Image Credit: TwitterMumbai Indians
Tilak Varma Retire Out: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 16వ మ్యాచ్ లో లక్నో vs ముంబై తలపడ్డాయి. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ముంబై ఇండియన్స్ (MI)ను 12 పరుగుల తేడాతో ఓడించింది.
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్ అద్భుతమైన ప్రదర్శనలతో లక్నో సూపర్ జెయింట్స్ 204 పరుగుల భారీ టార్గెట్ ను ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది. మార్ష్ 31 బంతుల్లో 60 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే, ఐడెన్ మార్క్రామ్ 38 బంతుల్లో 53 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు.
Tilak Varma
ముంబై చేజ్.. తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ !
తిలక్ వర్మ.. సునామీ ఇన్నింగ్స్ లు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్. ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో ముఖ్యంగా టీ20 క్రికెట్ లో సునామీ ఇన్నింగ్స్ తో పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు చాలా సార్లు అద్భుతమైన విజయాలు అందించాడు.
అయితే, లక్నో తో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ కావడం సంచలనంగా మారింది. అదికూడా గెలుపుకు కీలకమైన పరుగులు చేసే సమయంలో అలా చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ముంబై జట్టుతో పాటు అతని నిర్ణయంపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ చేజ్ సమయంలో 19వ ఓవర్‌లో తిలక్ వర్మ టిటైర్డ్ అవుట్ గా క్రీజును వదిలిపెట్టాడు. ముంబై గెలుపునకు 7 బంతుల్లో 24 పరుగులు అవసరమైన సమయంలో ఇలా చేయడం హాట్ టాపిక్ గా మారింది. తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉన్న సమయంలో రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో అతని స్థానంలో మిచెల్ సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు. ఈ వ్యూహాత్మక చర్య మ్యాచ్ ను గెలుచుకోవడం కోసం చేసినట్టుగా ఉంది కానీ, చివరకు ముంబై ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
తిలక్ వర్మ అనేక సందర్భాల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడిన అతని సామర్థ్యాలను బట్టి ఈ నిర్ణయంపై సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ వంటి క్రికెట్ నిపుణుల నుండి విమర్శలు వచ్చాయి. ముంబై నిర్ణయం అస్సలు బాగులేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంటర్న్ కోసం తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తిలక్ కంటే అతను గొప్ప బ్యాటరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
"నా అభిప్రాయం ప్రకారం తిలక్‌ను శాంట్నర్ కోసం రిటైర్ చేయడం పొరపాటు. తిలక్ కంటే శాంట్నర్ మంచి హిట్టరా? అది పొలార్డ్ లేదా మరేదైనా నిష్ణాతుడైన హిట్టర్ అయితే, నాకు అర్థమయ్యేది. కానీ నేను దీనితో ఏకీభవించను. ముంబై ఇండియన్స్ ఏ చేస్తోంది" అని హర్భజన్ సింగ్ అన్నాడు.
భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా ముంబై తీరును ప్రశ్నించాడు. తిలక్ వర్మను ఆర్డర్ మార్చి ఎందుకు బ్యాటింగ్ కు పంపారని ప్రశ్నించాడు. "నామన్ ధీర్ చాలా బాగా బ్యాటింగ్ చేసినప్పటికీ, అతను ఇప్పటికీ 14 నుండి 20వ ఓవర్ పవర్‌ప్లే అని నేను భావిస్తున్నాను. భారతదేశం తరపున 3వ స్థానంలో బాగా బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ, 3వ స్థానంలో ఉండాలి. అలాగే, ఆర్డర్ మార్చినప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. తిలక్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. అస్సలు ఫీల్డింగ్ చేయలేదు... మీరు ఫీల్డింగ్ చేసినప్పుడు, మీకు మ్యాచ్ అనుభూతి కలుగుతుంది. అకస్మాత్తుగా, మీరు బ్యాటింగ్ చేయడానికి వెళితే, అది ఎప్పుడూ సులభం కాదు" అని అన్నాడు.