ఆంధ్రప్రదేశ్‌లో పంటల రుణాల పరిమితి పెరిగింది. వివిధ పంటలకు, మత్స్య, పాడి, తోటలు వంటి విభాగాలకు కొత్త రుణ రేట్లు అమల్లోకి వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రైతులకు సంతోషకరమైన సమాచారం వచ్చింది. వచ్చే 2025-26 ఖరీఫ్, రబీ సీజన్ల కోసం పంటల రుణ పరిమితిని రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ తాజాగా పెంచింది. బ్యాంకుల స్టేట్ లెవెల్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం వ్యవసాయం, తోటలు, పాడి పశువులు, మత్స్య పరిశ్రమ, కోళ్లు, పట్టుసాగు వంటి అన్ని వ్యవసాయ సంబంధిత రంగాలకు రుణాలు పెంచారు. ఈ పెంపుతో రైతులు పంటల సాగు కోసం మరింత పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కలుగుతుంది.

ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.46వేల నుంచి రూ.52వేల వరకు రుణం ఇవ్వనున్నారు. గత సంవత్సరం ఇదే వరి పంటకు రూ.41వేలు మాత్రమే ఉండగా, ఈసారి రూ.5వేల వరకు పెంచారు. రబీ సీజన్‌లో వరి సాగుకు రూ.50వేల నుంచి రూ.55వేల వరకూ రుణ పరిమితిని నిర్ణయించారు. శ్రీవరి రకానికి రూ.35వేల నుంచి రూ.40వేల వరకు బ్యాంకులు అప్పు ఇస్తాయి.

ఇటు మిరప సాగు చేస్తున్న రైతులకు కూడా బంపర్ లాభం దక్కనుంది. ఎర్రమిరప పంటకు ఎకరానికి రూ.1.5 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకూ రుణాలు అందుబాటులోకి వస్తాయి. పచ్చిమిరపకు రూ.లక్ష నుంచి రూ.1.1 లక్షల వరకూ రుణ పరిమితిని ఖరారు చేశారు. ఇదే విధంగా ఎర్రమిరప సాగుకు అదనంగా రూ.35వేల నుంచి రూ.50వేల వరకూ మంజూరు చేస్తారు. పచ్చిమిరపకి అదనంగా రూ.10వేల వరకు పెరిగింది.

పత్తి పంట సాగు చేస్తున్న రైతులకు పరిస్థితులు వర్షాధారమై ఉంటే రూ.46వేల నుంచి రూ.51వేల వరకూ రుణం లభిస్తుంది. నీటి పారుదల ఉన్న భూముల్లో పత్తి పంటకు రూ.48వేల నుంచి రూ.55వేల వరకు రుణ పరిమితి ఉంటుంది.

కందులు, శనగలు, వేరుశనగ, పెసలు, మినుములు, సన్‌ఫ్లవర్ వంటి ఇతర పంటలకు కూడా ఈసారి రుణ పరిమితులు గణనీయంగా పెరిగాయి. కందికి రూ.6వేలు, శనగకు రూ.3వేలు, వేరుశనగకు రూ.3వేలు, పెసలకు రూ.2వేలు, మినుములకు రూ.6వేల నుంచి రూ.8వేల వరకు, సన్‌ఫ్లవర్‌కు రూ.5వేల రుణం అదనంగా ఇవ్వనున్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు కూడా రూ.5వేల వరకు పెంచారు.

తోటపంటల విభాగంలో కూడా పెంపు కొనసాగింది. మామిడి తోటలకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకూ, అరటితోటలకు రూ.6వేల నుంచి రూ.10వేల వరకూ అదనపు రుణం లభించనుంది. చెరుకు పంట సాగు చేసే రైతులకు అదనంగా రూ.5వేల రుణం ఇవ్వనున్నారు.

పాడిపశువుల పెంపకానికి, కోళ్ల ఫారాల కోసం, మత్స్య ఉత్పత్తి రంగాల కోసం కూడా రుణ పరిమితులు పెంచారు. చేపల పెంపకానికి రూ.30వేల వరకు, రొయ్యల సాగుకు రూ.34వేల నుంచి రూ.36వేల వరకు రుణం లభిస్తుంది. కోళ్లలో బాయిలర్ కోడి పెంపకానికి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు, లేయర్ కోడికి రూ.20వేల వరకూ రుణం ఇవ్వనున్నారు. పట్టుపురుగు సాగుకు రూ.15వేల వరకు పెంపు చేశారు.

ఇక ఈ మధ్య సీఎం చంద్రబాబు నాయుడు పలు పంటల కొనుగోలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా తోటపంటల్లో మామిడి, పొగాకు, కోకో కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మామిడి గుజ్జుపై జీఎస్టీ తగ్గించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 5%కి తగ్గించాలన్న ప్రతిపాదనపై చర్చ సాగుతోందన్నారు.

ఈ ఏడాది రాష్ట్రంలో హెచ్‌డీ బర్లీ రకం పొగాకు ఉత్పత్తి 80 మిలియన్ కిలోలు కాగా, ఇప్పటివరకు 27 మిలియన్ కిలోలు విక్రయించారని సీఎం తెలిపారు. మిగతా 33 మిలియన్ కిలోల కొనుగోలు కోసం 24 ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించారని చెప్పారు. అలాగే మరో 20 మిలియన్ కిలోల పొగాకును మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా సేకరిస్తున్నట్టు వెల్లడించారు. రైతుల దగ్గర ఉన్న మిగిలిన పొగాకును త్వరగా సేకరించాలని స్పష్టం చేశారు.

కోకో పంట విషయంలో కూడా జులై మొదటి వారంలోపు రైతుల దగ్గర ఉన్న స్టాక్‌ మొత్తాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలన్న ఆదేశాలు ఇచ్చారు. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా మెరుగుపరచి, గ్లోబల్ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఎగుమతులు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు కనీసం కిలోకు రూ.8 చెల్లించాలని సూచించారు. అదనంగా ప్రభుత్వం రూ.4 సాయం చేస్తుందని చెప్పారు.

ఈ విధంగా పంటల సాగు నుండి విక్రయాల వరకు అన్ని దశలలో రైతులకు మద్దతు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొత్త రుణ పరిమితుల వల్ల రైతులు భద్రతగా పెట్టుబడి పెట్టగలుగుతారు. త్వరితగతిన పంటల కొనుగోళ్లు జరిగితే, ధరల పరంగా రైతులకూ నష్టం రాకుండా ఉంటుంది.

పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్ల సాయం అడిగిన సీఎం..

పొగాకు ధరలు తీవ్రంగా పడిపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీల కొనుగోళ్లు చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అలాగే, టొబాకో బోర్డు ద్వారా పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్‌ను నియంత్రించేందుకు చట్ట సవరణ చేపట్టాలని కోరారు.

పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు పై ఆందోళన

పామాయిల్ దిగుమతులపై కేంద్రం సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై సీఎం చంద్రబాబు గోయల్‌కు అభ్యంతరం తెలిపారు. దీని వల్ల రాష్ట్ర పామాయిల్ రైతులకు నష్టం వాటిల్లుతోందని వివరించారు. దిగుమతి సుంకం తగ్గించడం కేంద్ర నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలను కూడా విఘాతం కలిగిస్తుందని ఆయన తెలిపారు.

ఆక్వా ఎగుమతులపై

అమెరికా ఆక్వా ఉత్పత్తులపై విధించిన 27 శాతం దిగుమతి సుంకం రాష్ట్రంలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీఎం చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికాతో చర్చలు జరిపేలా కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ 

ప్రస్తుతం మ్యాంగో పల్ప్‌పై విధిస్తున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.