IPL: SRH హైదరాబాద్ నుంచి వెళ్లిపోతోందా? రంగంలోకి రేవంత్ రెడ్డి !

IPL Sunrisers Hyderabad: హెచ్‌సీఏపై ఆరోపణలు చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. 

IPL Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ హోరాహోరీగా జరుగుతుండగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) మధ్య వివాదం ముదిరింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఉచిత టికెట్లు అడుగుతూ బెదిరిస్తోందనీ, ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ మైదానాన్ని విడిచి వెళ్లిపోతామని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన కామెంట్స్ చేసింది. 

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు  టిక్కెట్ల కోసం తమను తీవ్రంగా వేధిస్తున్నారని సన్‌రైజర్స్ యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది. HCA దురుసుగా ప్రవర్తించిందని, బెదిరింపులకు పాల్పడిందని SRH యాజమాన్యం ఆరోపించింది. అదే సమయంలో హైదరాబాద్ జట్టు చేసిన ఆరోపణలను హైదరాబాద్ క్రికెట్ సంఘం ఖండించింది. 

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ డి.బి.శ్రీనాథ్ హెచ్‌సీఏ కోశాధికారి సి.జె.శ్రీనివాస్ రావుకు ఘాటైన లేఖ రాశారు. హెచ్‌సీఏ అధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఎ.జగన్మోహన్ రావు ఉచిత పాస్‌ల కోసం వేధిస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనను మేం సహించం అని డి.బి.శ్రీనాథ్ అన్నారు.


గత రెండు సీజన్లుగా HCA తన ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందనీ, ఈ విషయాన్ని HCA దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. HCA ప్రవర్తన చూస్తుంటే SRH ఈ స్టేడియంలో ఆడకూడదనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. 

ఇది నిజమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో చర్చించి హైదరాబాద్‌ను విడిచి కొత్త స్థలం వెతుక్కుంటామని ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ (క్రీడలు) శ్రీనాథ్ హెచ్చరించారు. గత 12 ఏళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాం. గత సీజన్ నుంచే ఈ సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నారు.

అంతేకాకుండా SRH జనరల్ మేనేజర్ (క్రీడలు) శ్రీనాథ్ ఒక ప్రకటనలో గతంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతి సీజన్‌లో వారికి 50 ఉచిత టిక్కెట్లు (F12A బాక్స్) ఇస్తున్నట్లు తెలిపారు. 

సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్ నుంచి వెళ్లిపోతుందన్న వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని హెచ్‌సీఏ బెదిరిస్తోందన్న వార్తపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ కె.శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రికెట్ మ్యాచ్‌ల కోసం పాస్‌లు అడిగి ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికి ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Latest Videos

click me!