సాధారణంగా చాలా కంపెనీలు తక్కువ జీతంతో ఉద్యోగులను ఎలా తీసుకోవాలి. తక్కువ ఖర్చులో కంపెనీని ఎలా రన్ చేయాలనే ఆలోచిస్తుంటాయి. కానీ ఉద్యోగి చనిపోయాక కూడా అతని కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలని అనుకునేవి మాత్రం తక్కువే. ఉద్యోగి చనిపోయాక అతని భార్యకు పదేళ్లపాటు జీతం ఇచ్చే కంపెనీ ఏంటో మీకు తెలుసా?
ఈ మధ్య కొన్ని కంపెనీల్లో ఉద్యోగులకు ఉండే టెన్షన్ల గురించి చెప్పనవసరం లేదు. పని ఒత్తిడి కారణంగా చాలా మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇంకా కొన్నిచోట్ల అయితే ఉద్యోగి ఎంత బాగా పనిచేసినా సరైన జీతం ఇవ్వరు. ఉన్నదాన్ని పెంచరు. ప్రమోషన్ ఇవ్వరు. అంతేకాదు ఎంత మంచిగా పనిచేసినా ఒక్కోసారి వాళ్ల ఈగోతో ఉద్యోగుల్ని సడెన్‌గా తీసేస్తుంటారు. ఇలాంటి సంస్థలు ఉన్న ప్రస్తుత కాలంలో ఒక ఉద్యోగి చనిపోయాక కూడా వాళ్ల కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చే కంపెనీ ఒకటి ఉంది! అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కో కంపెనీ ఒక్కోలా పనిచేస్తుంది. చాలా కంపెనీలు ఉద్యోగులకు మంచి సదుపాయాలు ఇస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కూడా డబ్బులు వస్తాయి. కుటుంబానికి కూడా ఆర్థిక సదుపాయాలు ఉంటాయి.
కొన్ని కంపెనీల్లో అధికారులు తమ ఉద్యోగులను చాలా హీనంగా చూస్తారు. ఈ మధ్య పీఐపీ పేరుతో తమకు నచ్చని ఉద్యోగులను పనిలోంచి తీసేస్తున్నారు. బాగా పనిచేసే ఉద్యోగి బిహేవియర్ గురించి కంపెనీ అధికారి ఏవేవో నిందలు వేసి, పనిలోంచి తీసేయలేరు. ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్లొచ్చు అనే భయం అధికారులకు ఉంటుంది. కాబట్టి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ కింద ఉద్యోగి సరిగ్గా పనిచేయట్లేదని, ఒక నెల టైం ఇస్తారు. ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి సాధించలేని టార్గెట్ ఇస్తారు. ఆ ఉద్యోగి టార్గెట్ సాధించలేడు. అప్పుడు వాళ్లను పనిలోంచి బయటకు పంపిస్తారు. ఇలాంటి మనస్తత్వాల వల్ల చాలా టాలెంట్ ఉన్నవాళ్లు కూడా అవకాశాలు కోల్పోతున్నారు.
ఇలాంటివి జరుగుతున్న ప్రస్తుత కాలంలో గూగుల్ కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల కుటుంబానికి కూడా సహాయం చేస్తోందట. ఉద్యోగి చనిపోయాక కూడా వాళ్ల కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తోందట. గూగుల్ ఉద్యోగి చనిపోతే చాలా ఏళ్లపాటు కుటుంబానికి ఆర్థికంగా భద్రత ఉంటుందట. జీవిత భాగస్వామికి ఉద్యోగి జీతంలో 50 శాతం పదేళ్లపాటు, ప్రతి నెలా ఇస్తారట. దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడే అవకాశం ఉంటుంది.
అంతేకాదు చనిపోయిన ఉద్యోగి పిల్లలకు 19 ఏళ్లు వచ్చే వరకు లేదా చదువు పూర్తయ్యే వరకు నెలకు కొంత మొత్తంలో డబ్బులు ఇస్తారట. ఇది వారి కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఉద్యోగుల కోసం..
ఫ్రీ హెయిర్ కట్, ఫుడ్, ఆన్‌లైన్ డాక్టర్, క్యాబ్, జిమ్, ఇంటర్నెట్ సదుపాయం, వర్క్ ఫ్రం హోమ్ (కొందరికి మాత్రమే) లాంటి సదుపాయాలు ఉన్నాయి. ఇంకా ఆఫీసులో పనిచేసే వాళ్లకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని టైంకు తగ్గట్టు టిఫిన్, భోజనం, టీ, కాఫీ, జ్యూసులు ఇస్తారట. ఉద్యోగి చనిపోయాక కూడా వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడం గొప్పవిషయమని నిపుణులు అభిప్రాయపడతున్నారు.
గమనిక
ఈ విషయం గురించి గూగుల్ సీఈవో మాట్లాడలేదు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ విషయం గురించిన సమాచారం పంచుకుంది. సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ అవుతోంది.