుండా గోదావరి నుండి వరద జలాలను ఎత్తిపోయడాన్నితీవ్రంగా వ్యతిరేకించారు.
బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ ద్వంద్వ ప్రమాణాలు అంటూ రేవంత్ విమర్శలు
బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించిందనీ, 2016 సెప్టెంబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. గోదావరి జలాలను ఏపీ లిఫ్టు చేయడానికి కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. గోదావరి నది నుండి 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నట్లు కేసీఆర్ తెలియజేశారని ఆయన ఎత్తి చూపారు.
ఆగస్టు 13, 2019న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జరిగిన సమావేశంలో, కేసీఆర్ రాయలసీమను మళ్ళీ 'రతనాల సీమ'గా మారుస్తామని ప్రకటించారు. కేసీఆర్, జగన్ ప్రగతి భవన్‌లో నాలుగుసార్లు సమావేశమై గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలని నిర్ణయించారని ఆయన చెప్పారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం వివరాలను అప్పటి మంత్రులు ఈటల రాజేందర్, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కూడా వెల్లడించారు. ఈ సమావేశ వివరాలను సూచనగా ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు రేవంత్ వివరించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్దిష్ట కేటాయింపులు లేకుండా గోదావరి నీటి వినియోగానికి సంబంధించి ఏపీకి హామీ ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల మంత్రి టి హరీష్ రావులపై విమర్శలు గుప్పించారు.
ట్రిబ్యునల్ నిర్ణయాలు పాటిద్దాం: చంద్రబాబు
‘‘కొత్త జల ట్రైబ్యునల్ ఎలా కేటాయిస్తే, అలా నీటిని వినియోగించుకుందాం. గోదావరిలో మిగిలిన నీళ్లను అందరూ వాడుకోవచ్చు. మేము సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వినియోగించుకోవాలన్నదే మా ఉద్దేశం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే, తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ భూముల్లో ఉన్న ప్రాజెక్టులకు వ్యతిరేకత ఎందుకు చూపాలని ప్రశ్నించారు. ఒకరి పై మరొకరు ఆరోపణలు చేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని చెప్పారు.
అలాగే, ‘‘బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదు. కానీ ఈ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు పెరుగుతాయి. సమస్యలపై కూర్చుని చర్చించాలి. రాజకీయాలు అవసరం లేదు’’ అని చంద్రబాబు అన్నారు.