ఆంధ్ర‌ప్ర‌దేశ్ లిక్క‌ర్ స్కామ్ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏర్పాటు చేసి సిట్ ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసింది. ఓవైపు అరెస్టులు చేస్తూనే మ‌రోవైపు సోదాలు జ‌రుపుతోంది. 

హైదరాబాద్‌లో సిట్ సోదాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ద్యం స్కామ్ మ‌రో మ‌లుపు తిరిగింది. సిట్ అధికారులు కీలక ఆధారాల కోసం హైదరాబాద్‌లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తు ప్రధానంగా నిందితులు సమావేశమైన ప్రదేశాలపై కేంద్రీకృతమైంది. సిట్ అధికారులు నిందితులు వెళ్లిన ప్రదేశాలను గూగుల్ టేకౌట్ డేటా ద్వారా ఇప్పటికే గుర్తించారు. శనివారం ఈ ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా డిస్టిలరీ యజమానులు, సహ నిందితులు సమావేశమైన ప్రదేశాలను ఫోకస్ చేశారు.

భారతి సిమెంట్స్ కార్యాలయంలో తనిఖీలు

జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ కార్యాలయం కూడా సిట్ పరిశీలనలో భాగమైంది. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లోని ఈ కార్యాలయంలో శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప డిస్టిలరీ యజమానులతో పలుమార్లు సమావేశమైనట్లు గుర్తించారు.

వారంట్ లేకుండా అనుమతించమన్న న్యాయవాదులు

సిట్ అధికారులు బాలాజీ గోవిందప్ప చాంబర్‌ను తనిఖీ చేయడానికి ప్రయత్నించగా, సంస్థ న్యాయవాదులు సెర్చ్ వారంట్ లేకుండా తనిఖీలు చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఉద్రిక్తత కొనసాగింది. చివరికి సిట్ గోవిందప్ప చాంబర్, మీటింగ్ హాల్‌ను పరిశీలించి సహాయకులను ప్రశ్నించింది. అనంతరం ఆయన నివాసమైన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11కు వెళ్లి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

రాజ్ కసిరెడ్డి, చాణక్య రెస్టారెంట్ పరిశీలన

మద్యం స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి యాజమాన్యంలోని రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ కార్యాలయం, అతని సహచరుడు బూనేటి చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్ (నానక్‌రామ్ గూడ)లో సిట్ సోదాలు నిర్వహించింది. ఈ రెస్టారెంట్‌లో పలుమార్లు జరిగిన సమావేశాల వివరాలు సేకరించారు.

రెండో చార్జిషీట్‌కు సిద్ధం

ఇప్పటికే మద్యం స్కామ్ కేసులో మొదటి చార్జిషీట్ దాఖలైంది. రెండో చార్జిషీట్ సిద్ధం చేస్తూ బాలాజీ గోవిందప్ప పాత్రను వివరించేందుకు ఈ సోదాలు కీలకంగా మారాయి. మొదటి చార్జిషీట్‌లో ఆయన పేరు ప్రస్తావించలేదు. ఈ సారి సంబంధిత ఆధారాలు సమర్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మరో కొన్ని ప్రాంతాల్లో కూడా సిట్ ఒకేసారి సోదాలు చేసింది. ఇప్పటివరకు ఈ కేసులో పన్నెండు మందిని అరెస్టు చేసినట్లు తెలిసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.