tablets
ఈ జాబితాలో పెయిన్ కిల్లర్స్, షుగర్ మందులు, రక్తపోటు నియంత్రణకు ఉపయోగించే మందులు, నరాల నొప్పికి ఉపయోగించే ఔషధాలు, సంతాన సాఫల్య మందులు, పోషకాలకు సంబంధించిన మందులు ఉన్నాయి. వీటిలో ఒకే ట్యాబ్లెట్‌లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ మందులను కలిపి తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఔషధ అనుమతి ప్రక్రియను మళ్లీ సమీక్షించాలని, ఇకపై మిశ్రమ మందులకు అనుమతులు ఇవ్వడంలో మరింత జాగ్రత్త వహించాలని CDSCO ఆదేశించింది.
ఇంతకీ FDC అంటే ఏంటి?
ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) అనేది ఒక్కే మాత్రలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ మందులను కలిపి తయారుచేసే ఔషధం. వీటిని కొంతమంది "కాక్‌టెయిల్ పిల్స్" అనే పేరుతో కూడా పిలుస్తారు. తక్కువ ఖర్చుతో త్వరగా ప్రభావం చూపుతాయనే కారణంతో వీటిని ఉపయోగిస్తుంటారు. కానీ శాస్త్రీయంగా వాటి ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.
ఈ విషయమై భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ (DCGI) రాజీవ్ సింగ్ రఘువంశీ, రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోలర్లకు లేఖ రాశారు. ఇందులో 35 అనుమతి లేని ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయాలు, పంపిణీ తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మందులను కేంద్ర డ్రగ్ నియంత్రణ సంస్థ (CDSCO) సురక్షత, ప్రభావిత పరీక్షలు చేయకుండానే కొంతకాలం క్రితం కొన్ని రాష్ట్రాలు అనుమతించాయి. తర్వాత వీటిని రద్దు చేయడం లేదా సంస్థలు స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నాయి.
tablets
ఈ మందులతో వచ్చే సమస్యలు ఏంటంటే.
ఈ మిశ్రమ మందులకు శాస్త్రీయంగా సరైన ఆధారాలు లేకపోవడం వల్ల రోగుల ఆరోగ్యంపై హానికర ప్రభావాలు పడే అవకాశం ఉంది. ఈ మందులు తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌కి కారణమవుతాయని డీసీజీఐ హెచ్చరించింది. దీన్ని ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదంగా పేర్కొన్నారు.
లేఖలో ఏముంది?
2024 ఏప్రిల్ 11న తేదీతో ఉన్న ఈ లేఖలో డీసీజీఐ ఈ వివరాలను పేర్కొంది. “కొన్ని మిశ్రమ మందులకు NDCT రూల్స్ 2019 ప్రకారం అవసరమైన పరీక్షలు నిర్వహించకుండానే తయారీ, విక్రయానికి అనుమతులు ఇచ్చినట్లు గమనించాం. ఇది రోగుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా ఉంటుంది.” అని రాసుకొచ్చారు.
tablets
ఫార్మా కంపెనీల వాదన ఏంటంటే.?
అయితే పలు రాష్ట్రాల్లో అనేక ఔషధాల కంపెనీలు తమకు స్థానిక డ్రగ్ లైసెన్సింగ్ అధికారుల నుంచి అనుమతులు లభించాయని చెబుతున్నాయి. తాము ఏ నియమాలను ఉల్లంఘించలేదని, అన్ని అనుమతులు లభించాకే మందులను తయారు చేశామని షోకాజ్ నోటీసుల సమయంలో కంపెనీలు సమాధానమిచ్చాయి.
ఈ నేపథ్యంలోనే డీసీజీఐ కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని డ్రగ్ నియంత్రణ అధికారులంతా తమ అనుమతి ప్రక్రియను సమీక్షించి, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం NDCT నిబంధనలకు కచ్చితంగా అనుగుణంగా వ్యవహరించాలని తేల్చి చెప్పింది.