- Home
- Telangana
- Telangana: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం.. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్.. అసలేం జరుగుతోంది.?
Telangana: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం.. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్.. అసలేం జరుగుతోంది.?
తెలంగాణ రాజకీయాల్లో మరో అంశం కలకలం లేపుతోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు ఉన్న వ్యవహారం తాజాగా బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లు మారింది. ఏపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు దారి తీశాయి.

తెలంగాణ రాజకీయాల్లో కలకలం
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు, బీజేపీ ఎంపీ సీయం రమేష్ సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్ ప్రయత్నించారని, దీనికి సంబంధించిన వీడియో తన వద్ద ఉందని సీయం రమేష్ బహిరంగంగా ప్రకటించారు.
కేటీఆర్ ఆరోపణలతో మొదలు
తొలుత కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశాన్ని కాంగ్రెస్ అవినీతిపై ప్రజల దృష్టి మరల్చడానికి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు ఇచ్చిందని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీయం రమేష్‌కు రూ.1,660 కోట్ల రోడ్ ప్రాజెక్టు కాంట్రాక్టు కట్టబెట్టిందని ఆరోపించారు.
‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపై కేటీఆర్ విమర్శ
హెచ్‌సీయూ భూములపై జరిగిన రూ.10 వేల కోట్ల కుంభకోణం, ఫ్యూచర్ సిటీ రోడ్ ప్రాజెక్టు కాంట్రాక్టు విషయాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డంటూ కాంట్రాక్టు కేటాయించడం అవినీతికి నిదర్శనమని అన్నారు. ఈ కుంభకోణాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీయం రమేష్ ఇద్దరూ కలిసి రావాలని సవాల్ చేశారు.
సీయం రమేష్ సంచలన ఆరోపణ
కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ తన ఇంటికి వచ్చి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వంలో అవినీతి కేసులు పెట్టకుండా ఉండాలన్న షరతు పెట్టారని ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించి వీడియో రికార్డింగ్ కూడా తన వద్ద ఉందని రమేష్ చెప్పారు. కేటీఆర్ ఈ విషయాన్ని ఖండించాలంటే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు.
నిజంగానే వీడియో ప్రూఫ్ ఉందా.?
ఇదిలా ఉంటే ఇప్పుడీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపు తిప్పే అవకాశముంది. కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్‌గా రమేష్ చేసిన వ్యాఖ్యలు, వీడియో ప్రూఫ్ ఉన్నాయన్న ప్రకటన మరింత ఉద్రిక్తత సృష్టించింది. ఈ వీడియో నిజంగా బయటకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించడం ఖాయం. ఇప్పుడు అందరి చూపు కేటీఆర్ తదుపరి ప్రతిస్పందన, రమేష్ వద్ద ఉన్న వీడియో బయటకు వస్తుందా అన్న దానిపై పడింది.