HCU Land Dispute : ఏమిటీ కంచ గచ్చిబౌలి భూవివాదం? 400 ఎకరాలు ప్రభుత్వానిదా? హెచ్సియుదా?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం జరుగుతోంది. అసలు ఈ భూమి ఎవరిది? ప్రభుత్వానిదా లేక యూనివర్సిటీదా?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం జరుగుతోంది. అసలు ఈ భూమి ఎవరిది? ప్రభుత్వానిదా లేక యూనివర్సిటీదా?
HCU Land Issue : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరోసారి భూముల వివాదం రాజుకుంది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని భూములపై రాజకీయ దుమారం రేగింది. హైదరాబాద్ నడిబొడ్డున గల 400 ఎకరాలను అభివృద్ధి చేసి నగర బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచాలని చూస్తున్నామంటోంది ప్రభుత్వం... కాదు కాదు రియల్ ఎస్టేట్ దందా కోసమే పచ్చని చెట్లను తొలగించి, వన్యప్రాణులను బలిచేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు విద్యార్థి సంఘాలు ఆందోళనలు, పోలీస్ పహారా, అరెస్టులతో హెచ్సియు అట్టుడుకుతోంది.
అసలు ఈ 400 ఎకరాలపై వివాదమేంటి? ఇది ప్రభుత్వానిదా లేక సెంట్రల్ యూనివర్సిటీదా? ఈ భూమిలో అటవీ జంతువులున్నాయా? ఈ భూమిని ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి?... ఇలా కంచ గచ్చిబౌలి భూవివాదంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ఈ భూవివాదం గురించి డిటెయిల్ గా తెలుసుకుందాం.
HCU భూములపై వివాదం ఏమిటి?
హైదరాబాద్ లో 1974 లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటుచేసారు. గచ్చిబౌలిలో 2300 ఎకరాల విస్తీర్ణంలో విద్యా సదుపాయాలతో క్యాంపస్ ను ఏర్పాటుచేసారు. యూనివర్సిటీ భవనాలు, ఇతర మౌళిక సదుపాయాల కోసం కొంత భూమిని ఉపయోగించుకుని మిగతా భూమిని అలాగే వదిలేసారు.
అయితే కాలక్రమేణా హైదరాబాద్ నగరం విస్తరించడం... మరీ ముఖ్యంగా ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందడంతో గచ్చిబౌలి ప్రాంతం సిటీ మధ్యలోకి వచ్చింది. చుట్టూ భారీ భవనాలు వెలిసినా హెచ్సియు పరిసరాల్లో మాత్రం పచ్చని చెట్లు, అడవి జంతువులతో నిండివుంటుంది. నగరం మధ్యలో ఉన్నా ఈ పచ్చని చెట్ల కారణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
అయితే 2004 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హెచ్సియు సమీపంలోని సర్వే నెంబర్ 25లో గల 400 ఎకరాల భూమిని ఐఎంజి అకాడమీస్ సంస్థకు కేటాయించింది. క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2004 జనవరిలోనే 400 ఎకరాల భూకేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది... కానీ 2006 వరకు అంటే రెండేళ్ళపాటు ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో 2006 నవంబర్ 21న ఈ 400 ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ఐఎంజి సంస్థ కోర్టును ఆశ్రయించింది.
గత రెండు దశాబ్దాలుగా 400 ఎకరాల భూమిపై కోర్టులో విచారణ కొనసాగింది. చివరకు 2024 మార్చి 7న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీన్ని ఐఎంజి సంస్థ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇలా సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత దక్కిన ఈ భూమిని పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్ టిజిఐఐసి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసారు.
అయితే ఓ వివాదం సద్దుమణిగింది అనుకుంటుండగానే ఈ భూములపై మరో వివాదం మొదలయ్యింది. ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే పర్యావరణాన్ని దెబ్బతీసేలా చెట్లను నరికి, అడవి జంతువులను తరిమేసి ఈ భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా విద్యార్థులు, రాజకీయ పక్షాలు ఈ హెచ్సియు భూముల కోసం ఆందోళనలు చేపట్టారు.
కంచ గచ్చిబౌలి భూమి ఎవరిది? ప్రభుత్వానిదా? 'హెచ్సియుదా?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూమి తమదంటే తమదని అటు ప్రభుత్వం, ఇటు హెచ్సియు అంటున్నాయి. కోర్టులో న్యాయపోరాటం చేసిమరీ ఈ భూమి తమదని నిరూపించుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. 2004 లోనే కంచ గచ్చిబౌలిలోని 534 ఎకరాల 28 గుంటల భూమిని హెచ్సియు ప్రభుత్వానికి అప్పగించిందని... ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయంటున్నారు శేరిలింగంపల్లి రెవన్యూ అధికారులు.
కంచ గచ్చిబౌలి భూములకు బదులుగా హెచ్సియుకి ఇదే శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లిలో సర్వే నెంబర్ 36 లో 191 ఎకరాలకుపైగా భూమి, సర్వే నెంబర్ 37 లో 205 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది. ఇలా మొత్తం 397 ఎకరాలు 16 గుంటల భూమిని హెచ్సియుకు కేటాయించామని... ఈ ప్రక్రియ కూడా అప్పుడే ముగిసిందని ప్రభుత్వం చెబుతోంది.
అయితే హెచ్సియు అధికారులు, విద్యార్థులు మాత్రం ఈ భూమి తమదేనని అంటున్నారు. గతంలో తమకు ఈ భూమిని ప్రభుత్వమే కేటాయించిందని... విద్యార్థులకు స్వచ్చమైన వాతావరణం అందించేందుకు చెట్లను నరికివేయకుండా అలాగే ఉంచామని... ఇప్పుడది పెద్ద అడవిని తలపిస్తోందని అంటున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడేలా ఉన్న అటవీ వాతావరణాన్ని నాశనం చేయవద్దని... విధ్వంసం చేయరాదని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇక ఇప్పటికే ఈ భూములను చదునుచేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసారు. భారీగా జెసిబిలతో పొదలను తొలగించి చదును చేస్తున్నారు. ఈ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెచ్సియు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసారు. వారి అరెస్ట్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో హెచ్సియు భూములపై వివాదం మరింత పెద్దదయ్యింది.
ప్రతిపక్ష బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కూడా ఈ హెచ్సియు భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడుకోవడం తగదంటూ ఆందోళన చేపట్టాయి. ఇవాళ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు బిజెపి ఎంపీలంతా ఈ కంచ గచ్చిబౌలి భూములను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కోరారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులు, వివిధ అడవి జంతువులకు నిలయమైన ఈ ప్రాంతం హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కీలకమని అన్నారు. కాబట్టి ఈ భూముని కూడా కాంక్రిట్ జంగిల్ లా మార్చేందుకు రేవంత్ సర్కార్ చేపట్టిన చర్యలను అడ్డుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు తెలంగాణ బిజెపి ఎంపీలు.