గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ... ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తూ మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తూ మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పేరిట బాలింతలకు ఉపయోగపడే వస్తువలను ఉచితంగా అందిస్తున్న కేసీఆర్ సర్కార్ ఇదే స్పూర్తితో గర్బిణుల్లో పౌష్టికాహార లోపాలను నివారించేందుకు కేసీఆర్ పోషకాహర కిట్ ను అందించడానికి సిద్దమయ్యింది. ఇందులో భాగంగా 9 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ న్యూట్రిషన్ కిట్ పంపిణీని ఇవాళ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కామారెడ్డి కలెక్టరేట్ నుండి ప్రారంభించారు. కామారెడ్డిలో మంత్రులు హరీష్, ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ న్యూట్రిషన్ కిట్ పంపిణీని ప్రారంభించారు. ఇక్కడినుండే మిగతా ఎనిమిది జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వర్చువల్ మోడ్ లో ప్రారంభించారు హరీష్ రావు. ఇలా ఆదిలాబాద్ -ఇంద్రకరణ్ రెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్- బాల్క సుమన్, భద్రాద్రి కొత్తగూడెం - పువ్వాడ అజయ్, ములుగు - సత్యవతి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లి - ఎర్రబెల్లి దయాకర్ రావు, వికారాబాద్ - సబిత ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ - శ్రీనివాస్ గౌడ్, గద్వాల్ - నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.