ఏప్రిల్ 1, 2025 నుండి భారతీయ పన్ను అధికారులు వాట్సాప్, టెలిగ్రామ్, ఇ-మెయిల్‌ల వంటి కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ మేరకు ఇటీవల లోక్‌సభలో ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఆమోదించారు. ఈ చర్య పన్ను అమలు ప్రక్రియ బలోపేతం అవుతుంది. లెక్కల్లో చూపని డబ్బు, ఆర్థిక అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది.
ప్రభుత్వం ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టింది?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 27న లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న కారణాలు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ క్రిప్టోకరెన్సీలతో సహా వర్చువల్ ఆస్తులను సరిగ్గా లెక్కించేలా చూసుకోవడానికి ఈ బిల్లు రూపొందించామని సీతారామన్ అన్నారు. ఇప్పటి వరకు ఆదాయానికి సంబంధించిన ఆధారాలు డిజిటల్ ఫార్మేట్ లో ఎక్కువగా లేవని, ఉన్నవాటిని కూడా అధికారులు పరిశీలించడానికి అధికారం లేదని అన్నారు. ఈ బిల్లుతో డిజిటల్ ఆధారాలను యాక్సెస్ చేసే అధికారం లభిస్తుందని తెలిపారు.
లెక్కల్లో లేని రూ.250 కోట్ల డబ్బును గుర్తించాం: సీతారామన్
లోక్ సభలో సీతారామన్ మాట్లాడుతూ లెక్కల్లో లేని డబ్బును బహిర్గతం చేయడంలో డిజిటల్ ఆధారాలు సహాయపడిన అనేక సందర్భాలను ఆమె ఉదాహరణలతో సహా చెప్పారు. మొబైల్ ఫోన్లలోని ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల ద్వారా లెక్కల్లో లేని రూ.250 కోట్ల డబ్బును గుర్తించామని సీతారామన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు సంబంధించిన రూ.200 కోట్ల అప్రకటిత ఆస్తులను గుర్తించడంలో వాట్సాప్ సందేశాలు మాత్రమే కీలక పాత్ర పోషించాయన్నారు. ఇలాంటి పన్ను ఎగవేతలను మరింత సమర్థవంతంగా గుర్తించడానికి అధికారులకు చట్టపరమైన అధికారులు కల్పిస్తూ కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ప్రవేశపెట్టామని తెలిపారు.
కొత్త బిల్లు ప్రకారం అధికారులు ఏమి యాక్సెస్ చేయవచ్చు?
కొత్త పన్ను బిల్లు ఆదాయపు పన్ను అధికారులకు విస్తృతమైన డిజిటల్ యాక్సెస్‌ను అందిస్తుంది. అధికారులు వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కమ్యూనికేషన్‌లను పరిశీలించగలరు.
క్రిప్టోకరెన్సీలు, డిజిటల్ టోకెన్లు, వర్చువల్ డిజిటల్ ఆస్తులను చెక్ చేయగలరు. ఈ-మెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ పెట్టుబడి, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆస్తి యాజమాన్య వివరాలను నిల్వ చేసే వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసే హక్కును ఆదాయపు పన్ను అధికారులు కలిగి ఉంటారు.
అంతేకాకుండా ట్యాక్స్ వెరిఫికేషన్ చేసే సమయంలో యాక్సెస్ కోడ్‌లు, ఎన్‌క్రిప్షన్ మెసేజ్ లను కూడా వారు చూసేందుకు అధికారం కలిగి ఉంటారు.