20,30 ఏండ్లకే గుండెపోటు.. ఇలా ఎందుకు జరుగుతుంది?

First Published | Dec 2, 2023, 11:57 AM IST

ఒకప్పుడు గుండెపోటు, గుండె జబ్బులు కేవలం 50, 60 ఏండ్ల వారికి మాత్రమే వచ్చేవి. అదీ కాకుండా నూటిలో ఏ ఇద్దరో ముగ్గురికో వచ్చేవి. ఇప్పుడు పెద్దవయసు వారే కాదు.. చిన్న చిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. అసలు  ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి కారణాలేంటో తెలుసా?  
 

ఒకప్పుడు గుండెపోటు అంటే ‘వామ్మో ఫలానా వ్యక్తికి గుండెపోటు వచ్చిందంట’ అని తెగ భయపడిపోయే వారు. ఎందుకంటే అప్పట్లో గుండెపోటు కేసులు చాలా తక్కువగా నమోదయ్యేవి. ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. నడుస్తూ, వాకింగ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, వ్యాయామం చేస్తూ, మాట్లాడుతూ ఉన్నపాటుగా గుండెపోటుతో కుప్పకూలి చనిపోతున్న వార్తలను మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. పెద్దవయసు వారే కాదు 20, 30 ఏండ్లున్న యువకులు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. కామన్ జనాల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మధ్యకాలంలో ఎంతో మంది ఈ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన సంగతి మనందరికీ తెలిసిందే. 
 

హార్ట్ ఎటాక్ అంటే ఏంటి?

సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల మన గుండెకు రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. దీనివల్ల ఛాతీ, మెడ, వీపు లేదా చేతుల్లో బిగుతు లేదా నొప్పిగా అనిపిస్తుంది. అలాగే అలసట, తలతిరగడం, అసాధారణ హృదయ స్పందన, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు యువతకు గుండెపోటు ఎందుకు వస్తుంది? దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Latest Videos


అధిక రక్తపోటు

అధిక రక్తపోటు గుండెపోటుకు ప్రధాన కారణం. మీ రక్తపోటు చాలా సేపటి వరకు ఎక్కువగా ఉంటే మీ ధమనులు దెబ్బతింటాయి. దీంతో గుండెపోటు వస్తుంది. యుక్త వయస్సులో ఉన్న అధిక రక్తపోటు మీ గుండెకు సంవత్సరాల తర్వాత కూడా సమస్యగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ఒక అధ్యయనంలో.. అధిక రక్తపోటు ఉన్న యువకులకు లేట్-లైఫ్ కొరోనరీ హార్ట్ డిసీజ్, గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. వీళ్లు పెద్దయ్యాక వారి రక్తపోటును తగ్గించారా? అనే దానితో సంబంధం లేకుండా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని. అందుకే మీరు యవ్వనంలో ఉన్నప్పుడే రక్తపోటును నియంత్రణలో ఉంచాలి.

ఊబకాయం

ఊబకాయం కూడా గుండెకు రిస్కే. ఊబకాయం అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ఇవన్నీ మీ ధమనుల్లో ఫలకం ఏర్పడటానికి కారణమవుతాయి. దీంతో మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అన్ని వయసుల వారూ ఊబకాయం బారిన పడుతున్నారు. 40 సంవత్సరాలలో ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య ఆరు రెట్లు పెరుగుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. నేచర్ రివ్యూస్ కార్డియాలజీ ప్రకారం.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. 20 లలో ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య వారి 40, 50 లలో ఉన్న వారి సంఖ్యలో సగం అయితే, సగం కంటే ఎక్కువ మంది యువకులు అంటే 56% ఊబకాయం లేదా అధిక బరువుతో ఉన్నారని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ పరిశోధనలో తేలింది. ఏండ్లు గడుస్తున్న కొద్దీ ఈ యువకులు మధ్యవయసు వచ్చేసరికి ఊబకాయం బారిన పడుతున్నారు. 

heart attack

డయాబెటిస్

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నిజానికి డయాబెటీస్ ఉన్నవారు డయాబెటిస్ లేని వారి కంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులోనే గుండెజబ్బులు వస్తాయని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ తో సంబంధం ఉన్న రక్తంలో ఎక్కువ చక్కెర మీ రక్త నాళాలను, మీ గుండెను నియంత్రించే నరాలను దెబ్బతీస్తుంది. టైప్ 2 డయాబెటిస్ చారిత్రాత్మకంగా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధి. కానీ ఈ టైప్ 2 డయాబెటిస్ బారిన టీనేజర్లు కూడా పడుతున్నారు. 10 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న వారు డయాబెటీస్ బారిన పడటం గత రెండు దశాబ్దాలలో రెట్టింపు అయిందని సిడిసి తెలిపింది.

Image: Getty

అధిక కొలెస్ట్రాల్

ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి మీ శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెపోటు వస్తుంది. అధిక కొలెస్ట్రాల్ మీ రక్త నాళాలలో కొవ్వు నిల్వలను ఏర్పరుస్తుంది. ఈ కొవ్వు  నిల్వలు పెరిగేకొద్దీ మీ ధమనుల ద్వారా తగినంత రక్తం గుండెకు అందదు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో పరిశోధన ప్రకారం.. యువకులకు గుండెపోటు రావడానికి అధిక కొలెస్ట్రాల్ కూడా ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. 

కోవిడ్-19

కోవిడ్ -19 ఉన్న 150,000 మందిపై 2022 లో ఒక పరిశోధన నిర్వహించారు. కోవిడ్-19 సోకిన వారిలో 4% మంది గుండె సమస్యలను ఎదుర్కొంటారని అధ్యయనం అంచనా వేసింది. లాంగ్ కోవిడ్ కొంతమందిలో గుండె సమస్యలకు కూడా దారితీస్తుందని తేలింది. రకరకాల అంటువ్యాధులతో హృదయ సంబంధ సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనలో తేలింది.

click me!