హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేయడంతో ప్రతిఘటించిన నటిపై దాడి జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
మహిళలు బయిటకు వచ్చేటప్పుడు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్దితులు కనపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో బాలీవుడ్ నటిపై దాడికి పాల్పడిన ఘటన అందరినీ ఎలట్ చేస్తోంది. ముంబయిలో ఉంటున్న ఓ నటిని (30)కి ఈ నెల 17న హైదరాబాద్‌కు చెందిన ఓ స్నేహితురాలు ఫోన్ చేసి షాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా రావాలని పిలిచింది. ఈవెంట్ లో పాల్గొన్నందుకు విమానఛార్జీలు, రెమ్యునరేషన్ చెల్లిస్తారని చెప్పింది. దీంతో ఈ నెల 18న నగరానికి వచ్చిన సదరు నటి మాసబ్‌ట్యాంక్ శ్యామ్‌నగర్‌కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో బస చేశారు. అక్కడ ఓ వృద్ధురాలు నటికి అవసరమైన వసతులు ఏర్పాటు చేశారు.
అయితే ఊహించని సంఘటన ఆ రాత్రి జరిగింది. 21న రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు నటి ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి తమతో కలసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. అదే రోజు 11 గంటలకు ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి తెచ్చారు. ఎదురుతిరిగిన ఆమెపై దాడి చేశారు.
బాధితురాలు గట్టిగా అరిచి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించగానే ముగ్గురు పారిపోయారు. వృద్ధురాలు, ఇద్దరు మహిళలు నటిని గదిలో బంధించి రూ.50 వేల నగదుతో వెళ్లిపోయారు. బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో మాసబ్‌ట్యాంక్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.