తెలంగాణలో కరువు, నీటి కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేసారు. .
Telangana : ఎండాకాలం ఇలా మొదలయ్యిందో లేదో అలా తెలంగాణలో నీటికరువు వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నీటి ఎద్దడితో తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతున్నారని కవిత ఆరోపించారు. నీటి కొరతతో పంటలు దెబ్బతింటున్నాయి... తద్వారా రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు.
గత బీఆర్ఎస్ హయాంలో ఎండాకాలంలో కూడా ఊళ్లలో నీళ్లు ఉండేయని ఆమె అన్నారు. "తెలంగాణకు నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి ఆ నీళ్లను వాడుకున్నాం. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో ఊళ్లల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేవి. అందుకే తెలంగాణలో కరువు వచ్చే ఛాన్సే లేదు. అప్పుడు ఎండాకాలంలో కూడా ఎక్కువ వరి పండించేవాళ్లం" అని కవిత ఏఎన్ఐతో చెప్పారు.
ప్రస్తుత సర్కార్‌ను విమర్శిస్తూ.. నీటి వనరులను సరిగ్గా వాడుకోలేకపోతున్నారని, ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు పోకుండా ఆపలేకపోతున్నారని అన్నారు. "ఈ సర్కార్‌కు నీటిని మేనేజ్ చేయడం చేతకావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు పోకుండా ఆపలేకపోతున్నారు. అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణం బాలేదని సీఎం, సర్కార్ చెప్పడం చాలా సిల్లీగా ఉంది. 'ఎండలు మరీ ఎక్కువ ఉన్నాయి. మేమేం చేయగలం?' అని అంటున్నారు," అని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు కవిత.
"గత 10 ఏళ్లలో మేం రైతులకి నీళ్లు ఇచ్చాం. ఈ సర్కార్ మాత్రం ఫెయిల్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రైతులకి సాయం చేయాలని కోరుతున్నాం" అని కవిత అన్నారు.