ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ ఉపయోగించి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. అయితే కొన్ని అవసరాలకు కచ్చితంగా డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది. దీంతో ఏటీఎంలకు వెళ్లి విత్ డ్రా చేస్తారు. అయితే ఇకపై డబ్బు విత్ డ్రా చేస్తే ఇంటర్ఛేంజ్ ఛార్జీలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏటీఎం లావాదేవీ ఛార్జీలను రిజర్వ్ బ్యాంక్ పెంచేసింది.
అకౌంట్ ఉన్న సొంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకు ఏటీఎంలు ఉపయోగిస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఇప్పుడు పెంచిన ఛార్జీలను ఇంటర్ఛేంజ్ ఛార్జీలు అంటారు.
రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం మే 1వ తేదీ నుండి బ్యాంక్ కస్టమర్‌లు తమ ఖాతా ఉన్న బ్యాంక్ నెట్‌వర్క్ కాకుండా ఇతర బ్యాంక్ ఏటీఎం మెషిన్ నుండి లావాదేవీలు చేస్తే ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. డబ్బు తీసుకోవడమే కాదు, బ్యాలెన్స్ చెక్ చేసినా ఛార్జీ చెల్లించాలి.
ఏటీఎం ఇంటర్ఛేంజ్ ఛార్జీలు
ప్రస్తుతం ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎం కాకుండా ఇతర ఏటీఎంలను ఉపయోగిస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది మే 1 నుండి మరింత పెరగనుంది. ఈ పెరుగుదల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రతిపాదన ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఎంత పెంచాలన్నది నిర్ణయించింది.
బ్యాంక్ వినియోగదారులకు ప్రతి నెల కొన్ని ఉచిత లావాదేవీలు లభిస్తాయి. అంటే సొంత బ్యాంకు ఖాతా అయితే ఎన్ని సార్లయినా విత్ డ్రా చేసుకోవచ్చు. కాని ఇతర బ్యాంకు ఏటీఎంలు అయితే నెలకు లిమిటెడ్ సార్లు మాత్రమే మనీ విత్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ లిమిట్ ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంటుంది.
ఎంత ఛార్జీలు పెంచారు
ఇప్పటి వరకు కస్టమర్‌లు తమ సొంత బ్యాంక్ ఏటీఎంకి బదులుగా వేరే నెట్‌వర్క్ ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటే వారు ఒక లావాదేవీకి రూ.17 ఛార్జీ చెల్లించాలి. ఇది మే 1 నుండి రూ.19కి పెరుగుతుంది. ఇది కాకుండా ఇతర బ్యాంక్ ATM నుండి బ్యాలెన్స్ చెక్ చేయడానికి రూ.6 ఛార్జీ వసూలు చేసేవారు. అది ఇకపై రూ.7కి పెరుగుతుంది.
ఇది కూడా చదవండి మార్చి 31 లోపు ఈ 3 పనులు చేయకపోతే చాలా నష్టపోతారు
ఏటీఎం ఇంటర్ఛేంజ్ ఛార్జీలు అంటే ఏమిటి?
ఆర్బీఐ ఇప్పుడు పెంచిన ఛార్జీలను ఇంటర్ఛేంజ్ ఛార్జీలు అంటారు. వాస్తవానికి ఈ ఛార్జీలను బ్యాంకులు చెల్లిస్తాయి. అంటే ఒక బ్యాంకు కస్టమర్ మరొక బ్యాంకు ఏటీఎంను ఉపయోగించి డబ్బు తీసుకున్నందుకు గాను ఆ బ్యాంకు తన కస్టమర్ తరఫున మరొక బ్యాంకుకు ఇంటర్ఛేంజ్ ఛార్జీ చెల్లిస్తుంది. అయితే ఈ డబ్బును తర్వాత కస్టమర్ల నుంచే వివిధ రూపాల్లో వసూలు చేస్తారు. అందువల్ల ఫైనల్ గా కస్టమర్లకే ఈ ఛార్జీల బాదుడు.