కేంద్ర ప్రభుత్వంలోని 23 లక్షల మంది ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. పెన్షన్ స్కీమ్స్ గురించి వస్తున్న అనేక రూమర్స్ కి ఈ వార్తతో చెక్ పడినట్లు అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. దీని పేరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS). దీన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తీసుకురానున్నారు. దీనికి అర్హులు ఎవరు, బెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
23 లక్షల మందికి ఉపయోగం
కొత్త పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ, 25 సంవత్సరాల కంటే తక్కువ పనిచేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల కనీసం రూ.10,000 పెన్షన్ లభిస్తుంది. పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే అతని కుటుంబ సభ్యులు చివరి పెన్షన్‌లో 60 శాతం పెన్షన్‌గా పొందుతారు. ఈ పథకం ద్వారా రిటైర్ అయిన తర్వాత దేశ వ్యాప్తంగా కనీసం 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక భద్రత కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
UPS ఎలా ప్రారంభించబడింది
ఇప్పటి వరకు ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) వల్ల ఎటువంటి స్థిరమైన ఆదాయం రాదు. మార్కెట్ ఆధారిత ఆదాయాన్ని మాత్రమే అందిస్తుంది. అయితే కొత్త పథకం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS) వల్ల నికరంగా ఫిక్స్‌డ్ ఆదాయం లభిస్తుంది. ఈ స్కీమ్ కొత్త వారికే కాకుండా ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా UPSకు మారవచ్చు.
ఇది కూడా చదవండి ఏటీఎంలో డబ్బులు తీస్తే ఇకపై ఛార్జీల మోతే.. మే 1 నుండి కొత్త రూల్స్
హైబ్రిడ్ ఫెన్షన్ పథకం ఇది..
పాత పెన్షన్ పథకం(OPS) 2004లో NPSగా మార్పు చెందింది. NPSలో ఉన్న లోటుపాట్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగులలో పెరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం UPSను ప్రారంభిస్తోంది.
UPS అనేది పాత పెన్షన్ పథకం (OPS), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో ఉండే ముఖ్యమైన విషయాలను కలిపి హైబ్రిడ్ మోడల్ గా రూపొందించారు.
వారం క్రితమే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏప్రిల్ 1 నుంచి పోర్టల్‌లో UPSకు దరఖాస్తు చేసుకోవచ్చు.